తెలంగాణ దేశానికి మోడల్ గా మారాలి..

గాంధీ కుటుంబం మాటిస్తే తిరుగు లేదు.
ఇక్క‌డి నుంచే మోదీపై యుద్ధం ప్ర‌క‌టించాలి..
ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే కుల గణన దేశానికి ఆదర్శం
నవంబర్ 30 లోగా కులగణన పూర్తి చేయాలి
గాంధీ భవన్ లో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాల‌ని,ఆ దిశగా కుల‌గ‌ణ‌న‌ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు సూచించారు.  తెలంగాణ మోడల్ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుంద‌ని, నవంబర్ 30 లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాల‌ని, తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించాల‌ని పిలుపునిచ్చారు.. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని అన్నారు. బుధ‌వారం గాంధీభ‌వ‌న్ లో కుల‌గ‌ణ‌న‌పై అవ‌గాహ‌న స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఇదే విష‌య‌మై సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వొచ్చినా, అడ్డంకులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియమ్మ సఫలీకృతుల‌య్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నెరవేర్చారని, గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వొచ్చినా అది నెరవేర్చి తీరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు.రేవంత్ రెడ్డి రెడ్డినా, మహేష్ గౌడ్ గౌడా అనేది కాదు.. మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం అని అన్నారు. రేవంత్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చింద‌ని, మీరంతా కష్టపడితేనే త‌న‌కు ఈ బాధ్యత వొచ్చింది తెలిపారు.

గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదు. చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేన‌ని అన్నారు. పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం అని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ ని బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించుకున్నామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్, నాయ‌కుల‌పై ఉంద‌న్నారు.కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని రేవంత్ రెడ్డి సూచించారు. బాధ్యతగా పని చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌.కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని హెచ్చరించారు.  ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమ‌ని, భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామ‌ని తెలిపారు.ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి.జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్ ను కొట్టేసింది. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారని వివ‌రించారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు.. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప… వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని, ప్ర‌తిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page