తెలుగుకు పట్టాభిషేకం..
మారిషస్ ద్వీపంలో భారతీయ కార్మికుల రాకను గుర్తు చేసు కోవడానికి మారిషస్ నవంబర్ నెలలో భారతీయ రాక దినోత్సవంగా జరుపుకుంటుంది. 1834లో ప్రైవేట్ ఇంపోర్టేషన్ స్కీమ్ క్రింద భారతీయులు మారిషస్ కు జీవనోపాధి కోసం వలసకార్మికులుగా వెళ్లడం ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు నెలలో బొంబాయి నుండి సారాలో 39 మంది ఉచిత కూలీలతో కూడిన బ్యాచ్ కాలనీకి చేరుకుంది. ఈ కార్మికులు నవంబర్ 2, 1834 ఆదివారం నాడు కాలనీకి చేరుకున్నారు. వారి ల్యాండిరగ్ కు నవంబర్ 3 సోమవారం నాడు అనుమతి లభించింది. మరుసటి రోజు వారు మారిషస్ గడ్డపై అడుగు పెట్టారు. అక్కడ వారు ‘ఆంటోయినెట్’ షుగర్ ఎస్టేట్లో పనికి వెళ్లారు. వీరికి నెలవారీ జీతం ఐదు రూపాయలు కాగా ఆరు నెలల జీతం అడ్వాన్స్ పొందారు. 1843 సంవత్సరంలో దాదాపు 35 ఓడల్లో భారతీయులు మారిషసు వలస వచ్చారు. వారిని తీసుకుని వచ్చిన ఓడల పేర్లు సిటీ ఆఫ్ లండన్, కింగ్ స్టన్, ఫ్లవర్ ఆఫ్ ఉగీర్, సుల్తాన్, సిరంగపట్నం, బాబా బ్రాహ్మిన్, కోరంగి పికేట్ మొదలైనవి. నేడు మారిషస్ జనాభాలో 68% కంటే ఎక్కువ మంది భారతీయ మూలానికి చెందిన వారు, సాధారణంగా ఇండో – మారిషియన్లు అని పిలుస్తారు.
భారతీయ ఆగమన దినోత్సవాన్ని పురస్కరించుకుని, మారిషస్ పోస్ట్ 1978లో 1.50 మారిషస్ రూపాయల విలువ కలిగిన స్టాంపును విడుదల చేసింది. ఆఫ్రికా ఖండ తీర ఆగ్నేయ తీరప్రాంతాల్లో 2000లో మీటర్ల దూరంలో హిందూ మహా సముద్రంలో ఉన్న ద్వీప దేశం మారిషస్. 2040 చ.కి.మీల వైశాల్యం కలిగి, పోర్టు లూయిస్ రాజధానిగా దాదాపు 12 లక్షల పై చిలుకు జనాభా కలిగి, ఆంగ్లం, తెలుగు అధికార భాషలుగా, మారిషియన్ క్రియోల్, ఫ్రెంచి, చైనీస్ ఉర్దూలతో పాటు, భోజ్ పూరి, మరాఠీ, తమిళం, ఉర్దూ తదితర భారతీయ ప్రాంతీయ భాషలు గా కలిగి ఉంది. 1630 – 1710 డచ్ కాలనీగా 1715 – 1810 మధ్య ఫ్రెంచ్ కాలనీగా తర్వాత 1968 వరకు బ్రిటిష్ కాలనీల నుండి తర్వాత స్వాతంత్రం పొందింది. 1903లో పైచెల్లిసును ప్రత్యేక కాలనీ గా రూపొందించిన తర్వాత మారిషస్ క్రమానుగత అభివృద్ధి జరుగు తున్నది. ఆఫ్రికా దేశాల మానవ అభివృద్ధి జాబితాలో ద్వితీయ స్థానంలో ఉన్న మారిషస్ హిందూ యిజం అతి పెద్ద మతంగా ఉన్న ఏకైక ఆఫ్రికా దేశంగా ప్రత్యేకతను కలిగి ఉంది. రైతులు చెరకు పొలాలలో పని చేయడానికి పెద్దసంఖ్యలో భారత దేశం నుండి కార్మికులను తీసుకు వచ్చారు. 1834 – 1921 మధ్యలో ద్వీపంలో సుమారు 5 లక్షల మంది కార్మికులు పనిచేసారు. ప్రైవేటు వ్యవసాయ దారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాంది శీకులుగా తొలిసారిగా మారిషస్లో అడుగు పెట్టారు.
ఆ మరుసటి సంవత్సరం గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగు వారు ఆ ద్వీపంలో కాలు పెట్టారు. కాకినాడ సమీపాన వున్న ‘కోరంగి’ రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు వాళ్లని ‘‘కోరంగి వాళ్ళు’’ అని, వారు మాట్లాడే తెలుగు భాషకు ‘కోరంగి భాష’ అని పిలిచేవారు. 1843 సంవత్సరంలో కోరంగి పికేట్ అనబడే 231 టన్నుల బరువు నాలుగైదు తెర చాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ రెండు సార్లు ప్రయాణం చేసి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది. 1834లో పుట్టిన ఊళ్లను విడిచి, చెరుకు తోటల్లో పని చేసేందుకు కూలీలుగా మారిషస్ వెళ్లిన తెలుగు వారు మాత్రం తమ తరువాతి తరం వారు కూడా తెలుగు భాషను ప్రేమించి, మాట్లాడేలా పునాది వేశారు. మాతృ భాషకు బ్రహ్మో త్సవం జరిపారు. తెలుగుకు పట్టాభిషేకం చేస్తున్నారు. వారు తమతో తీసుకెళ్లిన వ్యవసాయ పరికరాలైన పలుగు, పారతో పాటు ‘‘పెద్ద బాలశిక్ష, రామాయణ, మహాభారతం’’ వంటి ఇతిహాస గ్రంథాలు, అక్కడి వారిని తెలుగు వారసులుగా తీర్చిదిద్దే ప్రయత్నానికి దోహద పడుతు న్నాయి. అవే ఇప్పటి ఆరవ తరం తెలుగువారూ భాషాయజ్ఞంలో మమేకం కావడానికి కొండంత ఆసరాగా నిలుస్తున్నాయి.
