జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం
కొడంగల్ ప్రజాతంత్ర నవంబర్ 18 : జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్లలో సోమవారం పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్ సభ్యులు బాధితులతో మాట్లాడారు. పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. కాగా గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ కమిషన్ సభ్యులు తేల్చిచెప్పారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడ్డ వారిలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ భూసేకరణకు సంబంధించిన పరిణామాలను తెలుసుకునేందుకు సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్ సభ్యులు బాధితులతో మాట్లాడారు.కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన తర్వాత గిరిజనులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ సభ్యులు పోలీసులు, కొండగల్ ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ తేల్చిచెప్పారు.