దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

  • కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు
  • రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు..
  • ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి

మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ పొందేందుకు, బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు దిల్లీ వెళ్లాడంటూ వారు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఫార్ములా ఈకార్‌ రేస్‌లో జరిగిన అవకతవకల విషయంలో కెటిఆర్‌ జైలుకు పోక తప్పదన్న వాదన కాంగ్రెస్‌ వర్గాల నుంచి కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ అంశంపైన కెటిఆర్‌ను విచారించేందుకు గవర్న‌ర్‌ను అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. గవర్నర్‌ దీనిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిఉండగా, కెటిఆర్‌ దిల్లీ చేరుకోవడాన్ని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా అన్వయించుకుంటున్నది. ఈకార్‌ రేస్‌కు సంబంధించి రూ.55 కోట్ల కుంభకోణం వెలుగుచూడడంతో కేంద్ర ప్రభుత్వాన్ని శరణు వేడుకునేందుకే ఆయన వెళ్ళాడని స్వయంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ఆరోపిస్తున్నారు.

దేశానికి చెందిన డబ్బును ఇతర దేశాలకు అక్రమంగా పంపించాడంటూ కెటిఆర్‌పై వారు ధ్వజమెత్తారు. ఆర్‌బిఐ గవర్నర్‌ అనుమతి లేకుండా డబ్బును ఇతర దేశాలకు ఎలా పంపుతారని వారు నిలదీస్తున్నారు. బాధ్యతాయుతంగా విచారణకు సహకరించాల్సిందిపోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆయన దిల్లీ పర్యటనపై వారు ఆరోపిస్తున్నారు. త్వరలో బిఆర్‌ఎస్‌ నాయకత్వంపై పెద్ద ఆటంబాంబు పేలనుందని ఇటీవల మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన‌ సంగతి ఎలా ఉన్నా.. దిల్లీ కేంద్రంగా కెటిఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పొంగులేటిపైననే బాంబు విసిరినట్లైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అమృత్‌ పథకం టెండర్ల విషయంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, దానిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కెటిఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తిగా మారాయి.

సిఎం రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్ళడానికి ముందే అక్కడికి చేరుకున్న కెటిఆర్‌ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు రాష్ట్రంలో అమృత్‌ పథక టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. అంతటితో ఆగకుండా టెండర్లలో సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగిలేటి పాత్రలపైన ఆధారాలతో సహా దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా దిల్లీ మీడియా ముఖంగా చేసిన ఆరోపణలు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయి. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని నిలదీస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇదొక సవాల్‌గా మారింది. ‘ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌’ నిబంధనలను ఉల్లంఘించి తన బావమరిది సుజన్‌రెడ్డికి చెందిన శోభా కంపెనీకి 1,137 కోట్ల విలువైన పనులను అప్పగించడాన్ని ఆయన ప్రధానంగా ఎత్తిచూపారు.

ఏమాత్రం అనుభవం,అర్హతలేని సంస్థకు పనులు అప్పగించడమేంటన్నది ఆయన నిలదీస్తున్నారు. అలాగే కొడంగల్‌లో అల్లుడి ఫార్మకంపెనీకి చేస్తున్న ప్రయత్నాలకు అక్కడి ప్రజలు తిరుగబడటాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తుతించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ కూడా కోట్లాది రూపాయల పనులను కట్టబెట్టే ప్రయత్నాన్ని ఉటంకిస్తూ దీనిపైన మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న తీరు ఇరుపార్టీలు ఎవరికివారు నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా చేసుకుంటున్న ఆరోపణలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page