ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా గత ప్రభుత్వ కాలంనుండే వారీ ఆందోళనకు శ్రీకారం చుట్టారు. శాసనసభ ఎన్నికల సమయంలో సర్పంచ్‌ల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ వంత పాడిరది. తాము అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరిస్తామని ఆనాడు హామీకూడా ఇచ్చింది. కాని అధికారం చేపట్టి ఏడాది సమీపిస్తున్న వారి గోడును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళన ఉధృతం చేయక తప్పిందికాదు. తమ హయాంలో తమ గ్రామాన్ని అభివృద్ది చేసి చూపించాలన్న ఆసక్తిలో భాగంగా అనేక పనులు చేపట్టిన సర్పంచ్‌లు, ప్రభుత్వ నిధులకోసం ఎదురుచూడకుండా తమ సొంత డబ్బును వెచ్చించారు.
స్మశానవాటికలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డ్‌లు, మలేరియా, డెంగ్యూ లాంటివాటి బారిన పడకుండా ఉండేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం లక్షలాది రూపాయలను వెచ్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేల 769 పంచాయతీల్లో దాదాపు పది నుండి ఆరవై లక్షల వరకు ఇలాంటి కార్యక్రమాలపై సర్పంచ్‌లు వెచ్చించారు. కొందరు వడ్డీకి తీసుకువొస్త్తే, మరి కొందరు ఇంట్లో బంగారం తాకట్టు పెట్టారు. ఈ తంతు దాదాపు 2019 నుంచి 2024 జనవరి 31న వారి పదవికాలం ముగిసేనాటి వరకు గ్రామాభివృద్దికి వెచ్చిస్తూనే ఉన్నారు. తమ పదవీకాలం సమీపిస్తుండడంతో వారిలో ఆందోళన మొదలైంది. తాము వెచ్చించిన డబ్బు అయినా ఇవ్వండి లేదా తమ పదవికాలమైన పొడిగించడంటూ వారు ఆందోళనబాట పట్టారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం వారి స్థానంలో స్పెషల్ ఆఫీసర్స్‌ను నియమించిందేగాని, వారి పెండిరగ్ బిల్లులను మంజూరు చేయలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు చేపట్టిన అభివృద్ది పనులకు దాదాపు 1500 కోట్ల రూపాయల మేర ఆయా పంచాయతీలకు చెల్లించాల్సి ఉందంటున్నారు. ఈ విషయంలో గత సంవత్సర కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు, గవర్నర్‌కు, సంబంధిత అధికారులకు అనేక దఫాలుగా వారు విజ్ఞప్తులు చేసుకున్నా లాభం లేకపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ మాజీ సర్పంచ్‌లు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ‘ఛలో హైదరాబాద్ పోరుబాట’ పేరున మాజీ సర్పంచ్‌లంతా హైదరాబాద్‌కు తరలిరావాలని సర్పంచ్‌ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలునిచ్చింది. అయితే వారు హైదరాబాద్ చేరకుండానే పోలీసులు ఎక్కడివారిని అక్కడే అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తాము శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను అడ్డుకోవడమేంటని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ బాధను చెప్పుకుని, తమకు రావాల్సిన పెండిరగ్ బిల్లుల విషయాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కూడా నేరమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల అప్పుల బాధపడలేక ఇప్పటికే పలువురు సర్పంచ్‌లు బలవన్మరణం చెందిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా అనవసరంగా సర్పంచ్‌లను అరెస్టు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బిఆర్‌ఎస్‌పార్టీ ట్రబుల్ ష్యూటర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఇందుకు నిరసనగా బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద బైటాయించారు. ఆయనతోపాటు నిరసన తెలిపిన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్న ప్రభుత్వం గ్రామాభివృద్ధ్ది కోసం సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించక పోవడం పట్ల బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సర్పంచ్‌ల అరెస్టును తీవ్రంగా గర్హించారు. అరెస్టుచేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా డిమాండు చేశారు.
సంక్రాంతినాటికి కొత్త సర్పంచులు..
డిసెంబరులో సర్పంచు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన ప్రకటన అదే విషయాన్ని చెబుతున్నది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా సిద్ధంగా ఉండాలని కలెక్టరులను ఆదేశించడం ఎన్నికలు సమీపంలోనే ఉంటాయన్నది స్పష్టమవుతున్నది. అయితే పాత రిజర్వేషనుల ప్రకారం ఎన్నికలు జరుపుతారా లేక కొత్త రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాతా అన్న సందిగ్ధత తెరపడాల్సి ఉంది. ఏదియేమైనా రానున్న ఎన్నికల్లో పాల్గొనాలంటే ఆర్థిక వెసులుబాటు ఉండాలి. అందుకు తమ పెండిరగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని మాజీ సర్పంచ్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.