సిద్దిపేట సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర : ఏ పండుగ అయినా ప్రజల మధ్య ఐక్యతను పెంచుతుందని, మన సంప్రదాయాలను రేపటి తరాలకు వారసత్వంగా అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా లో ఆదివారం జరిగిన సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌కు, తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంటుందని, ప్రపంచంలో పూలను పూజించే పండగ తెలంగాణలో ఉంటుందని, బోనాల పండుగ.. అమ్మవారి కోసం ఎంతో గొప్పగా నిర్వహించే పండుగ కూడా హైదరాబాద్‌కే సొంతమని తెలిపారు. అడవి జంతువులను సాదు జంతువులుగా మార్చిన ఘనత యాదవులదని, సాదు జంతువులుగా మార్చి.. ఈ ప్రపంచానికి పాలను అందిస్తూ యాదవులు సేవలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు.
దున్నపోతులను గౌరవించి, పండుగ జరిపే సంస్కృతి కూడా కేవలం తెలంగాణకే సొంతమని తెలిపారు. బతుకమ్మ , బోనాలు, సదర్.. ఇలా అనేక పండుగలను గొప్పగా జరుపుకోవడం తెలంగాణ సంస్కృతికి గొప్ప చిహ్నం అని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, యాదవులకు లీటర్‌కు ఇన్సెంటివ్ స్కీం రూ.4 రూపాయలు ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ మేం వొచ్చిన ఏడాదిలో ఎం తక్కువ చేశామని మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి అధికారంలో వొచ్చాక పథకాలన్నీ బంద్ అయ్యాయని, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, రైతుబంధు బంద్ చేశారని, యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ పథకం నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సీఎం అయ్యాక చేసిన మంచి ఏం లేదు. అయితే తిట్లు.. లేకపోతే దేవుడి మీద ఒట్లు తప్ప ఏం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండి మాట్లాడటం కాదు. సిద్దిపేట గల్లీలోకి వొచ్చి అడిగితే ఏం తక్కువైందో ప్రజలు చెబుతారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.