బిఆర్‌ఎస్‌కు ఉద్యమ చరిత్రే తప్ప పాదయాత్ర చరిత్రలేదు

ఒకటికాదు, రెండు కాదు 2013లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు పదకొండు నెలల కాలంగా ఆయన తన మౌనదీక్షను వీడకపోవడం పార్టీ కార్యకర్తల్లో న్కెతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. దానికి తగినట్లు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్‌చేశానని, త్వరలో బావ (హరీష్‌రావు)తో బావమరిది (కెటిఆర్‌)ను ఫినిష్‌ చేస్తానని, ఆ తర్వాత హరీష్‌రావును ఎలా మలుచుకోవాలో తమకు తెలుసన్నమాటలు ఇక బిఆర్‌ఎస్‌ భవిష్యత్‌ ఏమిటన్న ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.

 (మండువ రవీందర్‌రావు)
భారత రాష్ట్ర సమితికి ఇప్పటివరకు ఉద్యమ చరిత్రేగాని, పాదయాత్ర చరిత్రలేదు. త్వరలో ఆ అంశాన్ని కూడా పూర్తిచేసేందుకు సన్నాహమవుతున్నది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తన ఎక్స్‌ వేదికగా ఆ అంశాన్ని వెల్లడిరచి  అందరినీ ఆశ్చర్యపర్చారు. ఇప్పటివరకు అధికారం చేపట్టిన విభిన్న రాజకీయ పార్టీలకు పాదయాత్రలు కలిసి వొచ్చాయన్నది కాదనలేని నిజం. పది నెలల కింద తెలంగాణలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీకికూడా ఈ పాదయాత్రలే దోహదపడ్డాయి. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడోతోపాటు విడుతల వారీగా చేసిన పాదయాత్రలు ఆయనను  ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డా. వైఎస్‌ ఆంధ్ర, తెలంగాణలో చేసిన పాదయాత్రలు ఆయన అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబునాయుడు, 2019లో వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్రలు వారిని ముఖ్యమంత్రులను చేశాయి.

కాగా ఇరవై ఏండ్ల ఉద్యమ ప్రస్థాన ఫలితంగా నాటి టిఆర్‌ఎస్‌, నేటి బిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు రెండు విడుతలుగా పదేళ్ళపాటు అధికారాన్నిచ్చిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్‌ సాధిస్తామన్న ధీమాతోఉన్న ఆపార్టీని రాష్ట్ర  ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అది మొదలు ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు  తాకుతూనే ఉన్నాయి. రాజకీయంగా ఆపార్టీ రాష్ట్రంలో తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కుంటున్నది. పార్టీ టికెట్టుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు  పార్టీని వీడిపోతున్నా వారిని నిరోధించలేని  పరిస్థితిలో పారీ ఉంది. పార్టీని వీడి పోతున్నవారంతా పార్టీ పైన తీవ్రాతి తీవ్రంగా అభాండాలు వేస్తున్నా నిస్సాహయతను వ్యక్తం చేస్తున్నది. పార్టీలో ప్రధాన నాయకులుగా చెలామణి అవుతున్న హరిష్‌రావు, కెటిఆర్‌లు తప్ప ఇతర నాయకులెవరూ ఆరోపణలపై పెద్దగా స్పందిస్తున్నదిలేదు.

ఇలాంటి పరిస్థితిలో అధికార కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సకాలంలో నెరవేర్చకపోవడం, హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ అంశాలు బిఆర్‌ఎస్‌కు కలిసి వొచ్చాయి. ఆ పార్టీ మళ్ళీ ప్రజల మధ్యకు వేళ్ళేందుకు, ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ఒక అవకాశం ఏర్పడిరది . అయితే బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మౌనం ఆపార్టీ వర్గాలను అయోమయంలో పడవేస్తున్నది. ఒకటికాదు, రెండు కాదు 2013లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు పదకొండు నెలల కాలంగా ఆయన తన మౌనదీక్షను వీడకపోవడం పార్టీ కార్యకర్తల్లో న్కెతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. దానికి తగినట్లు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్‌చేశానని, త్వరలో బావ (హరీష్‌రావు)తో బావమరిది (కెటిఆర్‌)ను ఫినిష్‌ చేస్తానని, ఆ తర్వాత హరీష్‌రావును ఎలా మలుచుకోవాలో తమకు తెలుసన్న మాటలు ఇక బిఆర్‌ఎస్‌ భవిష్యత్‌ ఏమిటన్న ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.

సుమారు రెండు దశాబ్ధాల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కున్న బి(టి)ఆర్‌ఎస్‌ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక పోతుందా అన్న భావన ప్రజల్లో ఏర్పడుతున్నది. దాన్నుండి పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నేతలకు ఏర్పడిరది . ముఖ్యంగా కెసిఆర్‌ మౌనం వెనుక అర్థమేంటన్న విషయంపైన ప్రథానంగా కార్యకర్తలకు, ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిరది . ఈ మౌనం అలానే కొనసాగితే పార్టీ మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే 2017లో దేశంలో జమిలి ఎన్నికలు వొచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకు పార్టీని సన్నద్దం చేసుకోవాల్సిన అవసరముంది.

వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకుని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా కెటిఆర్‌ నిన్న ఎక్స్‌ ట్విట్టర్‌లో స్పందించి ఉంటారనుకుంటున్నారు. ఆస్క్‌ కెటిఆర్‌ క్యాంపేయిన్‌లో యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించిన తీరు త్వరలో పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అందులో భాగంగానే ఆయన తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాస్తవంగా ఈ పాదయాత్రలను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే చేస్తుంటాయి. అధికారంలోకి వొచ్చిన తర్వాత ప్రజల మధ్యకు వెళ్ళి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు పాదయాత్రలు జరిపిన అధికార పార్టీ అంటూ ఏదీలేదు. కనీసం వారి గోడును పట్టించుకోవాలన్న సోయికూడా అధికారపార్టీకి ఉండదు.

ఏదిఏమైనా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయనున్నట్లు కెటిఆర్‌ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆకాంక్షకూడా అదేనన్న అంశాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోవడం, మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను నిలుపుకోలేకపోవడం, రైతుల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నమైన విషయం, కేవలం పది నెలల పాలనలో తెలంగాణకు కోలుకోలేనంత నష్టాన్ని కలిగించినతీరు తదితర అంశాల ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్ళాలన్నది పార్టీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇంతవరకు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన పార్టీ ఏదీలేదు. కెటిఆర్‌ చెప్పినట్లు ఆయన మొత్తం రాష్ట్రాన్ని చుట్టబెడుతారా? ఎక్కడినుండి ఎక్కడికి, ఎన్నిరోజులు యాత్ర చేస్తారన్న విషయాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ యాత్ర రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఎంతవరకు విజయాన్ని చేకూరుస్తాయన్నది భవిష్యత్‌ నిర్ణయిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page