ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు

  • అధికారులపై దాడులు దురదృష్టకరం దాడి వెనుక రాజకీయ కుట్ర
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
  • లగచర్ల ఘటనలో గాయపడిన అధికారికి మంత్రుల పరామర్శ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌వికారాబాద్‌ ‌జిల్లా కొడంగల్‌ ‌నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనలో రాజకీయ కుట్ర ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గతంలో మల్లన్న సాగర్‌, ‌కొండ పోచమ్మ, రంగనాయక సాగర్‌ ‌భూ నిర్వాసితులు కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపి తమ హక్కులను సాధించుకున్నారని తెలిపారు. లగచర్ల గ్రామంలో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌, ఇతర అధికారులపై జరిగిన దాడి పై రాష్ట్ర మంత్రులు దామోదర్‌ ‌రాజనర్సింహ, శ్రీధర్‌ ‌బాబు తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన  కొడంగల్‌ ఏరియా అభివృద్ధి డెవలప్మెంట్‌ అథారిటీ స్పెషల్‌ ఆఫీసర్‌ ‌వెంకట్‌ ‌రెడ్డినిఎల్బీనగర్‌ ‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు.

ఈ సందర్భంగా  మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సూచనలను గౌరవిస్తుందన్నారు. ప్రజలకు న్యాయమైన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. పదేళ్లలో గత ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాలపై నిరసనల ద్వారా ప్రభుత్వంపై పోరాడా మన్నారు. మల్లన్నసాగర్‌ ‌కొండపోచమ్మ సాగర్‌ ‌రంగనాయక సాగర్‌తో పాటు ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుపై జరిగిన భూసేకరణపై ప్రభుత్వంపై శాంతియుతంగా న్యాయపరంగా కొట్లాడి గెలిచామన్నారు. కొండపోచమ్మ సాగర్‌ ‌లోని వేముల ఘాట్‌ ‌వద్ద టెంట్‌ ‌వేసుకొని నిరసనలు తెలిపామన్నారు. వొచ్చిన అధికారులకు తమ సమస్యలను వివరించాం తప్ప ఎక్కడ కూడా ఒక్క చిన్న దాడి జరగలేదన్నారు.అధికారులపై దాడులు జరగటం రాజకీయ కుట్రలో భాగంగా కనిపిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అధికారులు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వొచ్చిన వారిపై దాడి చేయటం అమానుషమని పేర్కొన్నారు.

దాడి వెనుక ఉన్నవారందరిపై చర్యలు : మంత్రి శ్రీధర్‌ ‌బాబు
లగచర్ల ఘటన వెనుక ఉన్న వారందరినీ గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు  అన్నారు. హింస మార్గం ద్వారా ఏది సాధ్యం కాదన్నారు. అధికారులు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం వారే అభిప్రాయాలు సూచనలను తెలుసుకునేందుకు గ్రామాలలో పర్యటిస్తారన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను సూచనలను తీసుకోవడానికి అక్కడికి వొచ్చిన అధికారులపై దాడులు చేయటాన్ని రాజకీయ కోణం దాగి ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. మంత్రుల వెంట చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌మధుసూదన్‌ ‌రెడ్డి, నాయకులు ముద్దగొని రామ్మోహన్‌ ‌గౌడ్‌,. ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు శేఖర్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page