- సొంత పొలంలో పూడ్చిపెట్టిన ఘనుడు
- అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం
- కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్
జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్ 13:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామంలో దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, మనస్పర్ధలు కారణంగా మహిళ హత్యకు గురైంది. చంపిన వ్యక్తి తన సొంత పొలంలో గుట్టుచప్పుడు కాకుండా మహిళ శవాన్ని పాతిపెట్టిన వైనం సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మాచినేనిపేట తండా గ్రామానికి చెందిన భద్రం రెండేళ్ల క్రితం కొత్తగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పని చేసేవాడు. అదే పాఠ శాలలో మణుగూరు ప్రాంతానికి చెందిన స్వాతి వంట మనిషిగా పనిచేస్తుండేది. ఇక్కడ వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే సమ యంలో భద్రం సొంత ఊరు మాచినేనిపేట తండా గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు.
పెళ్లి చేసుకోవాలని నందిని పట్టుబట్టడంతో ఆమెను వివాహమాడాడు. వీరికి కొడుకు ఉన్నాడు. నందిని వివాహం చేసుకున్న భద్రం మరోవైపు స్వాతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే స్వాతి పాఠశాలలో వంట పని ఉద్యోగం మానేసి ఓ పెద్ద షాపింగ్ మాల్ లో పనిచేస్తుంది. ఇదే దుకాణంలో పనిచేస్తున్న జూలూరుపాడు మండలంలోని మరో వ్యక్తి రత్న కుమార్ తో స్వాతికి పరిచయమైంది. వీరి మధ్య కూడా స్నేహబంధం పెరిగింది. ఆ తర్వాత సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రత్న కుమార్ నుంచి స్వాతి, భద్రం లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. ఇదిలా ఉండగానే రత్న కుమార్ తో కలిసి భద్రం భార్య నందినిని హత్య చేసి అడ్డు తొలగించేందుకు స్వాతి కుట్ర పన్నింది. ఇందులో భాగంగానే వీరభద్రం ఇంట్లో లేని సమయంలో ఆయన భార్య నందినిపై రెండు నెలల క్రితం హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నందినిపై దాడికి పాల్పడినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారం అంతా బయటపడుతుందనే భయంతో పాటు, ఉద్యోగం కోసం లక్షల్లో అప్పు చేయటంతో భార్యతో కలిసి రత్న కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సింగరేణిలో ఉద్యోగం పేరుతో లక్షల్లో మోసపోయి పురుగు మందు తాగి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం సంచలనంగా మారింది. ఈ సమయంలోనే వీరి వద్ద నుంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేందుకు పెద్ద మనుషుల వద్ద స్వాతి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ డబ్బులు తిరిగి చెల్లించే విషయంలోనే మళ్లీ స్వాతి, భద్రం మద్య వివాదాలకు దారి తీసింది. శనివారం అర్ధరాత్రి స్వాతిని భద్రం హత్య చేసి సమీపంలో ఉన్న తన సొంత పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు.
మరుసటి రోజు నుంచి స్వాతి కనిపించకపోవడంతో పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా సమాచారం తెలిసింది. భద్రంను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించటంతో స్వాతిని హత్య చేసి పాతిపెట్టినట్లు విషయం వెల్లడైంది. కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్, తాసిల్దార్ స్వాతి బిందు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకొని, పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి శవ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ మహిళ స్వాతి హత్య సంఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.