ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం సమీక్ష
మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో వొచ్చే నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో అన్నింటినీ చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మంగళవారం సచివాలయం కేంద్రంగా జరిగిన అన్ని జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి ఖమ్మం జిల్లా నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మన సమాజంలో సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుందని, ఆ లక్ష్యం మేరకు రాష్ట్రంలో వివిధ జాతుల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరముందని, అప్పుడే మనం మన సమాజంలో సమానత్వం కోసం విధానాలను రూపొందించగలమని అన్నారు. రాష్ట్రంలో సామాజిక సర్వే ఈ ఉదాత్తమైన లక్ష్యాన్ని సాకారం చేసుకుంటుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా పర్యవేక్షించించడం, ప్రతి ఎన్యుమరేటర్కు ఎన్యుమరేషన్ బ్లాక్ మ్యాప్, గృహ సర్వే షెడ్యూల్, ఎన్యూమరేటర్స్ మాన్యువల్ అందే విధంగా చూసుకోవాలని చెప్పారు.
ఎన్యుమరేటర్లకు సమర్థవంతంగా శిక్షణ ఇవ్వాలని, వారికి కేటాయించిన సర్వే షెడ్యూల్లో చేర్చబడిన 50 ప్రశ్నలపై పూర్తి అవగాహన ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు వారికి శిక్షణ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఎన్యూమరేటర్లు ముందుగా ఇంటి జాబితాను పూర్తి చేసి, పాఠశాల వేళల తర్వాత ప్రతిరోజూ 5-7 ఇళ్లను సందర్శించడం ద్వారా ఇంటి షెడ్యూల్ను ప్రారంభించాలని, సర్వేలో నిర్వహణను పటిష్టంగా చేపట్టి నాణ్యమైన అవుట్పుట్ పొందడానికి అవసరమైన సమయాన్ని కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బందికి ఆకర్షణీయమైన వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సర్వే ను నిర్వహించడంలో క్షేత్ర స్థాయిలో గ్రామాలు, పట్టణాలను సందర్శించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సర్వే నిర్వహణపై ప్రతి రోజు పర్యవేక్షక సిబ్బందితో సమీక్ష నిర్వహించాలని అన్నారు. సర్వే గురించి టామ్ టామ్ బీట్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రకటించాలని అన్నారు. సామాజిక కుల గణనను ప్రచారం చేయడానికి మీడియాను సమర్థవంతంగా ఉపయోగించాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల కేంద్రాల నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, డి.అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉప ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్. హరీష్ తదితరులు పాల్గొన్నారు.