- నియోజక వర్గాల పునర్విభజన సమగ్రంగా జరిగేనా?
- పదేళ్లయినా నేటికీ అమలు కాని నియోజకవర్గాల పెంపు
- డీ లిమిటేషన్ చేపడితే తప్ప న్యాయం జరగదన్న ధోరణి
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. ఈ మేరకు అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. అయితే విభజన హామీలన్నీ గాలికి పోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన సమగ్రంగా జరగాలంటే జనాభాతో పాటు అభివృద్ధి సూచికలు, ప్రాంతాల సరిహద్దులను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. నియోజక వర్గాల పునర్విభజన చేస్తే అన్ని ప్రాంతాలు, వర్గాల అభిప్రాయాలు తీసుకుంటే మంచిది. అయితే జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. 1973లో వివిధ రాష్ట్రాలకు ఏ నిష్పత్తి ప్రకారం సీట్లను కేటాయించారో ఆ విధంగానే ఇప్పుడు కూడా అలాంటి నియమాలు, నిబంధనలను పాటించాలని కోరుకుంటున్నాయి. ఒకవేళ లోక్‌సభ సీట్లు పెంచాల్సివచ్చినా అదే నిష్పత్తితో అన్ని రాష్ట్రాలకు సమంగా వర్తింప చేయాలని కూడా అంటున్నాయి.
జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన పక్రియను చేపట్టాలి. లోక్‌సభ, శాసనసభల సీట్లకు సంబంధించి గ్రామీణ, నగర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన జరిగి, అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని సూచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కేంద్రంలోని మోదీ సర్కార్ జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమాలోచనలు జరిపి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటే మంచిది. 1951 జనగణన లెక్కల ఆధారంగా మొదటిసారి డీలిమిటేషన్ పక్రియ జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థకు స్పష్టమైన రూపం తీసుకొచ్చేందుకుగాను మొదటి విడత కసరత్తు జరిగింది. ఆ తర్వాత 1961 జనగణన లెక్కల ఆధారంగా రెండోసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. తద్వారా స్వాతంత్యాన్రంతరం మొదటి దశాబ్దంలో పెరిగిన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు మరింత కచ్చితమైన రూపం తీసుకొచ్చారు. రెండో విడత నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ స్థానాలను 494 నుంచి 522కు పెంచారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభల స్థానాలను 3,771గా నిర్ణయించారు. ఆ తర్వాత 1971 జనగణన ఆధారంగా 1973లో మూడో విడత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారు.
– ఈసారి లోక్‌సభ స్థానాలను 522 నుంచి 543కి పెంచి, అసెంబ్లీల స్థానాలను 3771 నుంచి 3,997గా ఖరారు చేశారు. అంతేకాకుండా 2001 వరకు లోక్‌సభ స్థానాలను యథాతథంగా ఉంచాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002 డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, లోక్‌సభ స్థానాల సరిహద్దులను మాత్రమే మార్చి, సీట్ల సంఖ్యను మాత్రం యథాతథంగా కొనసాగించారు. అంతేకాదు, 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టకూడదని కూడా నిర్ణయించారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినందున అసెంబ్లీ స్థానాలను మాత్రం 4,123కి పెంచారు. అలాగే 1971 జనగణన ఆధారంగా చేపట్టిన పునర్విభజనతో నిర్ణయించిన లోక్‌సభ సీట్ల సంఖ్య 2026 తర్వాత మొదటిసారి జరిగే జనగణన వరకు యథాతథంగా ఉండాలని 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. ఇప్పుడు జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ఈ అంశం వివాదాస్పదంగా మారే సూచనలూ కన్పిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు ఈ అంశంపై గళమెత్తుతున్నారు. 1973లో జరిగిన పునర్విభజన తరహాలోనే రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్యను కేటాయించాలని వారు వాదిస్తున్నారు.
-కె.శ్రీనివాస్