పారిశ్రామికవేత్తలుగా ఇందిరా మహిళా శక్తి సభ్యులు

వారి ద్వారా 4వేల మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి
స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూతనందించాలి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ఇం‌దిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ప్రజాభవన్లో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్‌ ‌పవర్‌ ఉత్పత్తికి త్వరితగతన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్లకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని తెలిపారు.

సోలార్‌ ‌పవర్‌ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. రుణాల రీ పేమెంట్‌ ‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్‌ ‌పవర్‌ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమకూర్చేటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామని, వారు కూడా విరివిగా రుణాలు అందించి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని అధికారులకు వివరించారు.

స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడాలి..
మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్‌ ‌శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌, ‌సెర్ఫ్ ‌సీఈఓ దివ్య దేవరాజన్‌, ‌ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్‌, ‌రెడ్కో వైస్‌ ‌చైర్మన్‌,ఎం‌డి వావిలాల అనీల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page