విచిత్ర విన్యాసాలు..ఆత్మరక్షణ కోసమేనా?

 అందరి అవినీతిపైనా చర్చ జరగాలి.. విచారణ జరగాలి

పదేళ్ల పాపాల గురించి మాట్లాడరు. తమ పాలనలో అవినీతి వ్యవహారాల గురించి సమాధానం చెప్పరు. తమ పాలనలో మల్లన్నసాగర్‌ రైతులు తిరగబడితే ఎందుకు కేసులు పెట్టారో చెప్పరు. ఖమ్మం జిల్లాలో రైతులపై ఎందుకు కాల్పులు జరిపారో..ఎందుకు బేడీలు వేశారో చెప్పరు. కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడరు. చేసిన తప్పులన్నీ చేసి..ఇప్పుడు కాంగ్రెస్‌ విరీదపడి ఏడుస్తున్నారు బిఆర్‌ఎస్‌ నేతలు.  వికారాబాద్‌ జిల్లాలో రైతులను రెచ్చగొట్టిన ఘటనకు సమాధానం చెప్పాలి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా ..అని వేమన ఏనాడో చెప్పాడు. ఇది అచ్చంగా బిఆర్‌ఎస్‌ నేతలకు వర్తిస్తుంది.  నిజానికి ఫార్మా కంపెనీల సృష్ట ప్రదాత కెటిఆర్‌. దానిని ఎవరూ కాదనలేరు. రైతుల భూములను అడ్డంగా లాక్కుని వ్యాపారం చేయడం ఎవరు చేసినా నిలదీయాల్సిందే. కానీ బిఆర్‌ఎస్‌ కాదు. అది ప్రజలకు వదిలేయాలి. అవినీతి నేతలు నీతులు వల్లించడం సరికాదు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ గురించి చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా అవినీతి కథలు ఉన్నాయి. కానీ ఎదురుదాడి చేయడం, గగ్గోలు పెట్టడం ద్వారా పదినెలల ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అంటున్నారు. నిజంగానే అవినీతి జరిగితే బయటకు లాగుదాం.

కానీ పదేళ్ల అవినీతి గురించి చర్చించకుండా..కేవలం పది నెల్లలోనే అవినీతి జరిగిందని చెప్పడం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. ముందుగా పదేళ్ల అవినీతిపై ఊరూవాడా చర్చిద్దాం. ఎవరెవరి భూములు పోయాయో, ధరణితో ఎంతమందిని మోసం చేశారో చర్చిద్దాం. అవినీతిపై చర్చలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఎవరున్నా వదిలిపెట్టకుండా రచ్చబండ ఏర్పాటు చేస్తే మంచిది.  తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత పార్టీలోని కొందరు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరడం వంటి పరిణామాలతో సహజంగానే  పార్టీలో కొంత నీరసం ఆవహించింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెల్చుకోక పోవడం కూడా గులాబీ పార్టీకి రాజకీయంగా భారీ  దెబ్బ పడిరది.  ఆ తర్వాత కొద్ది పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పార్టీ మారడంతో కారు పార్టీలో నిస్తేజం నిండిరది.  మరోవైపు  ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌  కేసీఆర్‌ రాజకీయ మౌనం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా చురుకుగా ఉండాల్సిన కెసిఆర్‌ ఇంటికే పరిమితం కావడం దారుణం కాక మరోటి కాదు. అధికారం లేకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టమన్న రీతిలో కెసిఆర్‌, జగన్‌ తీరు ఉంది. ఈ క్రమంలో తమపై అవినీతి కేసుల దాడి పెరగడంతో ఆత్మరక్షణ కోసం బిఆర్‌ఎస్‌ విన్యాసాలు చేస్తోంది. ఎదురుదాడిని ఎంచుకుంది.

