హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్ లగచర్ల గ్రామానికి చర్చల కోసం వెళ్లారు. కలెక్టర్ గ్రామంలోకి రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లు విసిరారు. కారు దిగి రైతులతో చర్చించేందుకు వొచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్ రైతులను ఒప్పించేందుకు యత్నించారు. కానీ సహనం కోల్పోయిన రైతులు కలెక్టర్ ప్రతీక్‌జైన్, తహశీల్దార్ కార్లపై రాళ్లు విసిరారు. పరిస్థితిని గమనించి అప్రమత్తమై అక్కడి నుంచి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు.