ప్ర‌జా పాల‌న‌లో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం..

  • ఆందోల్ – జోగిపేట లో ప్రజా విజయోత్సవ సంబరాలు
  • కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది.
  • 11 నెలల్లో 56 వేల కోట్ల అప్పు తీర్చాం..
  • రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి.

ఆందోల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప‌దేళ్ల కుటుంబ‌పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నార‌ని, కానీ ప్ర‌జాప్ర‌భుత్వం వొచ్చాక స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో జోగిపేటలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్ర‌సంగించారు. ఆందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు మంత్రి దామోద‌ర‌ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. గత 9 ఏళ్ల కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. సుమారు రూ.7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలపై బిఆర్ఎస్ ప్రభుత్వం మోపిందన్నారు. కల్లబొల్లి మాటలతో, మాటల గారడీలతో కాలం వెళ్ల‌బుచ్చింది తప్ప ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో అమలు కాలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ లో 13 సంవత్సరాల క్రితం శస్త్ర చికిత్సల ధరలు నిర్వహించగా ఇప్పటివరకు అవే ధరలు ఉండడంతో కార్పొరేట్ ద‌వాఖానాలు ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయడానికి గత ప్రభుత్వంలో నిరాక‌రించాయన్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే శస్త్రచికిత్సల ధరలను పెంచి ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుంద‌ని చెప్పారు.గత పదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక నానా ఇబ్బందులు పడినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేద‌ని, ప్రజా ప్రభుత్వం రాగానే ఉపాధ్యాయులకు పదోన్నతులు వొచ్చాయన్నారు డీఎస్సీలో కొత్త టీచర్లు వొచ్చారన్నారు. విద్యార్థులకు మిస్ చార్జీలు పెరిగాయని కాస్మెటిక్ ఛార్జీలు పెరిగాయని దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రభుత్వం చేసిన రూ 56 వేల కోట్ల అప్పులను తీర్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణలో భూసంస్కరణలు అమలయ్యాయి అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను 11 నెల లలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వానికి దక్కుతున్నారు.

రూ. 2లక్షల రుణమాఫీని ఏక కాలంలో అమలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని. త్వరలో మిగిలిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నద‌ని తెలిపారు. త్వరలో రైతులకు రైతు భరోసా సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బిఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు శాంతికాముకులని గత ప్రభుత్వంలో 960 రోజులు నిరసన దీక్షలు చేపట్టి మల్లన్న సాగర్ భూ బాధితులు శాంతియుతంగా నిరసనలు తెలపడం ద్వారా, కోర్టుల ద్వారా ప్రభుత్వం తలవంచి రూ.12 లక్షల నష్టపరిహారం దక్కించుకున్నారన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగూరు డ్యాం నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు భూములు , పునరావాస గ్రామాలు , దేవాలయాలు, బడులు, ఇండ్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. సింగూరు నీళ్లు జిల్లాకే దక్కాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జిల్లాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం గత కాంగ్రెస్ ప్రభుత్వం 160 కోట్లతో సింగూరు వరద కాలువలను తవ్వించి పంట పొలాలకు సింగూరు జలాలు అందించిందన్నారు.

త్వరలో సింగూరు కాలువల కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం రూ. 160 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసే పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని వట్పల్లిలో మార్కెట్ యార్డు ఏర్పాటయింద‌ని, ప్రస్తుతం వట్టిపల్లిలో 30 పడగల ద‌వాఖాన‌ మంజూరయినట్లు తెలిపారు. రూ.160 కోట్లతో బోరంచ బొగ్గులపల్లి ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా ఆందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణానికి అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తికాకముందే ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నదన్నారు. లంగిచర్ల దాడి సంఘటన ఇందుకు నిదర్శనం అన్నారు. కలెక్టర్ పై దాడి చేసి కుట్రపూరిత రాజకీయాలు చేయడం బిఆర్ఎస్ నాయకులకే చెల్లింద‌ని విమ‌ర్శించారు. లగచర్ల దాడికి సంబంధించి కొంతమంది నాయకులు దిల్లీకి పోయి కేసులు మాఫీకి యత్నిస్తున్నట్లు తెలిపారు. త్వ‌ర‌లో తెలంగాణలో అనేక మార్పులు తీసుకురాబోతున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో గెలిచినా ఓడినా ఈ ప్రాంతాన్ని వీడలేదని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణలో అనేక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కో మెడికల్ కళాశాల ప్రారంభించడంతోపాటు ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి దామోద‌ర తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రజా పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ కోరారు.

కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ . పి.సంజీవరెడ్డి, టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, లక్ష్మి శేషారెడ్డి జగన్మోహన్ రెడ్డిలు, జహీరాబాద్ మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page