మైనర్లు చేస్తున్న మేజర్‌ మిస్టేక్స్‌!

ఒక దశాబ్దకాలం ముందర అత్యాచారాలు, దొంగతనాలు, ర్యాగింగా లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో మేజర్స్‌ అంటే పద్దెనిమిది ఏళ్లు దాటిన వారే ఉండేవారు. కాని గత ఐదారు సంవత్సరాలలో చూస్తే ఇటువంటి ప్రమాదకరమైన పనులలో మైనర్లు కూడా పట్టుబడుతున్నారు. వీరిలో పదిహేను నుండి పద్దెనిమిది ఏళ్ల లోపు వారు ఎక్కువగా ఉంటున్నారు. మైనర్లు ఎక్కువగా యెటువంటి తప్పులు చేస్తున్నారు ? కారణం ఏమిటి? ఇలా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలి?

సాధారణంగా పద్దెనిమిది సంవత్సరాలులోపు ఉన్నవారిని మైనర్లగా పిలుస్తారు. వీరిలో చదువుకున్నవారు లేదా ఏ విద్యాభ్యాసం లేని వారు కూడా ఉంటారు. పాఠశాల లేదా కళాశాల స్థాయిలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా చేసే అల్లరి పరవాలేదు. కాని శృతిమించిన అల్లరి ప్రమాదకరం. కళాశాలలో స్నేహభావంతో ఉండాల్సిన సహచర ఆడపిల్లలను అబ్బాయిలు టీజింగ్‌ చేస్తున్నారు. తోటి విద్యార్థులతో గొడవలు పడుతున్నారు. అబ్బాయిలతోపాటు, అమ్మాయిలు కూడా వారి జూనియర్లను ర్యాగింగ్‌ చేస్తున్నారు. ఇది అక్కడితో ఆగకుండా బయట కూడా ఇటువంటివి చేస్తున్నారు. బాయ్‌ ఫ్రెండ్‌ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ కలిగి ఉండడం ఒక ఫ్యాషన్‌ అయిపోయింది. ఫ్యాషన్‌, స్టైల్‌, వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చూడడానికి ఈ పొరపాట్లు చిన్న విషయాలుగా కనిపించవచ్చు. కానీ క్రమంగా వారి భవిష్యత్తు విద్యా పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. స్నేహం ముసుగులో సమాజహితం కాని కొన్ని పనులు చేస్తున్నారు.

అబ్బాయిలు ప్రేమలు అని అమ్మాయిలు వెంటబడుతున్నారు. కాదంటే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా మించితే వారిపై దాడి చేయడమో ప్రాణాలు తీయడమో లేదా ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. చాలా మంది  వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇందులో సరదాగా మొదలు పెట్టిన ధూమపానం చేయడం, మద్యపానం సేవించడంతో పాటుగా ప్రమాదకరమైన గంజాయి, డ్రగ్స్‌ లాంటి మత్తుమందులుకు అలవాటు పడుతున్నారు. ఇవి వ్యసనంగా మారి వీటికి బానిసలవుతున్నారు. ఇది అక్కడితో ఆగకుండా అక్రమంగా వీటిని విక్రయించడం, సరఫరా చేయడం వంటి పనులుచేసి వ్యక్తిగతంగా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌, స్టేటస్లలో పోస్ట్‌ చేసి పేరు రావడం కోసం బైకులపై విన్యాసాలు చేయడం, పరుగుపెడుతున్న రైళ్ల నుండి దూకడం, ఎత్తైన ప్రదేశాలు, ప్రవహించే నదులు, సముద్రం లోపలికి వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. వీటిలో లైక్లు, షేర్లు ఎంతమంది చేశారో చూడడం కోసం నిత్యం అదే పనిగా మొబైల్‌ చూస్తున్నారు.

