తెలంగాణ బిడ్డ సాయిబాబాకు కన్నీటి నివాళి

 జాతుల సమస్య మీద, అణగారిన ప్రజా సమూహాల సమస్యల మీద ఆ అంతర్జాతీయ, జాతీయ అవగాహనకు కొనసాగింపుగానే ఎ ఐ పి ఆర్ ఎఫ్ 1997 డిసెంబర్ 28-29ల్లో వరంగల్ లో ప్రజాస్వామ్య తెలంగాణ సదస్సు నిర్వహించింది. అంతకు ముందే అదే సంవత్సరం భోనగిరిలో మార్చ్ 8-9ల్లో, సూర్యాపేటలో ఆగస్ట్ 11న తెలంగాణ ఆకాంక్షలపై సభలు జరిగినప్పటికీ వరంగల్ సభలు అసలు తెలంగాణ ఉద్యమానికే దిశానిర్దేశం చేశాయి. ముఖ్యంగా ఆచరణ మార్గం చూపాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, మొత్తం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల ఉద్యమాల పరంపరలో మొదటిసారిగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నారో విస్పష్టమైన లక్ష్యాలతో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. కాళోజీ, ఎం టి ఖాన్, జయశంకర్, గద్దర్, భూపతి కృష్ణమూర్తి, ఆకుల భూమయ్య, వరవరరావు పాల్గొన్న ఈ సదస్సు కోస్తా, రాయలసీమ నుంచి కూడా తెలంగాణ ఆకాంక్షలకు సంఘీభావాన్ని కూడగట్టింది. ఈ రెండు రోజుల కార్యక్రమానికి, అంతకు ముందు కొన్ని నెలల పాటు జరిగిన సన్నాహాక కార్యక్రమాలకు పూర్తిగా సమష్టి స్వభావం, సమష్టి కృషి ఉన్నప్పటికీ, నిర్వహించిన సంస్థ ప్రధాన కార్యదర్శిగా జి ఎన్ సాయిబాబాదే ప్రధాన బాధ్యత.

‘తెలంగాణార్థం’లో రాయవలసిన విషయాలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. ఏడాది కూడ నిండక ముందే దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక ప్రజా వ్యతిరేక విధానంతో, నిర్ణయంతో, చర్యతో తెలంగాణ ప్రభుత్వం పరిశీలకులకు, విమర్శకులకు చాల పని పెడుతున్నది. అట్లని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామంటే గత ప్రభుత్వ దుర్మార్గాలను సమర్థిస్తున్నామని కాదు. దొందూ దొందే. ఒకటి భుగభుగ పొగలు చిమ్ముతున్న పెనమూ, మరొకటి భగభగ మండుతున్న పొయ్యీ. ప్రజలకు మరొక దిక్కు లేదు.

అయినా ఈ వారం ఆ తోసుకొస్తున్న సమస్యలను పక్కన పెట్టి, విరిగిపోయిన నా హృదయపు ముక్క గురించి, రాలిన నా కన్నీటి బిందువు గురించి మీతో పంచుకోదలచాను. నిజంగానే అక్టోబర్ 12న మరణించిన, రాజ్యపు అధికార వ్యవస్థల హత్యకు గురైన ప్రొ. జి ఎన్ సాయిబాబా నా హృదయంలో ఒక అవిభాజ్య భాగం. నా కన్నీటిలో ఒక బిందువుగా కలగలిసిన వ్యక్తిత్వం.సాయి జీవితమూ ఆలోచనా ఆచరణా అపారమైనవి. ఎన్నెన్నో రంగాలలో బృహత్తరమైన కృషి ఆయనది. ఆ విశాల క్షేత్రాలలో సాయి సాగించిన వ్యవసాయం గురించి వివరంగా చెప్పవలసే ఉంది. అది ఎన్నో గ్రంథాలకు వస్తువు అవుతుంది. ఇక్కడ మాత్రం ఈ శీర్షికకు పరిమితమై సాయికీ తెలంగాణకూ ఉన్న సంబంధం మాత్రం చెప్పదలచాను.

