రుణమాఫీ చట్టం కోసం పోరాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ 26న దేశవ్యాప్త నిరసనలు
సంయుక్త కిసాన్ మోర్చా-జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సదస్సులో వక్తలు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల కారణంగా దేశ ప్రజలు, రైతులు, కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని పలు రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పంటలకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చులకు 60 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా-జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో రైతు, కార్మిక, ప్రజల జీవనోపాధిని రక్షించాలని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న జరగనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మెర్చా, సీఐటీయూ, పలు కార్మిక సంఘాల నాయకులు పశ్య పద్మ, విస్సా కిరణ్ కుమార్, వి.ప్రభాకర్, గుమ్మడి నరసయ్య, వేములపల్లి వెంకటరామయ్య, బాలరాజు, జి.వెంకటేశ్, మూడ్ శోభన్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్స్ వల్ల కనీస వేతనం, ఉద్యోగ, సామాజిక భద్రత, ఎనిమిది గంటల పనిదినం ట్రేడ్ యూనియన్ హక్కు వంటి హామీలను రద్దు చేస్తున్నారని వారు అవేదన వ్యక్తం చేశారు. ఈ 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు పోరాడుతున్నాయని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈనెల 26న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. రైతులందరికి పంట రుణాలను మాఫీ చేయాలని అన్నారు. కనీన వేతనం నెలకు రూ.26 వేలు పెన్షన్ రూ.10 వేలు అందరికీ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణమ ఆపాలని, రక్షణ, రైల్వే, ఆరోగ్యం, విద్య, విద్యుత్ ను ప్రైవేటీకరించవద్దని, గృహాలకు ఉచిత విద్యుత్ 300 యూనిట్స్ వరకు ఇవ్వాలన్నారు. స్మార్ట్ మీటర్లను పెట్టవొద్దన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటైజేషన్ చేయడానికి తీసుకున్న డిజిటల్ వ్యవసాయ మిషన్, జాతీయ సహకార విధానంలో భాగంగా ఐసీఏఆర్ కార్పొరేట్ కంపెనీలతో జరిగిన వ్యవసాయ పరిశోధనల ఒప్పందాలను రద్దు చేయాలని అన్నారు.
వంటల బీమా పథకాన్ని అమలు చేసి భీమా పథకాన్ని రైతులకు, కౌలు రైతులకు వర్తింపజేయాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు అమలు చేసిన రోజుకు రూ.600 ఇవ్వాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని, పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలని, వ్యవసాయ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంటల బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సదస్సులో కార్మిక సంఘాల నాయకులు వామంతరావు, కిచ్చెల రంగారెడ్డి, యూసఫ్, నాగన్న గౌడ్, మండల వెంకన్న సత్యనారాయణ, గోపాల్, బి.భాస్కర్, మట్టయ్య, ఎస్ఎల్.పద్మ, శివబాబు, అరుణ, అనిల్ కుమార్, కాంతయ్య, వెంకట్ రాములు, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రమేష్, శ్రీనివాస్ కృష్ణ కొండల్ తదితరులు పాల్గొన్నారు.