మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : ఆటల్లో గెలుపు, ఓటములు చాలా సహజమని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. క్రికెట్ లో హిట్ వికెట్ అవుతారని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని తెలిపారు. తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ను హరీష్ రావు ముఖ్య అతిథిగా హరీష్ రావు పాల్గొని ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఈ పోటీలను ఏటా నిర్వహిస్తున్న ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నాయకుడు నర్సింగరావుకు మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. తెలంగాణ అమర వీరుల గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుందని, అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, పది లక్షలు ఇచ్చి అమరులను గౌరవించిందని తెలిపారు.
తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 గా చేసిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ఐటీ, ఆర్థికం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ నెంబర్ 1 గా నిలిపారన్నారు. పదేళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, రేవంత్ 11 నెలల పాలనలో అధఃపాతాళానికి తీసుకెళ్లాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టూ ముడు దిక్కులా సముద్రం ఉందని, దిల్ సుఖ్ నగర్ లో విమానాలు విక్రయిస్తున్నారని, రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని ఇలా పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం మాటలు విని పరీక్షల్లో రాస్తే ఆగమైపోతారని అన్నారు.
ఆరు గ్యారెంటీలు బంద్ పెట్టి మూసీ దుకాణం మొదలు పెట్టారని హరీష్ రావు విమర్శించారు. 31 ఎస్టీపీలు, రూ.3800 కోట్లతో మూసీ అభివృద్ధిని కేసీఆర్ ప్రారంభించారని, కాలేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను రూ.1100 కోట్లతో మూసీలో పోయాలని ప్లాన్ చేశారని తెలిపారు. కానీ పేదోళ్ల ఇండ్లు కూలగొట్టడమే రేవంత్ హిట్ వికెట్ అని అభివర్ణించారు. మూసీ శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురావాలి. అంతేగాని గరీబోళ్ల ఇల్లు కూలగొడుతారా అని ప్రశ్నించారు. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే బీఆర్ఎస్ ఊరుకోదని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశాడని, పింఛన్లు, విద్య భరోసా కార్డు, ఉద్యోగాలు ఏవీ లేవని, ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్ అయ్యాడని అన్నారు.
స్కాలర్ షిప్పులను రేవంత్ రెడ్డి గుండు సున్నా చేసి విద్యార్థులకు గాడిద గుడ్డు మిగిల్చారని ఎద్దేవా చేశారు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చారు. కానీ ఏడాది అవుతున్నా రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బిల్లులు ఇవ్వాలంటే 8 పర్సంట్ ఇవ్వాల్సి ఉందని ఆరోపించారు. హైదరాబాద్ ను పెట్టుబడులకు కేసీఆర్ కేసీఆర్ స్వర్గధామం చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫీల్డింగ్, బౌలింగ్, కీపింగ్ బ్రహ్మాండంగా చేస్తోందని, క్రికెట్ లో 11 మంది లాగే మంత్రులు 11 ఉన్నారు.. రేవంత్ ప్రభుత్వానికి గూగ్లీ వేస్తున్నాం. బీఆర్ఎస్ గట్టిగా పోరాటం చేస్తోంది కాబట్టే వాళ్లందరూ పెవిలియన్ దారి పడుతున్నారు. రాబోయే రోజుల్లో మనదే కప్. కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తారు. మల్లీ వొచ్చి బీఆర్ఎస్ ను గెలిపిస్తారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా తగ్గించి క్రికెట్, ఫుట్ బాల్, వాలీ బాల్ ఆడండి, శారీరక శ్రమ చేయండి ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ కోసం క్రీడలు ఉపయోగపడతాయి. సోషల్ మీడియా తగ్గించి ఆటలు, చదువు మీద దృష్టి పెట్టండి అని హరీష్ రావు యువతకు సూచించారు.