పుట్టుకే సమస్తాన్నీ నిర్ణయిస్తుందని భావించే వారు, తమను తాము వీర తెలంగాణవాదులమని చెప్పుకునే వారు కోస్తాంధ్రలోని అమలాపురంలో పుట్టాడు గనుక సాయికి తెలంగాణతో సంబంధం లేదని అనుకోవచ్చు, అనవచ్చు. తెలంగాణలో పుట్టి తెలంగాణ ప్రజలకూ, తెలంగాణ ఆశయానికీ ద్రోహం చేసిన, చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. తెలంగాణలో పుట్టకపోయినా తెలంగాణ కోసం ఆలోచించినవాళ్లు, మాట్లాడినవాళ్లు, ప్రాణాలు బలిపెట్టినవాళ్లు ఎందరో ఉన్నారు. సాయి తెలంగాణ కోసం మూడు దశాబ్దాలకు పైగా ఆలోచించాడు, రాశాడు, మాట్లాడాడు, పని చేశాడు. ఇవాళ తెలంగాణ అంటున్నవాళ్లు ఇంకా పుట్టక ముందు నుంచే, తెలంగాణవాదులు కాక ముందునుంచే సాయి తెలంగాణవాది.

సాయి తన ఇరవయో ఏట, 1987లో, హైదరాబాదు వచ్చాడు. అది కేవలం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఎంఎ చదువుకోసం మాత్రమే కావచ్చు గాని అప్పటి నుంచి 2024 అక్టోబర్ 14న తన పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి ఇచ్చేవరకూ హైదరాబాదులో ఉన్నా, దిల్లీలో ఉన్నా, నాగపూర్ సెంట్రల్ జైలులో అండా సెల్ లో ఉన్నా తెలంగాణ గురించే ఆలోచించాడు, రచించాడు, శ్వాసించాడు, తెలంగాణ ప్రజా జీవనం మెరుగు పడాలని తండ్లాడాడు.

తెలంగాణ మీద సాయి ప్రేమ ఎటువంటిదో చెప్పడానికి ఒక ఉదంతం చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను సమర్థిస్తూ, దాని గురించి రాస్తూ, మాట్లాడుతూ రెండు దశాబ్దాలకు పైగా గడిపిన సాయిబాబా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నాటికి నాగపూర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం కొట్టుడుపోయిన తప్పుడు కేసులో ఒక నెల ముందే అరెస్టయి ఉన్నాడు. కేసు విచారణ జరుగుతుండగా 2016 ఏప్రిల్ లో బెయిల్ వచ్చింది. తల్లిని చూడడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో మొదటిసారి కాలు పెట్టినప్పుడు, విమానాశ్రయం నుంచి నేరుగా మొదట గన్ పార్క్ తెలంగాణ అమరుల స్తూపం దగ్గరికి వెళ్లి, ఆ తర్వాతనే ఇంటికి వెళతానన్నాడు. అందుకే ఆయన పార్థివ దేహాన్ని హాస్పిటల్  మార్చురీ నుంచి తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయే ముందు గన్ పార్క్ దగ్గర కాసేపు ఉంచాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

సాయికి తెలంగాణ మీద ప్రేమ ఎప్పుడు ఎట్లా మొదలయింది? 1987లో చదువు కోసం హైదరాబాద్ వచ్చాక, 1989-90లలో మండల్ కమిషన్ సిఫారసుల అమలు కోసం ఉద్యమంలో భాగమయ్యాక, అణచివేతకు గురైన కులాల హక్కుల కోసం పోరాడుతున్నవాడిగా, అణచివేతకు గురైన ప్రాంతాల హక్కుల కోసం, ప్రత్యేకించి తెలంగాణ హక్కుల కోసం పోరాడడం కూడ తన బాధ్యత అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే తను సెంట్రల్ ఇన స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (సీఫెల్) లో పి జి డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్ కోర్సులో చేరాడు. అప్పుడు సీఫెల్ రిజిస్ట్రార్ గా ప్రొ. కె జయశంకర్ ఉండడంతో ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం కుదిరాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తన సకల శక్తులతోనూ సమర్థించాలని, దానిలో భాగం పంచుకోవాలని సాయి అప్పుడే నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికి ఇంకా తెలంగాణ కొందరు వ్యక్తుల ఆలోచనల్లోనే తప్ప ఉద్యమ స్థాయికి రాలేదు.

