తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

భక్తుల రాకతో ఆలయాలు కిటకిట
వేకువ జామునుంచే నదుల్లో పుణ్యస్నానాలు
దీపాలు వెలగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కార్తీక పౌర్ణమి పర్వదినంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు, నదీతీరాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాన్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామునే నదీతీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. అటు శైవాలయాలు, ఇటు వైష్ణవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి గా పిలవబడే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిధి దీపావళి పండగ వెళ్ళిన 15వ రోజు వస్తుంది. హిందువులు అత్యంత పరమ పవిత్రమైన కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి కావడంతో శివాలయాలకు , శైవ వక్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం పాదగయ, కోనసీమలో పలు పుణ్యక్షేత్రాలకు చేరుకుని పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు.

మహాభారత కథనాన్ని అనుసరించి కార్తీకేయుడు తారకరుని సంహరించిన రోజునే కార్తీక పౌర్ణంగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి తర్వాత శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా కార్తీకమాసం అంటారు.  కార్తీక పౌర్ణమి రోజున చేసే నదీ స్నానం దీప దానం, శివాయల దర్శనం, విశేష పూజలు చేస్తే ఎంతో పుణ్యం ఫలమని నమ్మకం. ఈ నెల అంతా కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాలో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యఫలం అని బ్రాహ్మణులు చెబుతున్నారు.

వెయ్యిళ్ల రాక్షసుల పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు గోదావరి స్నానం నదీ స్నానమాచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. శివాలయంలో 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. దీంతో గోదావరి జిల్లాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉసిరి దీపాలను వెలగించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page