ఈ వయసులో చూడకూడని పోర్న్‌ సైట్లు వీక్షిస్తున్నారు. ఇంకా కొంతమంది తెలిసో తెలియకో మనకు తెలియదు గాని ఆన్లైన్లో గేమింగ్‌, బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారు. దీనికోసం డబ్బును తగలబెడుతున్నారు. పెట్టుబడికై ఆన్లైన్లోనే రుణాలు తీసుకుంటున్నారు. అవి తీర్చలేక,  తల్లిదండ్రులతో చెప్పలేక రుణాలిచ్చేవారి టార్చర్‌ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మైనర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌  మంజూరుచేయదు. కాని వీరు బైకులను వేగంగా నడుపుతున్నారు. ఇంకా మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారు. ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వారితో పాటు రహదారి వెంబడి ప్రయాణం చేస్తున్న పాదాచారులు, ఇతర వాహనాలు నడుపుతున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని నగరాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత బైక్‌ రేసింగ్లలో పాల్గొని ప్రాణాలు తీసుకుంటున్నారు. అత్యంత హేయమైన పని ఏంటంటే అత్యాచారాలు చేయడం. ఇవన్నీ వారి జీవితంలో విజయానికి అడ్డుగా ఉంటాయి.

ప్రధాన కారణాలు: ఈ వయస్సులో ఉన్నవారు ఎల్లప్పుడూ తక్షణ సంతృప్తిని కోరుకుంటారు. వీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే ! ఇప్పుడు ప్రతీదీ మొబైల్లో ఇంటర్నెట్‌ చూసి తెలుసుకోవచ్చు. దీనివలన ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌, ఇన్స్టాగ్రాం లాంటి సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా అడ్డు అదుపు లేని సమాచారం లభిస్తుంది. పోర్న్‌ సైట్లు చూస్తున్నారు. రెచ్చగొట్టే శృంగార చిత్రాలు వీక్షిస్తున్నారు. అశ్లీల, అసభ్యకరమైన సినిమాలు వస్తున్నాయి. మరి సెన్సార్‌ సభ్యులు ఏమి చేస్తున్నారో తెలియడం లేదు.

పరిష్కారాలు: మనం అవునన్నా కాదన్నా యువతలో కొందరు చేస్తున్న ఆకృత్యాలకు బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు మూడు ఉన్నాయి. అవి కుటుంబం, సమాజం, పాఠశాల. ఒక వ్యక్తిపై ఈ మూడిరటి ప్రభావం ఎక్కువ. కుటుంబాలలో తల్లిదండ్రులు వారి  మైనర్‌ పిల్లలకు అనవసరంగా మొబైల్‌ ఫోన్స్‌ ఇవ్వకూడదు. అవసరార్థం ఇచ్చినకూడా వారిపై నిఘావేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్‌ వాహనాలను నడపనీయరాదు. ఏది మంచో ఏది చెడో ఇంట్లో పెద్దలు చెప్పాలి. సమాజంలో పౌరులు ఎవరు ఎలా పోతే మాకేంటి అనే ధోరణను విడనాడాలి. పిల్లల తల్లిదండ్రుల దృష్టికి పిల్లల చేస్తున్న తప్పులను తీసుకువెళ్ళాలి. సినీ నిర్మాతలు, దర్శకులు వారి స్వలాభం కోసం అశ్లీల చిత్రాలను తీయకూడదు. సమాజంకూడా వీటిని ప్రోత్సహించకూడదు.

వాణిజ్య ప్రకటనలలో కూడా అశ్లీల దృశ్యాలే ! యూట్యూబ్లలో వచ్చే చిత్రాలపై కూడా సెన్సార్‌ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. కానీ ర్యాంకులకే పరిమితమైన ప్రైవేటు పాఠశాలలో ఐఐటిలో ఇంజనీరింగ్‌ లేదా ఎయిమ్స్‌ లో వైద్యులుగా తయారు చేయడానికి కేవలం గణితం, సైన్స్‌  సబ్జెక్ట్ల మీదనే బోధన కొనసాగిస్తున్నారు. నైతిక విలువలను బోధించడం లేదు. ఇక్కడ కూడా విలువలు నేర్పే ఇతర పాఠ్యాంశాల మీద కూడా శ్రధ్ధ వహించాలి. సాధారణ తప్పులను పదేపదే చేసేలా విద్యార్థులను దారితీసే చెడు అలవాట్లను అరికట్టడం చాలా అవసరం. ఈ బాధ్యతను ఉపాద్యాయులు తీసుకోవాలి. విద్యార్థులు తమ బాల్యంలో స్పృహతో ఈ సమస్యలను నివారించడానికి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే మంచి సమాజాన్ని తయారు చేయగలం.
జనక మోహన రావు దుంగ
8247045230.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page