ప‌ది నెల‌ల్లోనే 50వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ..

  • విద్యార్థులు డ్ర‌గ్స్ దూరంగా ఉండేలా చూడాలి
  • సారా బుడ్ల‌తో దావత్ చేసుకునేవాళ్ల‌ను సామ‌జికంగా బ‌హిష్క‌రించాలి
  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు
  • ఏఎంవీఐల‌కు నియామ‌క ప‌త్రాలను అంద‌జేసిన సీఎం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : అధికారం చేప‌ట్టిన 10 నెల‌ల్లోనే 50వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీచేసిన ఘ‌ట‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వానిద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్​ ఆర్​టీఏ కార్యాలయ ఆవరణలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్​ మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ . పది నెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామ‌న్నారు. తాము బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి నిరుద్యోగుల తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూశామ‌ని తెలిపారు. అది నాకు అత్యంత సంతృప్తి కలిగించిన సందర్భమ‌ని సీఎం రేవంత్ తెలిపారు. ఏఎంవీఐలు వారి గ్రామంలో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడి పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా స్ఫూర్తి నింపాల‌ని సూచించారు. చదువుకుంటేనే గుర్తింపు, గౌరవమ‌ని వారికి విశ్వాసం కల్పించాల‌ని ప్రభుత్వంపై నమ్మకం కలిగించాల‌ని కోరారు.

దీపావళి పండుగ రోజున డ్రగ్స్ తీసుకుని గృహప్రవేశం అని కొందరు బుకాయించే ప్రయత్నం చేశార‌ని ఆరోపించారు. లీడర్ అంటే లీడ్ చేసేవాడు.. అందరికీ రోల్ మోడల్ గా నిలిచేలా ఉండాలి.. కానీ పండగ వొస్తే డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారు కాద‌ని విమ‌ర్శించారు. అలాంటి వారిని సామజిక బహిష్కరణ చేయాలని యువతను కోరారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్ గా తీసుకోవాలో.. డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలో యువత ఆలోచించాల‌ని చెప్పారు. సరిహద్దుల్లో గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కుపాదం మోపాల‌ని,
కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే రవాణా శాఖ సంపూర్ణ సహకారం ఉండాల‌న్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక పాలసీ తీసుకొస్తామ‌ని చెప్పారు. .

కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్‌..

పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఓ వ్య‌క్తి మాట్లాడుతున్నాడ‌ని, మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేద‌ని సెటైర్ వేశారు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. 1 కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు. న‌ష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు, 35 వేల మంది టీచర్ల బదిలీలు పొందార‌ని సీఎం రేవంత్ అన్నారు.
కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకున్నార‌ని, కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని, త‌మ‌ ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నామ‌ని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామ‌ని చెప్పారు. త్వరలో వారికి నియామకపత్రాలు అందించి.. వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామ‌న్నారు. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నామ‌ని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామ‌ని, తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేశామ‌ని చెప్పారు. మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వాల‌న్నారు. మ‌నం బడి దొంగలను చూశామ‌ని, కానీ.. మ‌న‌ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page