ధరలు పెరగడం, పేదలు చితికి పోవడం… సమాంతరంగా సాగుతున్న వైనం…
దేశంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి. ధరలు పెరగడం, పేదలు చితికి పోవడం అన్నది సమాంతరంగా సాగుతోంది. అయినా కిందిస్థాయిలో ఏం జరుగు తున్నదో తెలుసుకోలేక పోతున్నారు. కనీసం ఇప్పటికైనా ఎన్‌డిఎ పక్షాలు ఆలోచనచేయాలి. ప్రజలపై మోపుతున్నా భారాలను తగ్గించాలి. ధరల పెరుగుదలపై చర్చించాలి. మోదీ ఆర్థిక విధానాలను చర్చించాలి. లేకుంటే ఎన్‌డిఎ పక్షాలు కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. కేవలం కార్పోరేట్ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. పేద, సామాన్య ప్రజలు ఎంతగా చితికి పోతున్నారో గమనించడం లేదు. జిఎస్టీ కారణంగా వస్తువుల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఆలోచన చేయడం లేదు. దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చినంత మాత్రాన, ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని వంచించడానికి అన్నది బిజెపి పాలకులు ఆలోచన చేయాలి. ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల్కెన టిడిపి, జనసేన, ఇతర పార్టీలు కూడా దీనిని విశ్లేషించాలి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా మోదీ ఉన్నారే తప్ప ఫలితాలను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుందామన్న లక్ష్యాన్ని ప్రకటించడం లేదు. ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోవడం లేదు.
ప్రధాని మోదీ కేవలం తాను అనుసరించిన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించారంటూ, చెప్పు కోవడం ఆత్మవంచన తప్ప మరోటి కాదు. కేవలం కాంగ్రెస్ ను, విపక్షాలను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదు. పాలనలో కొత్త ఒరవడి సృష్టించాలి. ప్రజలకు మేలు జరిగేలా సంస్కరణలు ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆహరధాన్యాల ధరలు తగ్గాలి. ఎక్కడ తప్పిదం జరిగిందో పరిశీలన చేయాలి. ప్రజలకు గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం చేసి, ప్రధాని పదవిని చేపట్టిన మోదీపై ప్రజలకు విశ్వాసం ఉంటే పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఎందుకు ఉంటాయి. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే వాత తప్పదని మొన్నటి ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు కొద్దిగా రుచి చూపారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రధాని తన వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టి ప్రచారం చేశారు. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించలేకపోతున్నామని గమనించాలి. సంస్కరణలంటే ప్రజల జీవన ప్రమాణాలు మారాలని గుర్తుంచుకోవాలి. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ధరలను, నేటి మార్కెట్ ధరలను ఎందుకు బేరీజు వేసుకోవడం లేదో ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా, గట్టిగా పోటీ పడలేకపోయినా ప్రజల ఆలోచనలు కాంగ్రెస్ వైపు మళ్లేలా చేసింది ప్రధాని మోదీ అని గుర్తించాలి. ఇకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుందని భావించాలి. దానికి కాంగ్రెస్ గొప్పతనం కాకుండా మోదీ అనుసరిస్తున్న పిడివాద సంస్కరణల ఫలితమని గుర్తించాలి.
