రైతుల భూములను లాక్కొని అమ్మకున్న దుర్మార్గులు

భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌కు లేదు..
బిజెపిలా ప్రజలను మోసగించడం కాంగ్రెస్‌ ‌కు తెలియదు
ఇందిరమ్మ స్ఫూర్తితో  పారదర్శకంగా కుల గణన సర్వే
గాంధీభవన్‌ ‌లో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నెక్లెస్‌ ‌రోడ్‌, ‌గాంధీభవన్‌ ‌లో జరిగిన ఇందిరా జయంతి వేడుకలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఆనాటి కాంగ్రెస్‌ ‌పాలకులు అసైన్‌ ‌చేసి, రైతులకు పంపిణీ చేసిన భూములను గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ‌పాలకులు బలవంతంగా గుంజుకొని, వాటిని లేఔట్‌ ‌చేసి అమ్మిన దుర్మార్గులు నేడు రైతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ‌నక్లెస్‌ ‌రోడ్‌ ‌లోని పివి మార్గ్ ‌వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పిసిసి ఆధ్వర్యంలో గాంధీభవన్‌ ‌లో ఏర్పాటుచేసిన ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిసిసి అధ్యక్షులు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తో కలిసి గాంధీభవన్‌ ‌మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.ఆనాటి కాంగ్రెస్‌ ‌పాలకులు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు అసైన్‌ ‌చేసి భూ పంపిణీ చేసిన దాంట్లో, 10 వేల ఎకరాలకు పైగా హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాల రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని యాక్షన్‌ ‌వేసి పైశాచిక ఆనందం పొందిన గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులకు భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2013లో ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం భూ సేకరణ చట్టం తీసుకువొచ్చిందని, ఆ చట్టం ప్రకారమే రైతుల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు తీసుకుంటామే తప్ప బిఆర్‌ఎస్‌ ‌లా రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోమన్నారు. లగచర్లలో కుట్రపూరితంగా అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారులపై భౌతిక దాడి చేయించిన ఘటనను ఖండించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను బిజెపి నెరవేర్చకుండా మోసగించినట్టుగా, కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా వాళ్ల మాదిరిగానే ఉంటుందని బిజెపి నాయకులు భ్రమ పడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. నోట్ల రద్దు సందర్భంగా దొంగ నోట్లు బయటపెడతామని, ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలను బిజెపి మోసగించిన విధంగా కాంగ్రెస్‌ ‌మోసం చేయదని అన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించామన్నారు. అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. యూపీఎస్సీ మోడల్‌ ‌లో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ముందుకు తీసుకుపోతున్నామని, జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించామని, 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.5 లక్షల ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. దీపావళి కానుకగా ప్రకటించాం. దానికి సర్వే జరుగుతున్నది. సర్వే పూర్తి కాగానే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామన్నారు. హామీలను విస్మరించిన బిజెపికి కూడా వాళ్ల మాదిరిగానే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చదని భ్రమ పడటం సరికాదన్నారు.

వారితో ఈ దేశానికి ఎప్పటికీ ప్రమాదమే..
దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని విభజించాలని, దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి
అందులో నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారు.. ఇందిరాగాంధీ గురించి తప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తారని వారితో ఈ దేశానికి ఎప్పటికీ ప్రమాదమేనని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఇందిరా గాంధీ జీవిత చరిత్ర గురించి తెలిసినవాళ్లు, దేశంపై అభిమానం కలిగిన వాళ్లు, దేశ సమైక్యత సమగ్రతపై అవగాహన ఉన్నటువంటి వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారే తప్ప ఆమె చరిత్రను వక్రమార్గంలో చూపే ప్రయత్నం చేయరని చెప్పారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరాగాంధీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు.

చరిత్రను వక్రీకరిస్తూ చిత్రనిర్మాణాలు
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించి లబ్ది పొందాలని చూస్తున్న వారు ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ సినిమా ద్వారా నటి కంగనా రౌత్‌ అదే చేశారని మండిపడ్డారు. సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2025 జనవరిలో ఎమర్జెన్సీ సినిమా విడుదల కానుంది. దేశ చరిత్రపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారని కంగనా రనౌత్‌ను భట్టి విక్రమార్క హెచ్చరించారు

ఇందిరా స్ఫూర్తితోనే కులగణన సర్వే
ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాహుల్‌ ‌గాంధీ ఈ దేశంలో కులగణన సర్వే జరగాలని ఆశించారని,  ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కుల గణన సర్వేను నిబద్ధతతో చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తయారు చేసే ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. కుల గణన సర్వే పూర్తి తర్వాత రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకునే ప్రగతిశీల నిర్ణయాల వల్ల దేశానికి ఈ రాష్ట్రం రోల్‌ ‌మోడల్‌ ‌గా ఉండబోతుందన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవిస్తుందని, అసెంబ్లీలో ప్రమాణం చేసిన గంటలోపే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. మహిళల తరఫున ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు నెలకు 400 కోట్లు చెల్లిస్తున్నదన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏడాదికి 20వేల కోట్ల వడ్డీ లేకుండా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నామని చెప్పారు. వడ్డీ లేని రుణాలు మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించి వ్యాపారవేత్తలుగా ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు. దేశ ప్రజలందరికీ సమానత్వం కల్పించాలని భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమ సమాజా నిర్మాణానికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పునాదులు వేసిందన్నారు. ‘‘నా ప్రాణం కంటే కూడా ఈ దేశం ముఖ్యం’’. ఈ దేశ సుస్థిరత కోసం నా చివరి రక్తపు బొట్టును కూడా ధారపోస్తానని చాటి చెప్పిన ఉక్కు మహిళ దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని కొనియాడారు. విదేశీ విధానంలో ఔనత్యాన్ని తీసుకువొచ్చి ప్రపంచంలో భారత దేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఖైరతాబాద్‌ ‌శాసనసభ్యులు దానం నాగేందర్‌, ‌ఫిషరీస్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మెట్టు సాయికుమార్‌, ‌నల్లగొండ డిసిసి అధ్యక్షులు శంకర్‌ ‌నాయక్‌, ‌చరణ్‌ ‌యాదవ్‌, ‌భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page