21 ఏళ్లకే పోటీ చేసే విధంగా చట్టసవరణ జరగాలి
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరారాబాద్,ప్రజాతంత్ర,నవంబర్14: ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వోటింగ్ వయసును 18 ఏల్లకు తగ్గించిన క్రమంలో పోటీ చేసే వయసును కూడా తగ్గించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉందని అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉంది. వోటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనను మాత్రం సవరించలేదు. ఈ నిబంధనను కూడా సవరించుకుని .. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది.
21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు… 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా. మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా‘ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం అని అన్నారు. అలాగే శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు… ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యతని గుర్తు చేశారు.లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని, సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుందని అన్నారు.
అలాగే విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన అందరినీ అభినందిస్తున్నానని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారని, వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వొచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారని 18 ఏళ్లకే యువతకు వోటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ ది అని ప్రశంసించారు.. మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్ ను పాస్ చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.