ఓ అందాల మేఘమా!

ఆకాశంలో ఆవిరి మేఘమా
అంబరాన అందాల రూపమా
కారు మబ్బై గర్జించే మేఘమా
గాలి కెరటాలకే భీరువువై పోతావా
దూది పింజమై దూరాలకు తేలిపోతావా!

నింగి క్రింద నువ్వో మొగులు
ఎండకు నువ్వో గొడుగు
వానకు నువ్వో మొయిలు
ఇంద్రధనస్సు కు నువ్వో వెండి తెర!

గగనంలో జలతారు తేరు
అప్సరసలు విహరించు విహారాల తీరు
కుంచెతో వేయని చిత్రాలు అలరారు
కళ్లెము వేయలేని అశ్వాల జోరు!

తూర్పు నుండి పడమరకు
పడమర నుండి తూర్పునకు

దేశ దేశాలకు సాగించు పయనాలు
అందించు చాటుమాటు సందేశాలు!

ఉత్తర దక్షిణాలకు ఆశపడి పోతే
వదలని అయస్కాంత వనాలు !

ఒకవైపు మండేటి ఎండలు
మరోవైపు ముంచెత్తేటి వరదలు

మేఘాలు జాలిదలిస్తే
ఆఘమేఘాల మీద మోదాలు
జాలి మరిస్తే ఖేధాలు !

అంబుధి ప్రేమంతా ఆవిరిగా చేసి
మేఘాలకు ఆయువు పోస్తే
అవనిపై అమృత ధారలు కురిపిస్తాయి
అవని జనులు హర్షింపగా !

 పి.బక్కారెడ్డి
9705315250 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page