కుల‌గ‌ణ‌న ప‌రిశోధ‌న కేంద్రంగా తెలంగాణ‌

దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నాం..
ప్ర‌జ‌లంద‌రికీ సామాజిక న్యాయ‌మే ల‌క్ష్యం
ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌
గాంధీభ‌వ‌న్ లో కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో భేటీ

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : కుల గణన విష‌యంలో పరిశోధన కేంద్రంగా తెలంగాణ దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తెలిపారు. కుల గ‌ణ‌న‌ సర్వేపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కాంగ్రెస్ కీలక నేతలతో  గాంధీభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స‌మావేశ‌మ‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ, అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వం పెంపొందించుకోవడానికి రాజ్యాంగాన్ని రచించుకొని, శాసనంగా రూపొందించుకున్నామ‌ని తెలిపారు. కుల గణన ద్వారా సమాజంలో ఎక్స రే నిర్వహించి.. సమాజానికి చికిత్స చేయాలని రాహుల్ గాంధీ భావించార‌ని, ఎన్నికల హామీలో భాగంగా కుల గణన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని డిప్యూటీ సీఎం తెలిపారు. కుల గణ‌నకు తెలంగాణ పరిశోధన కేంద్రంగా.. ఒక మోడల్ గా నిలిచి దేశానికి సందేశం ఇవ్వబోతుందని అన్నారు. గాంధీ భవన్ లో ప్ర‌స్తుత స‌మావేశం  చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మన  నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేసి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారని వివరించారు.

మోటార్ సైకిల్ మెకానిక్ నుంచి, దళితులు, గిరిజనులతో కలిసి వంట చేసుకుని వారితో తిరిగారని, వారి నుంచి వివిధ అంశాలు తెలుసుకున్నారని తెలిపారు. అంతిమంగా ఈ దేశ వనరులు, ఆస్తులు అందరికీ సమానంగా దక్కడం లేదని ఆయ‌న గుర్తించార‌ని వివరించారు. కుల గణన ద్వారా సమస్యలు తెలుసుకుని చికిత్స చేసినప్పుడే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లు అవుతుందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్న రాగానే దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక మోడల్ గా కుల గణన చేపడుతుందని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన‌ విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి యావత్ క్యాబినెట్ సమావేశమై కులగణనకు క్యాబినెట్లో తీర్మానం చేశామని తెలిపారు. శాసనసభలో విస్తృత స్థాయిలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనవిజయంగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ తీర్మానం ఆధారంగా 10- 10- 2024న సమగ్ర కుల గణనకు ప్రణాళిక శాఖ ద్వారా చేపట్టేందుకు జీవో జారీ చేసినట్లు వివరించారు. ఈ సర్వేలో ఏ సమాచారం సేకరించాలి, ఏ ప్రశ్నలు ఉండాలనే విష‌యాల‌ను తెలుసుకోవడం కోసమే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు ఇచ్చే సమాచారం, ప్రశ్నలు తప్పకుండా సర్వేలో పొందుపరుస్తామ‌న్నారు. ఈ సర్వేపై సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు.. ఆయా శాఖల ఉన్నదా అధికారులను భాగస్వాములను చేస్తున్నట్టు తెలిపారు. సమాజంలోని వాటాదారుల అందరి ఆలోచనలు పొందుపరిచి సర్వే స్పష్టంగా జరిగేలా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సోషియో, ఎడ్యుకేషన్, ఎకాన‌మీ, పొలిటికల్ అన్ని అంశాలపై సమాచారాన్ని సర్వేలో సేకరిస్తామన్నారు. భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ను తూచా తప్పకుండా పాటిస్తూ.. సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా సమాజంలోని రోగాలకు చికిత్స చేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ సైనికులుగా ఆయన ఆలోచనలను పకడ్బందీగా అమలు చేసి చూపించాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని తెలిపారు.

జిల్లాస్థాయిలో కాంగ్రెస్ కమిటీలు విస్తృతంగా అభిప్రాయాలను సేకరిస్తాయని, రాష్ట్రస్థాయిలో మేధావులు, సామాజికవేత్తలు, ప్రగతిశీల వాదులతో ఈనెల 5న హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించామ‌ని తెలిపారు. సమాజంలో ఉన్న వనరులు అందరికీ సమానంగా అందుతున్నాయా లేదా అనేది సర్వే ఆధారంగా.. స్పష్టమవుతుందని,  ఆ సమాచారం ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఈ సమాజం ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగడానికి కుల గణన సర్వే ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page