ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశానికే దిక్సూచిగా మార్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో, స్పూర్తితో వొస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు. కేశవ చంద్ర రామావత్ (కెసిఆర్) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. జబర్దర్ కమెడియన్ రాకేష్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వొచ్చారని, జబర్దస్త్ లో రాణించి, రాకింగ్ రాకేష్ గా ఎదిగారని తెలిపారు. కేసీఆర్ పేరుతో సినిమా తీయడం గొప్ప విషయని, కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం సాధించి, అద్భుతంగా అభివృద్ధి చేశారు.
కేసీఆర్ పల్లెలనే కాదు, పట్టణాలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి రజినీ కాంత్ న్యూయార్క్ లో ఉన్నానా, ఇండియాలో ఉన్నానా అని కొనియాడారని గుర్తుచేశారు. భౌతికంగా మాత్రమే కాదు, రాష్ట్రాన్ని సామాజికంగా, సాంస్కృతికంగా కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. తెలంగాణను దేశానికి దిక్సూచిగా కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. అధికారంలో ఉన్నపుడు సినిమాలు తీస్తారు. అధికారంలో లేకున్నా కేసీఆర్ అని సినిమా తీశారు. దీనికి ఎంతో ధైర్యం, దమ్ము కావాలి. నిజమైన అభిమానానికి ఇది నిదర్శనమని ప్రశంసించారు. అందరూ కేసీఆర్ సినిమా చూసి, రాకేష్ ను అభినందించాలని,ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని హరీష్ రావు తెలిపారు.