వరంగల్ బిడ్డగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నా.. : మంత్రి కొండా సురేఖ‌

మామునూరు ఎయిర్‌పోర్ట్ కు రూ.205కోట్ల నిధుల విడుద‌ల చేయ‌డంపై హర్షం..

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ జీవో విడుదల చేయ‌డంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. వరంగల్ ప్రజల దశాబ్దాల నాటి చిరకాల వాంఛ నెరవేరుతోంద‌ని, వరంగల్ బిడ్డగా తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానని తెలిపిన మంత్రి కొండా సురేఖ వెల్ల‌డించారు. మామునూరు ఎయిర్ పోర్టును పట్టుబట్టి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఈసంద‌ర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు వరద ముంపు నివారణ పనుల నిమిత్తం మరో 160.92 కోట్లు విడుదల చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూ నిర్వాసితులకు 863 ఇండ్లను మంజూరు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు. తన ప్రతిపాదనలను పెద్ద మనసుతో ఆమోదించి, రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతున్న సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తూనే వుంటారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనులకు ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణనను అమలు చేయబోతున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page