కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్‌

రెగ్యులరైజ్‌ ‌జీ.ఓ. 16 కొట్టివేత
క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి
రెగ్యులరైజేషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కిన నిరుద్యోగులు

హైదరాబాద్‌, ‌నవంబర్‌19 (ఆర్‌ఎన్‌ఏ) : ‌కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకిచ్చింది. వారి రెగ్యులరైజేషన్‌ ‌చెల్లదని తీర్పునిచ్చింది. రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాకిస్తూ…సెక్షన్‌ 10ఏ ‌ప్రకారం తీసుకొచ్చిన జీ.ఓ. 16ను తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. జీ.ఓ. 16 ద్వారా గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వేలాది మందిని రెగ్యులరైజ్‌ ‌చేసింది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. తాజాగా హైకోర్టు సంచలన తీర్పుతో రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ ఆందోళనలో పడింది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రెగ్యూలరైజ్‌ ‌చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు తెలిపారు. అయితే దీనిపై హైకోర్టు నుంచి తమకు ఆర్డర్‌ ‌కాపీ వస్తే స్పష్టత వొస్తుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సెక్షన్‌ 10ఏ ‌ప్రకారం జీవో 16ను కెసిఆర్‌ ‌ప్రభుత్వం తీసుకువొచ్చింది. డిగ్రీ, జూనియర్‌, ‌పాలిటెక్నిక్‌ ‌కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్‌ ‌చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

 

విచారణ చేపట్టిన హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్‌ ‌లెక్చరర్లు, 184 మంది జూనియర్‌ ‌లెక్చరర్లు (ఒకేషనల్‌), 390 ‌మంది పాలిటెక్నిక్‌, 270 ‌మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్‌ ‌టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా సగం జీతానికే సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన గత ప్రభుత్వం వారి సేవలను గుర్తించి జీవో 16 ద్వారా రెగ్యులరైజ్‌ ‌చేసింది. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సైతం కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల్ని గుర్తించి, వారి ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ‌చేయడానికి సెక్షన్‌ 10ఏ ‌ప్రకారం జీ.ఓ. 16 తీసుకొచ్చింది.

దీని ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను కేసీఆర్‌ ‌ప్రభుత్వం పర్మినెంట్‌ ‌చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. అయితే నియామక పరీక్షలు నిర్వహించి ఖాలీలను భర్తీ చేయాలి కానీ, నేరుగా వారిని రెగ్యులరైజ్‌ ‌చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం మంగళవారం విచారించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్‌ ‌చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీ.ఓ.ను హైకోర్టు కొట్టివేసింది. దాంతో రెగ్యూలరైజ్‌ అయిన ఉద్యోగులు మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారనున్నారు. ఏళ్ల తరబడి పడుతున్న వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయని చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌ ‌ద్వారా నిరుద్యోగులుగా ఉన్న తమకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయని నిరుద్యోగులు ఆరోపిస్తూ పిటిషన్‌ ‌వేశారు. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page