మారిషస్ దేశానికి వెళ్లిన తెలుగువారు తొలుత తమ భాషా, సాంప్రదాయాలను నిలుపు కోవడానికి ఇబ్బందులను ఎదుర్కొన్నా, అక్కడికి వెళ్లిన వారిలో మేబర్ ప్రాంతానికి చెందిన పండిట్ గుణ్ణయ్య 1930లో తెలుగు భాషా వికాసానికి నడుం కట్టారు. ఇలా 1947లో ముందు మారిషస్ ఆంధ్ర మహా సభ, తర్వాత నామాంతరం చెంది మారిషస్ ‘‘తెలుగు మహా సభ’’గా ఆవిర్భవించింది. దాన్ని వారు తెలుగు భాషామ తల్లి ఆలయంగా భావిస్తున్నారు.. ప్రస్తుతం మారిషస్ దేశంలో తెలుగు కుటుంబాల్లో ఆరవ తరం వారు సైతం, తమ పెద్దలు వేసిన బాటలో నడుస్తుం డటం ఇక్కడి తెలుగు వారికి స్ఫూర్తిదాయక అంశం. మారిషస్ దీవిలోని మొత్తం జనాభా దాదాపు 13 లక్షలైతే, తెలుగువారు 1లక్షమందికి పైగా ఉన్నారు. వీరికోసం సుమారు 300 తెలుగు పాఠశాలలు నడుస్తుండగా, 190 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రాథమిక తరగతులలో దాదాపు 10 వేల మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసి స్తున్నారు. మాధ్యమిక, ఉన్నత విద్య లో తెలుగు ద్వితీయ భాషగా ఉంది. ఉన్నత విద్యకోసం మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం పని చేస్తుంటే, తెలుగు మహాసభ, తెలుగు సాంస్కృతిక మండలి, తెలుగు యువ సంఘం, అనేక ఉప సంఘాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. వీటికి మారిషస్ రిపబ్లిక్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, పూర్తిస్థాయిలో ఆర్థికంగా చేయూత నిస్తున్నది. ఫ్రెంచికి దగ్గరగా ఉండే ‘‘క్రియోల్’’ వారి మాతృభాష అయినా, స్వ భాషాభిమానంతో, తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకొని తెలుగును బతికిస్తున్నారు. ముఖ్యంగా ధర్మపురి నరసింహ శతకం, వేమన శతక పద్యాలకు వారు పెద్దపీట వేయడం, క్షేత్రయ్య అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలు, నరసింహ శతకం, నేర్చు కోవడంతో పాటు తెలుగు సంప్రదాయాలనూ పూర్తిస్థాయిలో పాటించడం విశేషం.
ఇటీవల అక్కడి విద్యార్థులే ఓ కథా సంకలనం వెలువరించడం వారికి తెలుగు గల అభిమానానికి, ప్రేమకు తార్కాణం. మారిషస్లో ఓ ఆరాధ్య భావంతో తెలుగుకు బ్రహ్మోత్సవాలు 2018లో ఆగస్టు 20నుండి నిర్వహించి, అందులో భాగంగా, పద్య పఠన పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతి ప్రదానంతో పాటు ఒక్కోరోజు ఒక్కో తెలుగు సాంప్రదాయంపై అవగాహన కల్పించేందుకు వీలుగా సదస్సులను నిర్వహించారు. మారిషస్ దీవిలో తెలుగు భాషోన్న తికి సర్వస్వాన్ని ఫణంగా పెట్టి ‘‘సంజీవ నరసింహ అప్పడు’’ పని చేస్తున్నారు. ఆయన ఆ దేశ తెలుగు పరీక్షల విద్యాధికారి, రేడియో వ్యాఖ్యాత, జర్నలిస్ట్. మారిషస్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలుగు విభాగ అధికారి. తెలుగు ప్రాంతాలతో నిరంతరం సంబం ధాలు కొనసాగిస్తూ అక్కడి తెలుగు వికాసానికి కృషి చేస్తున్నారు. తెలుగు తనాన్ని నిలుపు కొనేందుకు మారిషస్ తెలుగు మహాసభ, అక్కడి ప్రభుత్వం గట్టి సంకల్పంతో పని చేస్తున్నాయి. తెలుగు మహాసభ దేశ రాజధాని పోర్టు లూయిస్ లోని రాయల్ రోడ్డులో ప్రధాన కార్యాలయం కలిగి, ఏడు ప్రాంతీయ కమిటీలు, 90 శాఖలు క్రియా శీలకంగా పని చేస్తున్నాయి అంటే, ఆ సంస్థ తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషి చెప్పకనే చెబుతున్నది. తెలుగు వారికి ప్రీతి పాత్రమైన ఉగాదితో పాటు వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి జాతీయ సెలవుదినాలుగా పాటించడం గమనార్హం. తెలుగు వారి సంస్క్రుతి ప్రతీకలైన పండగలు, పబ్బాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగువారిచే నిర్మితాలైన 350 దేవాలయాలూ తెలుగు భాషా వికాసానికి కేంద్రాలుగా ఉన్నాయి.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494