”నంద‌నవ‌నం” ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అర్హుల‌కు న్యాయం చేయాలి
గృహ‌నిర్మాణానికి సంబంధించిన‌ ఫిర్యాదులకు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం..
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : రంగారెడ్డి జిల్లా ఎల్‌బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నంద‌న వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణమే ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం స‌చివాల‌యంలో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని మంకాల్, నంద‌న‌వ‌నంలో ఉన్న ఇండ్ల స‌మ‌స్య‌, కేటాయింపుపై అధికారుల‌తో మంత్రి స‌మావేశమ‌య్యారు. ఇందులో హౌసింగ్ సెక్ర‌ట‌రీ జ్యోతి బుద్ధ‌ప్ర‌కాష్‌, ప్ర‌జావాణి నోడ‌ల్ ఆఫీస‌ర్ డి.దివ్య‌, ప్ర‌స్తుత రంగారెడ్డి క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి, గ‌తంలో రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్లుగా ప‌నిచేసిన డాక్ట‌ర్ ఎస్. హ‌రీష్‌, కె. శ‌శాంక్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్ర‌మంగా ప్ర‌భుత్వ ఇండ్ల‌ను ఆక్ర‌మించుకున్నవారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఎలాంటి రాజకీయ వొత్తిడుల‌కు త‌లొగ్గ‌వ‌ద్ద‌ని అధికారుల‌కు సూచించారు.

నంద‌నవ‌నంలో జెఎన్ యూఆర్ఎం ప‌థ‌కం కింద ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల కోసం 2019లో ద‌ర‌ఖాస్తు చేసుకొని, ల‌బ్దిదారుడి వాటా చెల్లించిన వారి ఇండ్ల‌ను కొంత‌మంది అక్ర‌మంగా ఆక్ర‌మించుకోవ‌డంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని , అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న వారి నుంచి ఇండ్లు స్వాధీనం చేసుకోవాల‌న్నారు. అలాగే మంకాల్‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో ఉన్న న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి, అర్హుల‌కు కేటాయించాల‌ని సూచించారు. ఈ రెండు అంశాల‌పై పూర్తిస్థాయి నివేదిక‌ను త‌న‌కు అందించాల‌ని, వీలైనంత త్వ‌రిత‌గ‌తిన ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నిరుపేద‌ల‌కు అన్యాయం జ‌రిగితే ఈ ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ప్ర‌జావాణిలో గృహ‌నిర్మాణానికి సంబంధించి వొచ్చే ఫిర్యాదులను స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యానికి పంపించాల‌ని నోడ‌ల్ అధికారి దివ్య‌కు సూచించారు. వాటి ప‌రిష్కారానికి త‌న కార్యాల‌యంలో ఒక ప్ర‌త్యేక అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page