‌మహిళల బాగు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం..

చరిత్రలో నిలిచిపోయేలా మహిళా సంఘాలతో విద్యుత్‌ ఒప్పందం
వరంగల్‌ అభివృద్దికి రూ.6వేల కోట్లు
హన్మకొండ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌మహిళలు ఆర్థికంగా  ఎదిగితేనే  తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.  అందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా ఆర్టస్ ‌కళాశాల మైదానంలో జరిగిన మహిళా సాధికారత భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది.. మీరు కోరుకున్న ప్రభుత్వం.. మీరు కోరుకున్న అన్నిటిని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని అందుకే  విజయవంతంగా ఏడాది పాలన పూర్తిచేసుకుని ధైర్యంగా సభ పెట్టామని తెలిపారు.

తమ ప్రభుత్వం ఏం చేసిందని ఒకాయన అడుగుతున్నారని, తమ ప్రభుత్వం ఏడాది కాలంలో ఇచ్చినవి ఒకసారి చూస్తే కళ్ళు తిరిగి కిందపడిపోతారని భట్టి విక్రమార్క అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన వారు.. పదేళ్ల కాలంలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వరంగల్‌ అం‌టేనే భావ స్వేచ్ఛ అనేక భావజాలాలకు ఈ నగరం నిలయమని పేర్కొన్నారు. అన్ని భావజాలాలను స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని తమ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. భావ స్వేచ్ఛ ను పునికిపుచ్చుకొని కాళోజీ దీవెనలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

మహిళా సంఘాలతో విద్యుత్‌ ఒప్పందం
మహిళా సంఘాలతో 4,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి నిర్ణయించి ముందుగా వారి నుంచి వెయ్యి మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్‌ ‌కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ నిర్ణయం దేశ చరిత్రలో చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. .భవిష్యత్‌లోనూ ఈ సాహసం ఎవరూ చేయలేరని అన్నారు.  వరంగల్‌ ‌కు  సంబంధించి ఈ రోజు చరిత్రాత్మకమైనది.  నగర అభివృద్దికి 6వేల కోట్లు కేటాయించడమే కాదు.. పనుల ప్రారంభానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వివరించారు.

దేశ సమగ్రత కోసం నిరంతరం పనిచేస్తాను. నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దేశ సమగ్రత కోసం పాటుపడతనని చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని కొనియాడారు. దేశంలో రాజభరణల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి గొప్ప సంస్కరణలు తెచ్చిన భారతరత్న మన ఇందిరమ్మ అని అన్నారు. జనాభాలోని సగం మంది ఉన్న మహిళలను మహాలక్ష్మిలుగా కోటేశ్వరులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ప్రత్యేక వడ్డీ లేని రుణాలు రూ.25 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల కాలంలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు రాష్ట్ర మహిళలకు ఇస్తామన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న గత ప్రభుత్వం.. ఇందిరా క్రాంతి పథం పక్కన పెట్టిందని, మహిళలకు వడ్డలేని రుణాలను వదిలేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలే కాదు.. వారిని పారిశ్రామిక వేత్తలు గా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. వరంగల్‌ ‌లో జర్నలిస్ట్ ‌కాలనీని కుర్చీ వేసుకుని కట్టిస్తానని, జర్నలిస్టులు దావత్‌ ఇవ్వాలని చెప్పిన మనిషి.. జాడ లేకుండా పోయారని మాజీ సీఎం కేసీఆర్‌ ‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆరు నెలల కాలంలోనే కాలోజీ కళాక్షేత్రానికి నిధులు కేటాయించి పూర్తి చేశారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page