ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏన్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బీజేపీ, ఏజేఎస్యూ, జేడీ(యూ), ఎల్జీపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం జేఎమ్ఎమ్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది.
ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. బీజేపీ 42 నుండి 48 స్థానాలు, ఏజేఎస్యూ 2 నుండి 5 స్థానాలు, కాంగ్రెస్ 8 నుండి 14, జేఎమ్ఎమ్16 నుండి 23 స్థానాలు, ఇతరులు 6 నుండి 10 స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ 42.1 శాతం, ఏజేఎస్యూ 4.6 శాతం, కాంగ్రెస్ 16.2 శాతం, జేఎమ్ఎమ్ 20.8 శాతం, ఇతరులు 16.3 శాతం ఓట్లు పొందనున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలున్నాయి.