- తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి
- వసతి గృహాల్లోని విద్యార్థులకు మెస్ చార్జీలు పెంపు
- హుజూర్‌నగర్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హుజూర్ నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావత్ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. మన రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలని గానీ పాలకులు పంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం డిప్యూటీ సీఎం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
10 ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ నేతలు సంక్షేమ విద్యార్థుల మెస్ చార్జీలకు ఒక్క రూపాయి పెంచలేదు. 7 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసమే కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నాం. మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో వసతులు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం గత ఏడాది రెసిడెన్షియల్ పాఠశాలలకు 70 కోట్లు కేటాయించింది.. కానీ తమ ప్రభుత్వం ఒకే ఏడాది 5 వేల కోట్లు కేటాయించి నిరుపేద పిల్లలపై తమకు ఉన్న చిత్తశుద్ధిని చాటామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. గత పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ నేతలు సంక్షేమ విద్యార్థుల మెస్, కాస్మోటిక్స్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని.. అలాంటివారు తగుదునమ్మా అంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రంలో గత పాలకులు పదేళ్లపాటు ఈ వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వివరించారు.
భారీగా మెస్, కాస్మొటిక్ చార్జిల పెంపు
2007 తర్వాత నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం దీపావళి పండుగ రోజు 7.50 లక్షల మంది నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెస్, కాస్మోటిక్స్ చార్జీలు ఒక్కసారిగా 40 శాతం పెంచామని తెలిపారు. మూడు నుంచి ఏడవ తరగతి విద్యార్థుల మెస్ చార్జీలు 950 నుంచి 1330కి పెంచామని, 8 నుంచి 10వ తరగతి విద్యార్థుల మెస్ చార్జీలు 1100 నుంచి 1540కి పెంచామని తెలిపారు. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థుల మెస్ చార్జీలు రూ.1500 నుంచి 2100 పెంచామని వివరించారు. 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న కాస్మోటిక్ చార్జీలు రూ.55 నుంచి రూ.175 కు పెంచామన్నారు. మూడో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్న కాస్మోటిక్ చార్జీలు 75 నుంచి 150 కి పెంచామన్నారు. 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థినులకు కాస్మోటిక్స్ చార్జీలను రూ.62 నుంచి 200 పెంచామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొనడం ఈరోజు విద్యారంగానికి చారిత్రాత్మకమని డిప్యూటీ సీఎం భట్టి అభివర్ణించారు. నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని వర్గాల విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అందరూ ఒకే చోట చదువుకునేలా అద్భుతంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ పాఠశాలలో అద్భుత క్రీడా ప్రాంగణాలు, ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన.. మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా 25 ఎకరాల ఆహ్లాదకర వాతావరణంలో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నామని వివరించారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కూడా ఈ పాఠశాల ప్రాంగణంలో ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ మంత్రిమండలి ఆలోచించి ఇంటర్నేషనల్ స్కూల్స్ డిజైన్లు ఇచ్చే ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్ కు బాధ్యతలు అప్పగించామని ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తామన్నారు. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతుందని తెలిపారు.
గత ప్రభుత్వం గత ఏడాది రేజించల్ పాఠశాలలకు 70 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ మా ప్రభుత్వం ఇదే రంగానికి ఒకే ఏడాదిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.5వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. . ప్రతి పైసా పోగు చేసి ప్రజల కోసం ఖర్చు పెడతాం.. సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం పేదల కోసం కష్టపడతామని తెలిపారు. వొచ్చే విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభించేలా ఆదేశాలిచ్చామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు నిలిచిపోగా తాము అధికారంలోకి రాగానే పర్యావరణ అనుమతులు సాధించామని తెలిపారు. ఏడాదిలో మూడు సార్లు పర్యటించి రెండు యూనిట్లు సింక్రనైజ్ చేశామని తెలిపారు. ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేయిస్తామని, నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన గత పాలకులు పదేళ్ల కాలంలో ఒక్క కిలోమీటర్ సొరంగం తొవ్వకం పూర్తి చేయలేదని విమర్శించారు. మొత్తం 42 కిలోమీటర్ల సొరంగ మార్గం కాగా, 32 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే తవ్వితే.. మిగిలిన 10 కిలోమీటర్లలో ఒక్క కిలోమీటర్ కూడా పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ పాలకులు పూర్తి చేయలేదని విమర్శించారు. మేం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతీ నెల ఎంత పని జరిగితే అంత మొత్తానికి వెనువెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పాం, 20 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి తాను ఎస్ ఎల్ పి సి వద్ద సమీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.