ఆ స్థితిలో 1995లో తెలంగాణలోని మరొక సమస్య సాయిని చేరవచ్చింది. అప్పటికి సాయిబాబా అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక (ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం – ఎ ఐ పి ఆర్ ఎఫ్) నాయకుడిగా ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జైళ్లలో, ముఖ్యంగా చంచల్ గూడా జైలులో రాజకీయ ఖైదీలు తమ హక్కుల కోసం నిరాహారదీక్ష ప్రారంభించారు. పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణ, శాఖమూరి అప్పారావుల నాయకత్వంలో జరిగిన ఆ ఖైదీల పోరాటానికి సంఘీభావంగా బైట సమాజంలో ఉద్యమం నిర్మించినవారు సాయిబాబా, ఆయనతో పాటు సీఫెల్ లో సహవిద్యార్థిగా ఉండిన పవన్. సెక్రటేరియట్ ముందు నిరాహార దీక్ష శిబిరం వేసి విస్తారమైన ప్రజల మద్దతు కూడగట్టిన ఆ ఉద్యమం చివరికి ప్రభుత్వం దిగివచ్చేలా చేసింది. ఖైదీల హక్కుల పోరాట సమితికి, ప్రభుత్వానికి, ఖైదీలకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఖైదీల హక్కుల గుర్తింపు, ఖైదీల సౌకర్యాల మెరుగుదల సాధ్యమయ్యాయి. ఆ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ జైళ్లలోనే అత్యధిక రాజకీయ ఖైదీలు ఉండేవారు గనుక అది ఒకరకంగా తెలంగాణ సమస్యే.

ఎ ఐ పి ఆర్ ఎఫ్ నాయకుడుగా తనకు తాను పెట్టుకున్న, అణచివేతకు గురైన సమూహాల హక్కుల కోసం నిలబడడం, ఉద్యమించడం, ఉద్యమ నిర్మాణం చేయడం వంటి పనులు సాయిబాబాను దేశంలోనూ, విదేశాలలోనూ అణచివేతకు గురవుతున్న జాతుల పోరాటాలకు సంఘీభావం ప్రదర్శించే కార్యక్రమం తీసుకునేలా చేశాయి. ఎ ఐ పి ఆర్ ఎఫ్ నాయకత్వాన ఢిల్లీలో 1996 ఫిబ్రవరిలో ప్రామాణికమైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించాడు.

జాతుల సమస్య మీద, అణగారిన ప్రజా సమూహాల సమస్యల మీద ఆ అంతర్జాతీయ, జాతీయ అవగాహనకు కొనసాగింపుగానే ఎ ఐ పి ఆర్ ఎఫ్ 1997 డిసెంబర్ 28-29ల్లో వరంగల్ లో ప్రజాస్వామ్య తెలంగాణ సదస్సు నిర్వహించింది. అంతకు ముందే అదే సంవత్సరం భోనగిరిలో మార్చ్ 8-9ల్లో, సూర్యాపేటలో ఆగస్ట్ 11న తెలంగాణ ఆకాంక్షలపై సభలు జరిగినప్పటికీ వరంగల్ సభలు అసలు తెలంగాణ ఉద్యమానికే దిశానిర్దేశం చేశాయి. ముఖ్యంగా ఆచరణ మార్గం చూపాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, మొత్తం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల ఉద్యమాల పరంపరలో మొదటిసారిగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నారో విస్పష్టమైన లక్ష్యాలతో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. కాళోజీ, ఎం టి ఖాన్, జయశంకర్, గద్దర్, భూపతి కృష్ణమూర్తి, ఆకుల భూమయ్య, వరవరరావు పాల్గొన్న ఈ సదస్సు కోస్తా, రాయలసీమ నుంచి కూడా తెలంగాణ ఆకాంక్షలకు సంఘీభావాన్ని కూడగట్టింది.

ఈ రెండు రోజుల కార్యక్రమానికి, అంతకు ముందు కొన్ని నెలల పాటు జరిగిన సన్నాహాక కార్యక్రమాలకు పూర్తిగా సమష్టి స్వభావం, సమష్టి కృషి ఉన్నప్పటికీ, నిర్వహించిన సంస్థ ప్రధాన కార్యదర్శిగా జి ఎన్ సాయిబాబాదే ప్రధాన బాధ్యత. అప్పటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా తెలంగాణ ఆకాంక్షలను ఖండిస్తున్నాడు. తెలంగాణ ఆకాంక్షల ప్రకటన “రాజకీయ నిరుద్యోగుల పని” అని పాచిపోయిన ఆరోపణను శాసనసభా వేదిక మీద ప్రకటిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి, తెలంగాణ ఆకాంక్షలు తానే ప్రకటిస్తున్నట్టు నటించినప్పుడు ఆయన వరంగల్ డిక్లరేషన్ లోని ఆకాంక్షలనే అసలు మూలం చెప్పకుండా వ్యక్తీకరించాడు.