హర్యానాలో మళ్లీ అధికారం నిలబెట్టు కోవడం..బిజెపికి ప్రజలు వత్తాసు పలుకుతున్నారని అనుకోరాదు. కాంగ్రెస్ పార్టీ వొచ్చే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుందనడానికి కాశ్మీర్, హర్యానా ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. తాము ప్రవచిస్తున్న సంస్కరణలు ఎక్కడ దారితప్పాయో గమనించాలి. పివి నరసింహారావు లాగా సంస్కరణలు ప్రజలకు ఎందుకు మేలు చేయలేకపోతున్నాయో పరిశీలన చేయాలి. ఇప్పటికైనా నోట్లరద్దు, జిఎస్టీ విపరిణామాలను విశ్లేషించుకోవాలి. విమర్శలను హెచ్చరికగా తీసుకుని ముందుకు సాగితే తప్ప మనలేమని మిత్రద్వయం గుర్తించి ప్రజలకు మేలుచేసే సంస్కరణలను అమలు చేయాలి. అప్పుడే బిజెపి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు. ఇకపోతే అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మభ్య పెట్టిన మోదీ ఆ ఊసే ఎత్తడం లేదు. పదేళ్లు కావొస్తోంది. స్వయం ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. గత పదేళ్లలో.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కార్మిక వ్యతిరేక విధానాలతో వేలాది పరిశ్రమలు మూతపడడానికి కారణం అయ్యారు. బిజెపి ప్రభుత్వ అనాలోచిత, ఏకపక్ష విధానాలు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. పెరుగుతున్న అధిక భారాలు, పన్నులు, నిరుద్యోగం, నూతన విద్యావిధానం, ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, రాజ్యాంగ వ్యవస్థల్లో అనుచిత జోక్యం, రక్షణ రంగంలో ఉద్యోగాల కోతకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాల్సిన అవసరం ఎంత్కెనా ఉంది. ఈ కారణంగా కనీసం 6 కోట్ల మందికి ఉపాధి పోయిందని అంచనా. అన్ని సంస్థలను ప్రైవేటుకు అప్పగించే పనిలో మాత్రం వేగం పెంచారు. రైల్వేరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పుతున్నారు. విశాఖ ఉక్కును నష్టాల పేరుతో విదేశీ కంపెనీలకు అమ్మివేసే ప్రయత్నం చేస్తున్నారు. పండిరచిన పంటకు గిట్టుబాటు ధరలేక, దిగుబడిలేక ఎంతో మంది రైతులు అప్పులపాల్కె ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా వైరస్ కష్టకాలంలో ఉపాధి లేక వేలాదిమంది ఆకలితో అలమటించారు. ఆసుపత్రులకు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకున్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆనాటి పరిస్థితులను చూసి చలించిన ఎందరో వారిని దగ్గరికి తీసి, వారి ఆకలిని తీర్చి వారిని వారి గమ్యస్థలాలకు చేర్చే ప్రయత్నం చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారిని గాలికొదిలేసింది.
మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి విధానాలను వ్యతిరేకించకుండా అనుకూల రాజకీయాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశ విదేశీ కార్పొరేట్లకు వివిధ రకాల రాయితీలు, కానుకలు సమర్పిస్తూ వారిని మరింత సంపన్నవంతం చేయడం దారుణం. భారత రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం సగటున ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయల రుణాలు సంపన్నులకు రద్దయ్యా యన్నది గుర్తించాలి. కార్పొరేట్లు తీసుకున్న రూ.4.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో కేవలం రూ. 1.61 లక్షల కోట్లు మాత్రమే వన్‌ట్కెమ్ సెటిల్‌మెంట్ పేరుతో వసూలు చేశారు. అంటే బ్యాంకులు రూ.2.85 లక్షల కోట్లు కోల్పోయాయి. ఇలా బ్యాంకుల సొమ్ము కార్పొరేట్ల పాలు అవుతోంది. మోదీ ప్రభుత్వం వొచ్చాక పరోక్ష పన్నులను, సెస్సులను పెంచి జనంపై భారాలు పెంచి, ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్లకు వివిధ రూపాల్లో రాయితీలు కల్పిస్తోంది. బడ్జెట్లో దాదాపు 8శాతం కార్పొరేట్ పన్ను రాయితీల ద్వారా వారికి లక్షల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఇలా అన్ని విధాలుగా సంపన్నులకు ప్రజల సంపదను దోచిపెడుతున్న సర్కారు సామాన్య రైతులు, సాధారణ ప్రజలపట్ల మాత్రం కర్కశంగా వ్యవహరిస్తోంది. కరువు కాటకాల వలన, వరదలు, తుపాను వలన నష్టపోయి లేదా పంటకు న్యాయమైన ధర దక్కక తీవ్రంగా నష్టపోయిన కారణంగా బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి తీర్చలేని రైతుల నుండి మాత్రం ఎటువంటి మినహాయింపు లేకుండా వసూలు చేయాలని బ్యాంకులను సర్కారు ఆదేశిస్తుంది. ఈ పదేళ్లలోనే పది లక్షల కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఆర్థిక క్రమశిక్షణ ఏమయినట్లో మోదీసర్కారే చెప్పాలి.
-డా.సి.వి.రత్నకుమార్