• పరిశోధన కేంద్రం ఏర్పాటుతో 500మంది ఉద్యోగాలు • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 15: అల్లెగ్రో రాకతో రాష్ట్రంలో సెమీకండక్టర్ చిప్ ల తయారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్ ల తయారీలో దిగ్గజ సంస్థ అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. శుక్రవారం అల్లెగ్రో కంపెనీ ప్రతినిధులతో ఎంఓయూ పూర్తి అయిన అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. తెలంగాణాలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సంతృప్తి చెందిన అనంతరం హైదరాబాద్ ను ఎంచుకున్నట్లు అల్లెగ్రో తెలపడం హర్షనీయమన్నారు. అభివృద్ధి, పరిశోధన కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. విద్యుత్తు వాహనాల సిగ్నల్ డిజైన్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్ తో పాటు రోబోటిక్ ఆటోమేషన్ లో కూడా అల్లెగ్రో చిప్ లను రూపొందిస్తుందని వెల్లడించారు. బీఎండబ్ల్యు విద్యుత్ కార్ల తయారీ సంస్థతో పాటు ‘ఈవీ’ రంగంలో బ్యాటరీల నిర్వహణ, పవర్ చిప్ ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉందన్నారు. ఈ సమావేశంటో అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ సిఈఓ వినీత్ నర్గోల్వాలా, సీనియర్ విపి సుమన్ నారాయణ్, మరో సీనియర్ విపి మ్యాక్స్ గ్లోవర్లు పాల్గొన్నారు.