ఉత్సవ విగ్రహాల్లా మార్కెట్ కమిటీలు
కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. మార్కెట్ కమిటీలు ఉత్సవ విగ్రహాల్లా మారాయి. వరి కావొచ్చు, పత్తి, సోయా, కంది ఇలా ఏ పంటయినా రైతులు చిత్తవ్వాల్సిందే. వానాకాలంలో పంటలు బాగా పండి దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ఈసారి చేసిన అప్పుల్కెనా తీరుతాయని అనుకుంటున్న రైతులకు ఆశాభంగమే ఎదురవుతోంది. ఓ పక్క పంట చేతికొచ్చే సమయంలో అకాలవర్షాలు దెబ్బతీస్తుంటే..మరోపక్క మిల్లర్లు సిండికేట్‌గా మారి మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. మద్దతు ధరతో పాటు ఐదువందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం అంటున్నా రైతుకు మద్దతు దక్కడం లేదు. వరికోతలు ప్రారంభమైన తొలినాళ్ళలో సన్నరకం వడ్లు క్వింటా రూ.2500 నుండి రూ.2600 వరకు ధర పలికింది. కోతలు ముమ్మరంగా జరుగుతుండటం.. వందల ట్రాక్టర్లలో ధాన్యం మిల్లులకు వస్తుండటంతో మిల్లర్లు ఒక్కసారిగా ధరను తగ్గించేశారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా,మిర్యాలగూడ ప్రాంతంలోని మిల్లర్లు అంతా సిండికేట్‌గా మారి మిల్లులకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయకుండా కృత్రిమ కొరత సృష్టిస్తూ మద్దతు ధరను తుంగలో తొక్కుతున్నారు.
దీంతో ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డెక్కారు. అయినా ప్రభుత్వ అధికారులు, మంత్రులు చర్యలకు దిగలేదు. మంత్రులు మాటలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. సన్నరకం వడ్లు మిల్లులకు ఇబ్బడిముబ్బడిగా వస్తుండటాన్ని ఆసరాగా తీసుకున్న మిల్లర్లు ధరను పడేశారు. ఇప్పుడు క్వింటా ధర కేవలం రూ.2100 నుండి రూ.2200 రూ పాయల వరకే పలుకుతోంది. అన్నదాతలు తప్పనిసరి స్థి తుల్లో వచ్చినకాడికి చాలు అన్నట్లుగా అమ్ముకుంటున్నారు. కానీ మిల్లర్లు అంతా ఒక్కట్కె అసలు కొనుగోళ్ళే నిలిపివేశారు. దీంతో వందల ట్రాక్టర్లు మిల్లుల ముందు బారులు తీరాయి. మిర్యాలగూడ మిల్లుల వద్ద ట్రాక్టర్లను రోడ్లపై పెట్టి ధర్నా చేశారు. నార్కట్‌పల్లి టు అద్దంకి.. మిర్యాలగూడ టు హుజూర్‌నగర్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ధాన్యం కోనుగోళ్ళు ప్రారంభించడంతో పాటు మద్దతు ధర పెట్టాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకోని రైతన్నలకు నచ్చచెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం మిల్లుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతోధర్నాను విరమించారు. నిజానికి ప్రభుత్వంలో ఎవరు ఉన్నా పక్కాగా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. తేమ శాతం 17లోపు ఉండాలనే నిబంధన పెట్టింది. సన్నధాన్యం కోసింది కోసినట్లుగానే పచ్చివడ్లు వస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో వాటిని కొనుగోలు చేయడంలేదు.