ఇవన్నీ ప్రజలు నమ్ముతారని అనుకుంటే అవివేకం తప్ప మరోటి కాదు. ఇవన్నీ ఎక్కడ మెడకు చుట్టుకుంటాయో అన్న భయంతోనే కెటిఆర్‌ గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరి స్తున్నారు. కేటీఆర్‌, హరీశ్‌ రావులు ఇద్దరూ అధికార కాంగ్రెస్‌ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అంశాలవారీగా కాంగ్రెస్‌ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల చేరిక విషయంలో న్యాయస్థానంలో సవాల్‌ విసిరారు. గతంలో ఎమ్మెల్యేలను మరి గొర్రెల్లాగానే కొనుగోలు చేశారా అన్నది చెప్పాలి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వరదలు, రైతుల రుణ మాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన,ఎమ్మెల్యే కౌషిక్‌ రెడ్డి వర్సెస్‌  ఎమ్మెల్యే అరికలపూడి గాంధీ సవాళ్ల వంటి అంశాలపై గగ్గోలు చేస్తున్నారు. ఇంత ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నారంటే అది రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కల్పించిన స్వేచ్ఛ అని చెప్పక తప్పదు. గతంలో జర్నలిస్టులను మాట్లాడనీయలేదు. సోషల్‌ విరీడియా వారిపైనా కేసులు పెట్టారు. వేధింపులు చేశారు. సిఎంను కలవకుండా చేశారు. మంత్రుల దగ్గరకు రాకుండా కట్టడి చేశారు. ఇన్ని మాట్లాడుతున్న కెటిఆర్‌ తన హయాంలో జరిగిన అవినీతి కేసుల గురించి ముందుగా సమాధానం చెప్పాలి. ఫార్మూలా ఈ రేస్‌ వ్యవహారంలో విదేశీ కంపెనీకి  అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.55 కోట్లు నిబంధనలకు విరుద్దంగా ఇచ్చారని, ఈ కేసులో ఏసీబీ విచారణ చేస్తోంది.

ఈ క్రమంలో కెటిఆర్‌ను ఎసిబి అరెస్టు చేస్తోందని కాంగ్రెస్‌ మంత్రులు  గత కొద్ది రోజులుగా  చెబుతున్నారు. అరెస్టుపై గవర్నర్‌ అనుమతి తీసుకున్నారని త్వరలోనే  కేటీఆర్‌ అరెస్టు అవడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్‌ దిల్లీ  యాత్ర అందరినీ ఆకర్షించింది.  అరెస్టు నుండి తప్పించుకోవడానికి  మోదీ ప్రభుత్వ సాయం కోసమే దిల్లీ వెళ్లారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి  ప్రకటన చేశారు. గతంలో దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు బెయిల్‌ ఎలా వొచ్చిందో కూడా తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పడం గమనార్హం. ఇలా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సమయంలో కేటీఆర్‌ దిల్లీలో కాలుపెట్టడం మరింత సంచలనానికి దారి తీసింది. బిజెపితో బిఆర్‌ఎస్‌కు లోపాయకారి ఒప్పందం ఉందని అందరికీ తెలిసిదే. బీజేపీ నేతలతో మంతనాలు జరిపేందుకేనా అన్న ఊహాగానాలు చెలరేగాయి.

ఈ క్రమంలో తెలంగాణలో తనపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మంత్రి కేటీఆర్‌ అమృత్‌ టెండర్ల వ్యవహారన్ని తెరపైకి తెచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డి అమృత్‌ పథకంలో స్కాంకు తెరలేపారని ఆరోపించారు. అమృత్‌ పథకంలో పనులకు గాను 8888 కోట్ల టెండర్లను పిలిచిన రేవంత్‌ రెడ్డి  తన బావమరిది సృజన్‌ రెడ్డి కంపెనీ కట్టబెట్టారని కేంద్ర పురపాలక శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయనకు అందజేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లోగా రేవంత్‌ సర్కార్‌ పై చర్యలు తీసుకోవాలని దిల్లీ వేదికగా కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా రెవెన్యూ మంత్రి పొంగులేటికి సంబంధించిన స్కాంలను బయటపెడతానని హెచ్చరించారు. తప్పులేదు. రేవంత్‌, పొంగులేటిలు తప్పు చేసివుంటే కోర్టుకీడ్చాల్సిందే.  అందుకే అందిరి అవినీతిపైనా చర్చ జరగాలి. విచారణ జరగాలి. కేసులు వేయాలి. అందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు మాత్రమే పరిష్కారం చేయగలవు.
-చరణ్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page