కోర్టులో హాజరు పర్చిన పోలీసులు
కొడంగల్,ప్రజాతంత్ర,నవంబర్19: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు బోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేశ్‌ను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. కలెక్టర్‌పై దాడి కేసులో సురేశ్‌ను ఏ2గా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేష్ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకు రావడంతో గందరగోళం నెలకొంది.
ఆ సమయంలో సురేష్ సైతం నినాదాలు చేసినట్లు వీడియోల్లో కనిపించడంతో ఆయనే పక్కా పథకంతో అధికారుల్ని అక్కడికి రప్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికే వారిని రెచ్చగొట్టి దాడికి సిద్ధం చేసి ఉంటాడని.. కలెక్టర్ వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే ఆందోళనకారులు ఆయనపైకి దూసుకురావడం తోపాటు వెంకట్‌రెడ్డిని వెంటాడి కొట్టేందుకు అదే కారణమై ఉంటుందని నమ్ముతున్నారు. సురేశ్‌ను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశముంది. అయితే ఘటన జరిగిన నాటినుంచి సురేశ్ అదృశ్యమయ్యాడు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో పోలీసులు ఎదుట లొంగిపోయాడు.