సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనం ..!

ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ
నేటి నుంచి బతుకమ్మ సంబరాలు
ఆట‌పాట‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఆట‌ప‌డ‌చులు..

( మండువ రవీందర్‌రావుప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  )

నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో అత్యంత ప్రధాన పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. ప్రకృతితో మ‌మేక‌మైన ఇలాంటి పండుగ బహుశా దేశంలో మరెక్కడాలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది ప్రతీక. తెలంగాణ ప్రాంతమంతా భాద్రపద శద్ద చవితి మొదలు ఆశ్వీయుజ శుద్ద దశిమి వరకు వరుస పండుగలతో హోరెత్తిపోతుంది. అంటే గణేశ్‌ నవరాత్రుల అనంతరం బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలతో పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సావాలు ఒకదాని వెనుక ఒకటి రావడంతో దాదాపుగా నెలరోజులపాటు రాష్ట్ర ప్రజలు సంబరాల్లో మునిగిపోతుంటారు. ఇందులో ముఖ్యంగా మహిళలు మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ.

దానికి ముందు పెండ్లి కాని ఆడపిల్లలు ఆడుకునే బొడ్డెమ్మ పండుగను కూడా సంప్రదాయంగా జరుపుకోవడం ఆనవాయితీగా వొస్తున్నది. మారుతున్న సమాజం, ఆధునీకరణల నేపథ్యంలో కొన్ని వేడుకలు అంతరిస్తున్నాయనడానికి అక్కడక్కడ మాత్రమే కనిపించే బొడ్డెమ్మ ఆటలు. కాని, పల్లె, పట్నం , చిన్నా పెద్ద, పేద ధనిక తేడా లేకుండా తెలంగాణ అంతటా నేటికి విశేషంగా జరుపుకునేదే బతుకమ్మ పండుగ. వాస్తవానికి దశాబ్దాలుగా ఈ పండుగను ఇక్కడ మహిళలు ఏటా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నప్పటికీ, రెండు దశాబ్దాల కింద ‘తెలంగాణ’ ఉద్యమకాలంలో దీనికి విస్తృత ప్రాచుర్యం లభించింది. ఒక విధంగా ఉద్యమకాలంలో ఈ పండుగ విశ్వవ్యాప్తమైంది. 2016లో ఏకంగా ’గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ లోకి ఎక్కడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనమైన బతుకమ్మను గౌరీదేవి, పార్వతిగా, కాళీమాతగా కొలుస్తారు. ఈ బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలపై భిన్న కథనాలున్నప్పటికీ పౌరాణిక గాథలు, జనపదాల ద్వారా సమాజంలోని విలువలు, కట్టుబాట్లను కళ్ల‌కు కట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా వీటి సారాంశమంతా సమాజంలోని మహిళల పాత్రను, కుటుంబ మర్యాదలను తెలియజేసేవిగా ఉంటాయి. కన్నెపిల్లలు బతుకమ్మను భక్తితో పూజిస్తే మంచి భర్త వొస్తాడన్నది ఒక విశ్వాసం. వివాహానంతరం అత్తవారింటికి పంపే క్రమంలో అక్కడ ఎలా మసులుకోవాలన్న విషయాలను నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేరీతిలో ‘‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ.. పోయినచోట బుద్ధి కలిగి ఉండు.. ఎవరేమన్నా ఎదురాడబోకు.. పలుమార్లు పలుదెరిచి నవ్వబోకమ్మ’ అంటూ ఒక ఉత్త‌మ‌ గృహిణిగా ఎలా ఉండాలన్న విషయాన్ని పాటల రూపంలో తల్లి తన కూతురికి హితబోద చేయడం ఇక్కడ గమనార్హం. అలాగే అత్తవారింటికి వెళ్ళిన కూతురు పుట్టింటిపైన బెంగ పెట్టుకోవడం సహజం.

అలా బెంగబడిన కూతురును ఓదారుస్తూ ‘నేటికి దీపావళి పండుగ పదునాళ్ళున్నదనంగా..నాటికే తోలుకువత్తూ.. దిగనైన కానుకలిస్తూ… కాటిక కాయాలిస్తూ.. కనకంచు చీరాలిస్తూ’.. అంటూ ఆనాడు మగువలు మురిపెంగా వాడుకునే వస్తువులను పుట్టింటికి తీసుకెళ్ళి ఇస్తానంటూ పాట రూపంలో నచ్చచెప్పే ప్రయత్నం. అదేవిధంగా అత్తగారింట్లో ఉన్న తనను చూడడానికి సోదరుడు వొచ్చినప్పుడు తన బాధను వ్యక్తంచేసే విధానాన్నికూడా అద్భుతంగా పాటలో మలిచారు. ‘కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు దీసె.. చెయ్యికీ నీళ్ళిచ్చి చేయివారజూపి’ అన్న పాట ద్వారా చెల్లెలి దు:ఖాన్ని గ్రహించిన అన్న తమ ఇంటికి తీసుకువెళ్ళేందుకు అత్తింటివారి అనుమతి తీసుకుని రమ్మంటాడు. పూర్వం సమిష్టి కుటుంబంలో పెద్దల అనుమతిలేనిదే ఎవరూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విధానం లేదు. దాంతో ప్రతీ ఒక్కరి అనుమతి తీసుకోవాల్సి వొచ్చేది. అనుమతిచ్చే విషయంలో కూడా అత్తింటివారి బెట్టును పాటలో చక్కగా మలిచారు. ‘వంటచేసే ఓ అత్తగారు మా అన్నలొచ్చారు మమ్మంపుతారా’ అంటే పుట్టింటినుండి అన్నలు ఏమి తెచ్చారన్న విషయాన్ని ఆరాతీసిన అత్తగారు ‘నే నెరుగ, నే నెరుగ ` నీమామనడుగు’ అంటూ పంపిస్తుంది. అలా మామ, బావ, అక్క, వదిన ఇలా కుటుంబ సభ్యులంతా ఒకరితర్వాత ఒకరిపేరుచెప్పి కుటుంబ సభ్యులంతా తప్పించుకోవడం, చివరకు భర్త అనుమతించడం పూర్వకాల కుటుంబ వ్యవస్థను, కట్టుబాట్లను తెలియజేస్తుంది.

