హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. వేములవాడలో పెద్ద ఎత్తున నిధులతో చేపట్టిన పలు పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.76 కోట్లతో చేపట్టే రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు, రూ.235 కోట్లతో 4696 మేడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులు, రూ. 50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అలాగే రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులు, రూ.166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు, 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులు, రూ.52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, మూడు కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.26 కోట్లతో నిర్మించిన ఎస్పీ భవనాన్ని, వేములవాడలో కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం, 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను పంపిణీ చేయనున్నారు.అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం అతిథి గృహం వద్ద లంచ్ చేసి హెలికాప్టర్ ద్వారా తిరిగి బయలుదేరుతారు.