ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కార్తీక మాసోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌

డిసెంబర్ ఒక‌టి వరకు వైభవంగా దీపోత్సవ వేడుకలు
మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప‌సుపు కుంకుమ‌, ప్ర‌మిద‌లు..
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తుంద‌ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. 2 నవంబర్ 2024 నుంచి డిసంబర్ 1వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో కార్తీకమాస దీపోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేలా కార్యనిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు రెండు మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ ఈవోలను నిర్దేశించారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకలకు హాజరయ్యే మహిళా భక్తులకు ఉచితంగా పసుపు కుంకుమ, అందించ‌నున్నారు.

ప్రధాన దేవాలయాల్లో మహిళా భక్తులకు  బ్లౌజ్ పీస్‌లు అందించ‌నున్నారు. ప్రతిరోజు సాయంత్రం సామూహిక దీపోత్సవంలో ప్రత్యేక ప్రసాద పంపిణీ చేయ‌నున్నారు. సంబంధిత దేవాలయానికి చెందిన నిధులు, దాతల సహకారంతో  ఇతర కార్యక్రమాలను నిర్వ‌హిస్తారు. ప్రతిరోజు సాయంత్రం స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజులను పురస్కరించుకుని మొత్తంగా కార్తీక మాసంలో ఐదు రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రవచనాలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటలు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలు, బుర్రకథ, హరికథ తదితర కార్యక్రమాలను దేవాదాయ శాఖ చేపడుతుంది.  కార్తీకదీపాలను వదిలేందుకు నీటి కొలనులను ఏర్పాటు చేయ‌నున్నారు.

భక్తి ఛానల్, ఎఫ్ఎం రేడియో తదితర సమాచార సాధనాల ద్వారా కార్తీక మాస దీపోత్సవ వేడుకల ప్రచారం చేస్త‌రాఉ. అవకాశమున్నచోట ప్రత్యేక ‘నది హారతి’ కార్యక్రమాలు, టీజీ ఆర్టీసీ సహకారంతో ప్రత్యేక రవాణా సదుపాయం క‌ల్పించ‌నున్నారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి ప్రత్యేక పూజలను నిర్వ‌హించ‌నున్నారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్తీక సోమవారాల్లో ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్తీక మాసం మొదటి సోమవారమైన 4 నవంబర్ 2024 న కీసర లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం నిర్వహించే కార్తీక మాస దీపోత్సవ వేడుకల్లో పాల్గొన‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page