ఆ రకంగా సాయిని ఇవాళ్టి తెలంగాణ రాష్ట్రానికి మౌలిక వనరులలో ఒకరుగా, తెలంగాణ బిడ్డగా గుర్తించవలసి ఉంది.
ఆ తర్వాత సాయి దిల్లీ విశ్వవిద్యాలయంలో పి ఎచ్ డి చేస్తూ, దిల్లీ విశ్వవిద్యాలయ రాంలాల్ ఆనంద్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన తర్వాత కూడా, తప్పుడు కేసులో నిందితుడిగా నాగపూర్ జైలులో అక్రమ నిర్బంధం అనుభవించినప్పుడు కూడా తెలంగాణ గురించి ఆలోచిస్తూనే, రాస్తూనే ఉన్నాడు.

సాయి మాత్రమే కాదు, సాయి కుటుంబం మొత్తమే తెలంగాణలో విడదీయరాని భాగంగా మారిపోయింది. తన కూతురికి తెలంగాణ నది అయిన మంజీర పేరు పెట్టుకోవడం తెలంగాణ మీద సాయికి ఉన్న ప్రేమకు అనేక నిదర్శనాలలో మరొకటి. సాయి చెల్లెలు భవాని విప్లవోద్యమ కార్యకర్తగా, నల్లగొండ జిల్లా విప్లవోద్యమ నిర్మాణంలో పని చేసింది. 2000 జూన్ 9న మరొక ఐదుగురు తెలంగాణ బిడ్డలతో పాటు కలిసి బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యకు గురయింది. భవాని భౌతిక కాయం తెలంగాణ మట్టిలోనే కలిసిపోయింది. 2006లో సాయి తండ్రి సత్యనారాయణ గారు, 2021లో సాయి తల్లి సూర్యావతి గారు కూడ హైదరాబాద్ లోనే తుదిశ్వాస విడిచారు.

సాయిని తెలంగాణ బిడ్డగా గుర్తిస్తున్నప్పుడు, తలచుకుంటున్నప్పుడు నాకు కెన్యన్ రచయిత, నవలాకారుడు గూగీ వా థియోంగో తో జరిగిన అనుభవం గుర్తుకొస్తున్నది. గూగీ ఆత్మకథ మొదటి భాగం ‘డ్రీమ్స్ ఇన్ ది టైమ్ ఆఫ్ వార్’ ను సాయిబాబా జైలులో ఉన్నప్పుడు తెలుగు చేయగా, దాన్ని మలుపు బుక్స్ ‘యుద్ధకాలపు స్వప్నాలు’ పేరిట ప్రచురించింది. ఆ పుస్తకావిష్కరణ, సాయి జైలు నిర్బంధానికి నిరసన సభ హైదరాబాదులో 2018 ఫిబ్రవరిలో జరిగినప్పుడు గూగీ ఇక్కడికి వచ్చాడు. ఆయన తిరిగి వెళ్లిపోయేటప్పుడు హిమాయత్ నగర్ లోని ఒక దర్శినిలో ఆయనకు ఇడ్లీలు తినిపిస్తుండగా పక్కన ఉన్న కొందరు యువకులు ఆయన ఎక్కడి నుంచి అని అడిగారు. ఆయన కెన్యన్ మహా రచయిత అని, అమెరికాలో ప్రొఫెసర్ అని నేను చెపుతుండగా, ఆ తెలుగు మాటల్లోని ఇంగ్లిష్ ముక్కలను బట్టి సంభాషణ ఏమిటో అర్థం చేసుకున్న గూగీ, “నో నో, ఆయామ్ ఫ్రమ్ తెలంగాణ” అన్నాడు. అవును, పోరాటకారులూ, ప్రజా పోరాట సమర్థకులూ, ప్రజా జీవిత ఉన్నతీకరణ కోసం ఆలోచించేవారూ ఎక్కడి వారైనా తెలంగాణ బిడ్డలే. అటువంటి అద్భుతమైన తెలంగాణ బిడ్డ, ముప్పై అయిదేళ్లుగా తెలంగాణ కోసమూ, భారతదేశం కోసమూ, ప్రపంచం కోసమూ ఎన్నెన్నో ఆలోచనలూ ఆచరణలూ పంచుకున్న ఆత్మీయ మిత్రుడు సాయికి కన్నీటి నివాళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page