కవిత్వ తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే కవి కవిత్వాన్ని అందించడానికి ముందు పడిన అంతర్మథనాన్ని గురించి ఆలోచించి తీరాలి. కొన్ని నిరాశలు, కాసిన్ని కన్నీళ్లు, ఇంకొన్ని అనుభూతులు, మరికొన్ని అమృత భావాలు కలగలిసి కవిత్వం పరివ్యాప్తమై మేధోసీమకు చేరువవుతుంది. ఎన్నో అనుభూతుల సృజన సమ్మేళనమైన కవిత్వంలోని ధ్వనిని అర్థం చేసుకుంటే కవిలోని అంతః చైతన్యం అర్థమౌతుంది. సృజనాత్మకతకు విలక్షణత చేకూర్చేదే భావుకత. నిత్యనూతన ఆలోచనలకు రూపం చెక్కగలిగితే ఆ కవి భావుకత దర్శనీయమవుతుంది. కవిత్వంలో కవి సమయంగా ప్రకాశించేది భావుకతే. నిరంతర చలనశీలతతో, వాస్తవిక దృక్పథంతో అడుగేస్తున్న కవయిత్రి షేక్ నసీమాబేగం. పలు సందర్భాలలో ఆమె రాసి ప్రచురించిన కవితలు చిరునవ్వై చిగురించు అన్న పేరుతో సంపుటిగా రూపొందాయి. వివిధ అంశాలపై ఆమె రాసిన 116 కవితలతో పాటు మరో 5 కవితలను కూడా కరోనా కాలమ్ పేరుతో ఈ సంకలనంలో చేర్చారు.
తొలికవితలో పుట్టింటి మట్టిపై తనకున్న అవ్యాజమైన మమకారాన్ని అక్షరీకరించారు. అల్లరి చేస్తూ అమ్మ, నాన్నలతో తిన్న చీవాట్లే కాదు వారితో ప్రేమామృతానుభవాలను తలపోశారు. అలిగి నక్కి కూర్చున్న మూలలు, వేపచెట్టు మీద ఊయలలూగిన చాన్తాడు, వెన్నెల వెలుతురులో డాబా మీద కూర్చొని తిన్న అన్నం, సిమెంట్ అరుగుమీద అందరికన్నా ముందు పెరుగన్నం కోసం కాచుకు కూర్చున్న పిల్లి, గారాలు పోతూ తిరిగిన మెలికలు, ఊరొదిలి వెళ్లాక కళ్లల్లో ఆ ఇంటి ఛాయా చిత్రం వంటి అపురూప కవితా సందర్భాలు ప్రతి ఒక్కరినీ తమ బాల్యం లోతుల్లోకి చేయి పట్టి మరీ తీసుకెళ్తాయి. ప్రాణాల్ని కాపాడే ఆతృతలో మొలచి సాయానికి ముందుకు వచ్చే దాతృత్వంలో దాగున్నదే మంచి పనులకు మారుపేరైన మానవత్వమన్నారు. భారతీయ సంస్కృతికి మూలాలైన అడవి బిడ్డలు చట్టాలు గీసిన గిరిగీతల్లో చిక్కి ఇబ్బందులు పడుతున్నారని వేదన చెందారు. ఆత్మవిశ్వాసం రైతు మోముపై వికసించి పండి అతనొక రాజులా బతికే రోజు తప్పకుండా రావాలని ఆకాంక్షించారు. అవసరం విసిరిన వలలో మనిషి చిక్కి ఖైదీ అవుతున్నాడని చెప్పారు. వెలిగే వైభవంగా తెలుగు విరాజిల్లాలన్నారు. జీవిత సారాన్ని మూటగట్టుకున్న నిరంతర శోష మన విశ్వఘోష అని చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే చట్టాలు రావాలన్నారు. దేశమంటే ఒకే కుటుంబం, ఒకే నీతి అని చెప్పారు. మనిషిని మనిషిలా ఇకనైనా బతికి చూడమన్నారు.
ఆత్మసౌందర్యమే జీవన సౌందర్యమని చెప్పారు. సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా గీతం ఆలపించేందుకు సిద్ధమైన మహిళల ఆత్మ నిబ్బరాన్ని ప్రతిబింబించే కవితా వాక్యాలు ఎంతగానో ఆలోచింపజేస్తాయి. రంగులు పులిమేసుకుని ఒకరిని బాధపెడుతూ బతకడమే దిగజార్చుకున్న విలువకు ఉదాహరణ అని చెప్పారు. ఎద ఘోషను వినిపించేమాధ్యమమే కవిత్వమన్నారు. నేటికీ గింజుకుంటున్న అస్తిత్వం ఆమె అసలు బతుకు చిత్రం అన్నారు. దశాబ్దాల క్రితమే శతాబ్దాల చరితను మార్చి కొత్త శకానికి నాంది పలికిన అక్షర ఆమనిగా సావిత్రిబాయిపూలేను అభివర్ణించారు. దశమార్చే యవ్వనాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా మలచుకొమ్మన్నారు. నలుపులోనూ ఆత్మ సౌందర్యాన్ని అన్వేషించాలని చెప్పారు. మానసిక అంగవైకల్యం మనిషిలో ఉండకూడదన్నారు. సమాజ శ్రేయస్సుకై నిర్విజ్ఞ కవితాయజ్ఞం తప్పదని తెలిపారు. ఏం మాయ చేసావు కవితలో అసహనపు పరదాలు అన్న ఆలోచనాత్మక పద ప్రయోగాన్ని కవయిత్రి చేశారు.
