రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోవాలి

విదేశాల్లో 28 మంది జగిత్యాల జిల్లా వాసులు మృతి?
జగిత్యాల జిల్లాకు రూ.1.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం  

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 25:  గ‌ల్ఫ్ బాధితులు రూ.5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా కోసం జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్ట‌ర్‌ బిఎం వినోద్ కుమార్, కాంగ్రెస్‌ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మృతుల స్వగ్రామాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించిన డేటా ప్రకారం గల్ఫ్ తదితర దేశాలలో 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు 28 మంది జగిత్యాల జిల్లా వాసులు మృతి చెందినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉన్నదని తెలిపారు. స్వంత అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్న వారి వివరాలు, విదేశాలలో అంత్యక్రియలు నిర్వహించిన వారి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.

మృత ధన సహాయం చెల్లింపు కోసం జగిత్యాల జిల్లాకు రూ.1 కోటి 40 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు ఎక్స్ గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని వినోద్ కుమార్, మంద భీంరెడ్డి కోరారు.   గల్ఫ్ దేశాలలో చనిపోయిన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) చెల్లింపు కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెంబర్ 205 కు కొనసాగింపుగా… అక్టోబర్ 7న విడుదల చేసిన మార్గదర్శకాల జీవో నెంబర్ 216 ప్రకారం నిబంధనలు, అర్హత ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా ఇరాక్ లో మరణించినవారికి ఎక్స్ గ్రేషియా పథకం వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 న లేదా తర్వాత చనిపోయిన కార్మికులు అర్హులు. మరణానికి కారణం ఏదైనా (సహజ మరణం, ప్రమాద మరణం, బలవన్మరణం) వర్తిస్తుంది.  మరణించిన గల్ఫ్ ఉద్యోగి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు ప్రాధాన్యత క్రమంలో ఈ  ప్రయోజనం కోసం కుటుంబ సభ్యులుగా పరిగణించనున్నారు. వారు తెలంగాణ రాష్ట్ర వాసులై, స్థానికులై ఉండాలి. ఇండియన్ ఎంబసీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్), రద్దు చేసిన (క్యాన్సల్డ్) పాస్ పోర్ట్ , మరణించిన సమయంలో విదేశాలలో ఉద్యోగానికి సంబంధించిన రుజువు (ఉదా. వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం, ఐడీ కార్డు), ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతా వివరాలు దరఖాస్తుకు జత చేయాలి. విదేశాల్లో మృతి చెందిన తేదీ లేదా మృతదేహం ఇండియాకు చేరుకున్న తేదీ నుంచి ఆరు నెలల లోపు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలి.

జగిత్యాల జిల్లాలో గల్ఫ్ మృతుల వివరాలు  బండి శేఖర్ (బండ లింగాపూర్, మెటుపల్లి, యూఏఈ), వెల్దుర్తి ప్రమోద్ కుమార్ (కోరుట్ల, యూఏఈ), నాంపెల్లి మహేష్ (కట్లకుంట, మేడిపల్లి, యూఏఈ), తౌటు రాంచంద్రం (క్రిష్ణా నగర్, జగిత్యాల, యూఏఈ), పులిశెట్టి రాజన్న (దమ్మన్నపేట, ధర్మపురి, సౌదీ ఆరేబియా), బైర శ్రీనివాస్ (పెగడపల్లి, కువైట్), గొట్ల కొమురయ్య (కొల్వాయి, బీర్పూర్, యూఏఈ), యదరవేని రవీందర్ (డబ్బు తిమ్మయ్యపల్లి, కొడిమ్యాల, యూఏఈ), సూద వినయ్ కుమార్ (నర్సింహులపల్లి, బీర్పూర్, యూఏఈ), సురకంటి చిన్న రాజరెడ్డి (అయిలాపూర్, కోరుట్ల, యూఏఈ), మహ్మద్ నభీ (మాదాపూర్, కోరుట్ల, సౌదీ అరేబియా), ఎంబారి నర్సయ్య (అల్లీపూర్, రాయికల్, యూఏఈ), బైర రంజిత్ (బాలపల్లి, జగిత్యాల, యూఏఈ), గోవిందుల రవి (గోపులాపూర్, బుగ్గారం, సౌదీ అరేబియా), గట్ల శ్రీనివాస లక్ష్మణ్ (వెల్లుల్ల రోడ్, మెటుపల్లి, యూఏఈ), బండ్ర రాజ శేఖర్ (కొల్వాయి, బీర్పూర్, యూఏఈ), నడిపొట్టు సత్తయ్య (కొత్తపేట, ఎండపల్లి, యూఏఈ), భూమల్ల గణేష్ (మోత్కురావుపేట, బీమారం, యూఏఈ), సింగారపు గంగాధర్ (గాంధీ నగర్, జగిత్యాల, యూఏఈ), ఉప్పు గంగన్న (సాతారం, మల్లాపూర్, యూఏఈ), కందెల్ల వెంకటి (వేంపల్లి, మల్లాపూర్, సౌదీ అరేబియా), తునికి శేఖర్ (కొత్తపేట, రాయికల్, యూఏఈ), పంజాల సత్యనారాయణ (జగిత్యాల, ఓమాన్), పరుశునేని రమేష్ (చందోలి, గొల్లపల్లి, ఖతార్), అల్లె రామస్వామి (శివాజీ నగర్, మెటుపల్లి, సౌదీ అరేబియా), కంకణాల శ్రీకాంత్ (నాచుపల్లి, కొడిమ్యాల, ఖతార్), కొత్తకొండ సాయి క్రిష్ణ (పురానిపేట, జగిత్యాల, కువైట్), గోనె నరేందర్ (కొత్తపేట, వెలగటూరు, సింగపూర్). మరి కొందరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని దేశాల పరిధిని విస్తరించాలి
18 ఈసీఆర్ దేశాలలోని బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ ఏడు దేశాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం  తెలిసిందే. అయితే ఈసీఆర్ జాబితాలోని మిగిలిన 11 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ లకు కూడా వర్తింపజేయాలని వీటితో పాటు సింగపూర్, ఇజ్రాయిల్, కాంబోడియా, రష్యా, ఉక్రేన్, మాల్దీవ్స్ తదితర దేశాలను కూడా చేర్చాలని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి సమయంలో విదేశీ ఉద్యోగం చేస్తున్నట్లు రుజువు సమర్పించాలి అనే నిబంధన కొంత ఇబ్బందికరంగా ఉంది. యజమానుల హింసలు భరించలేక పారిపోయిన వారు, పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు ఏజెంట్లు విజిట్ వీసాపై  విదేశాలకు తీసికెళ్ళి వదిలేసిన సందర్భంలో ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసులు) గా మారిన వారికి ఈ పథకం వర్తించకపోతే చాలా మందికి అన్యాయం జరుగుతుందని రవిగౌడ్, స్వదేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్ 7 కంటే ముందు చనిపోయిన వారికి కూడా మృతధన సహాయం వర్తింపజేయాలని, పాతవారికి కనీసం ఒక రూ.లక్ష అయినా ఇవ్వాలని కోరారు. నిబంధనలు సడలించి ఎక్కువ మందికి, ఎక్కువ దేశాల వారికి ప్రయోజనం చేకూరేలా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page