దీంతో అన్నదాతలు కొంతరేటు తక్కువైనా మిల్లులకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు ఏఒక్క సెంటర్‌లో కూడా సన్నధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదు. కానీ అధికారులు ట్రక్‌షీట్లు మాయచేసి కొనుగోలు చేసినట్లుగా బోనస్ కొట్టేసే ప్రమాదం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇకమరోవైపు పత్తి రైతులదీ ఇదే దారి. మద్దతు ధరలు దక్కడం లేదు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమావేశమైన సంఘం నేతలు పత్తి కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీసీఐ సీఎండీకి లేఖ రాశాయి. పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నాయి. ఈ సీజన్‌లో తెలంగాణలో రైతుల నుంచి పత్తి కొనుగోలుపై సీసీఐ ఎన్నడూ లేని విధంగా కొర్రీలు పెడుతున్నది. రెండు రోజుల క్రితం సీసీఐ తీసుకున్న నిర్ణయం ఇటు మిల్లులకు, అటు రైతులకు శరాఘాతంగా మారింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 318 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేది.
క్లస్టర్ల వారీగా విభజించి మొదటి మిల్లులో సామర్థ్యం మేరకు కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే మరో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తుంది. అప్పటి వరకు మిగిలిన మిల్లుల్లో ఎలాంటి కొనుగోళ్లు ఉండవు. ఈ విధం గా నల్గొండ జిల్లాలో మొత్తం 23 జిన్నింగ్ మిల్లులు ఉండగా కేవలం 7 మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో మిగిలిన మిల్లుల పరిధిలోని రైతులు ఈ ఏడు మిల్లులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిరది. తద్వారా రైతులపై రవాణా భారం పడుతున్నది. ఈ కొత్త విధానాన్ని ఎత్తేయాలని జిన్నింగ్ మిల్లులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పత్తి కొనుగోలు భారం నుంచి తప్పించుకొనేందుకే సీసీఐ ఉన్నతాధికారులు ఇలాంటి కుట్రలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు నష్టపోయినా పర్వాలేదు.. ప్రభుత్వానికి నష్టం రావొద్దనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. అలాగే ఏపీలోనూ ఇదే పరిస్థితి. మొక్కుబడిగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి భారీగా ఆంక్షలు విధించడంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ తీరుపై రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.7,521 మద్దతు ధర ప్రకటించినా రూ.5,500 దాటి కొనడం లేదు.
ఈ ఏడాది ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ పెట్టుబడి అయిందని చెప్పారు. ఎకరాకు కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే కొంతవరకు కోలుకుంటామని, ఇటీవల కురిసిన అధిక వర్షాలకు బాగా నష్టం వాటిల్లిందని తెలిపారు. తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉంటేనే సిసిఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తున్నారని, 12 శాతం దాటితే వెనక్కి పంపిస్తున్నారని రైతులు చెప్తున్నారు. ప్లాస్టిక్ గోతాల్లో కాకుండా లూజుగా పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆంక్షలు విధిస్తున్నారు. తేమ శాతం 18 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. సిసిఐ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వాటిని వెంటనే సడలించాలని ఎపి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 80 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వాటిలో కేవలం 12 జిన్నింగ్ మిల్లుల్లోనే సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు వచ్చిన వారికి ఆంక్షలు తీవ్ర ఆటకంగా మారాయి. సిసిఐ ఆంక్షలను సాకుగా చూపి దళారులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులతో పత్తి నాణ్యత తగ్గిందంటున్నారు. ప్రధానంగా తేమ శాతం 12 శాతం మించరాదని సిసిఐ నిబంధన విధించింది. ప్రస్తుతం 18 నుంచి 20 శాతం వరకు తేమ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆరబెట్టుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి స్థలం లేక పొలం నుంచి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మద్దతు ధరకు కొనేనాధుడు కరువయ్యాడు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 4.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గుంటూరు జిల్లాలో 53,500, పల్నాడు జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. మొత్తంగా దాదాపు 50 శాతం విస్తీర్ణంలో సాగు తగ్గినా ధర పెరగడం లేదు. ఎకరాకు సగటున 15 క్వింటాళ్లుఉత్పత్తి వస్తుందని ఆశించినా ఈ ఏడాది పది క్వింటాళ్లు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. పెరిగిన ఖర్చులు, తగ్గిన దిగుబడులతో క్వింటాలుకు రూ.10 వేలు ధర ఉంటే తప్ప గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు.
-వడ్డె మారన్న