గెలుస్తామన్న విశ్వాసమే జీవన పోరాట సూత్రమని నమ్మకం కవిత చెప్పింది. మగువ, ఆశలదారి, తీర్థయాత్ర, సరికొత్తగా, పరేషాన్, అంతామాయ, ఇది జీవన వైవిధ్యం, బతుకు నీయమ్మా, నటించలేను, నాడు-నేడు, జగత్తులోని మహత్తు, ప్రేరణ, కోరిక కవితలు జీవన వాస్తవికతకు అద్దం పట్టి పలు దృక్కోణాలను ఆవిష్కరించాయి.
అమలుకు నోచుకోని పథకాలతో నిండుగా, దండిగా కనిపించే రాజకీయ పార్టీల ఎన్నికల మెనిఫెస్టోలతో చివరకు తలదాచుకునే పరిస్థితులే మిగులుతాయని చెప్పి సమర్థతకే ఓటేయమని ఓటరుకు విజ్ఞప్తి చేశారు. బతుకు పాఠం, నీ స్నేహం, జ్ఞాని, ఆయువును అందిద్దాం, సూర్యోదయం, కాలచక్రం, ఇకనైనా, గతం మృతం, ఆదర్శం, కావ్యకన్యక, ముద్దుబిడ్డలు, అంతర్మధనం అన్నకవితలలో ప్రశ్నార్థకంగా మారిన భిన్న వర్గాల ప్రజల జీవన లోతుల్ని తడిమారు. మానవత్వపు అత్తరుజల్లే సుగంధ పరిమళం కూలి నాలి నుండి కోటీశ్వరుని వరకు రావాలని చెప్పారు. ఒకరి బాధ మరొకరిని కదిలించాలి/ ఒకరి వేదన మరొకరిని కరిగించాలి అని అలా మనమంతా జీవనశైలిని మలచుకొని మరో పది మందికి ప్రేరణగా నిలవాలని పిలుపునిచ్చారు. సృష్టి రహస్యం, డార్క్ సైట్ నిజాలు, మనోవిజ్ఞాని, మూన్నాళ్ళ ముచ్చట, ఆశ్చర్యం, నేను.. నిశ్శబ్దాన్ని, మధురగీతం, ఎజెండా, మాయదారి మద్యం, విముఖత, సంస్కారగిరి, మార్పు, వెలుగు చీకట్లు, స్వావలంబనగీతం, మూల్యం, ఉనికి కోల్పోయిన స్వరాలు, ఆజాదీ, సోమచ్ పెయిన్ విత్‌నో వర్క్స్, ఆవేదన పరమార్థం, ఆశల ఉనితీత, అమృత్ మహోత్సవ్, నిలుపుకోని అస్తిత్వం. స్‌ితంత్ర భారత వినిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అన్న ప్రశ్నకి దేశ కీర్తిని పెంచుతూ చెరిగిపోని చరిత్ర సృష్టించిన ధీరులందరూ అన్న సమాధానాన్నిచ్చారు.
హిజాబ్ ఒక ఆచారమే కాదు ఆత్మవిశ్వాసపు ఛాయ అన్నారు. అనుక్షణం పోరాటమే ఐనా గెలవడమే ధ్యేయంగా మునుముందుకు సాగాలని చెప్పారు. పెంచుకుని, తెంచుకునే సంబంధాల సమ్మిళిత భ్రాంతియే మనిషి జీవితమన్నారు. సమస్యలకు ముగింపు పలికే పరిష్కార ప్రమిదలను కవుల కైతలు వెలిగించాలని కోరారు. మనిషి వాస్తవాల రధ్యలో నిరంతర నడకను సాగిస్తూ చెరిగిపోని చరితగా నిలిచి చిరునవ్వై చిగురించాలన్నారు. చివరగా కరోనా కాలమ్‌లో చేర్చిన బాధ్యత, ఎడ్డి మడుసులు, మాయరోగమొచ్చిందే, చెంపపెట్టు, చరమగీతం, కవితలలో పేదోడు, గొప్పోడు అన్న బేధం లేకుండా కాటేసిన కరోనా మిగిల్చి వెళ్లిన విషాదం నుండి ధైర్యంగా కోలుకొని మనుగడ కోసం అడుగేసేందుకు గొంతులు సవరించమన్నారు. మానవత్వాన్ని పంచే మనుషులు ఉదయించాలని, జీవన క్రాంతులను పరచే తరాలు రావాలని, గుండె గాయాలు మాని సుషమా సుందరంగా, ఆనంద మందిరంగా భవిష్యత్తు అష్టదళ పద్మంలా పరిమళించాలని ప్రగాఢంగా కవయిత్రి కోరుకున్నారు. మనిషి లోలోపలి ఎడతెగని యుద్ధానికి నిఖార్సైన ప్రతిబింబాలు ఈ సంపుటిలోని కవితలు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764