బతుకమ్మ వృత్తాంతాన్ని వరంగల్‌ నగర సమీపంలోని మొగిలిచర్ల గ్రామస్తుడు భట్టు నరసింహ కవి ఒక చందమామ పాటలో రాసిన విధానాన్ని ప్రముఖ జానపద పరిశోధకుడు ఆచార్య డాక్టర్‌ బిరుదరాజు రామరాజు ‘జానపద గేయాలు’ అనే శీర్షికలో పొందుపర్చారు. చోళదేశ రాజైన ధర్మాంగుడికి నోముల ఫలంగా నూరుగురు సంతానం కలిగారని, వీరు వీరులైనప్పటికీ శత్రువుల చేతిలో హతులయ్యారని, ఆ దు:ఖంతో అడవులకు వెళ్ళి తపస్సు చేయగా లక్ష్మీదేవి ప్రత్యక్షమైందని చెబుతారు. ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని తనగర్భంలో ఉదయించి దు:ఖాన్ని నివారించవల్సిందిగా ధర్మాంగుడి భార్య సత్యవతి వేడుకోగా ఆమె సంతసించిందని, ప్రసవ సమయంలో అక్కడికి వొచ్చిన మహామునులు ఆ పాపను చూసి ఎందరో గతించిన తరువాత బతికిన ఈ సంతానానికి ‘బ‌తుకమ్మ’గా నామకరణ చేసినట్లు భట్టు నరసింహకవి రాసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికీ తెలంగాణలో పుట్టి గిడుతున్న క్రమంలో బతికి బయటపడే పిల్లలకు బతుకమ్మగా నామకరణం చేయడం ఆనవాయితీగా వొస్తున్నది.

కాకతీయ రాజుల కాలంలో కూడా వారి ఇలవేల్పు కాకతమ్మను ప్రతీ ఆశ్వయుజ పాడ్యమి మొదలు దుర్గాష్టమి వరకు రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, మణిభూషణాలు తొడిగి ఊరేగించేవారని  ప్రముఖ కవి అడవి బాపిరాజు ‘గోనగన్నారెడ్డి’ పుస్తకంలో వివరించారు. అంటే ఆనాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో పార్వతీ, గౌరీ రూపంగా బతుకమ్మను కొలుస్తున్నట్లు తెలుస్తున్నది. భారతీయ సంస్కృతికి మూల స్తంభాలైన పురాణ ఇతివృత్తాలను ఆధారంగా చేసుకుని బతుకమ్మ పాటలు పల్లె పదాల్లో వెల్లివిరిసాయి. ముఖ్యంగా తెలంగాణ మహిళల జీవితంలోని కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలను తెలిపేవిగా ఉన్నాయి. తొమ్మిది రోజులపాటు, తొమ్మిది పేర్లతో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ వేడుకల్లో ప్రధానంగా పుష్పాలను పూజించడం. ప్రకృతి సిద్ధంగా లభించే పూలతో భగవంతుడిని పూజించడం సహజం. కాని ఈ వేడుకలో పూలనే దేవతగా పూజించడమన్నది గొప్ప విషయం. బహుషా దేశంలో ఇలాంటి సంప్రదాయం ఎక్కడా కనిపించదు.

పసుపుతో గౌరమ్మను చేయడం సంప్రదాయం. దాన్ని పాట రూపంలో ‘పసుపులో పుట్టే గౌరమ్మ..ఇసుకల పుట్టే గౌరమ్మ.. కుంకుమలో, పువ్వుల్లో, జొన్నల్లో ఇలా ప్రకృతిని, పంటలను తెలియజేసే పాటలను ఈ సందర్భంగా పాడుకుంటారు. గర్భిణీ స్త్రీలకు తినాలనిపించే  పండ్ల పేర్లను కూడా పాట రూపంలో చెప్పడం విశేషం. ‘ ఒక్కో మాసం నెల తన గర్భిణి ఓనగాయలడిగే.. అలాగే రెండవ మాసం రేగుపండ్లు.. అంటూ తొమ్మిది నెలలకు తొమ్మిది రకాల పండ్లు, పిండి వంటల పేర్లు చెప్పి, చివరకు పండంటి పాపడినివ్వమని గర్భిణిని ఉత్సాహపరుస్తారు. మానవ జన్మ ఎత్తినప్పటి నుంచి జన్మాంతం వరకు జీవితంలో జరిగే అనేక పరిణామాలకు తగినట్లుగా పౌరాణిక ఇతి వృత్తాల్లోని నీతిని పాటల రూపంలో రంగరించి మంచి బ‌తుకును ప్రసాదించే దేవతగా ఆరాధిస్తున్నారు కనుకే చరిత్రలో ‘బతుకమ్మ’ చిరస్థాయిగా నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page