హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 15 : వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సన్న రకాలు 25నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడమే అందుకు కారణమన్నారు. సంక్రాంతి నుంచి రేషన్‌తో సహా అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దొడ్డు రకం వరి సాగు 41లక్షల నుంచి 21 లక్షల ఎకరాలకు పడిపోయిందని తెలిపారు. రాష్ట్ర అవసరాలే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందన్నారు. 7411ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
అధికారం కోల్పోయిన పార్టీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని గ్రామ పంచాయితీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉందని, రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కూడా నడుస్తోందన్నారు. పార్టీల ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేయొద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని, కేంద్రానికి రైతుల మీద ప్రేమ ఉంటే గైడ్ లైన్స్ మార్చాలని అన్నారు. సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తామని, రైతులను ఇబ్బంది పెట్టే రాజకీయ క్రీడను పార్టీలు మానుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.