ఆర్టికల్‌ 370 డిమాండ్‌.. రాజకీయ లబ్ధి కోసమేనా?

రాజకీయ అధికారం అనుభవించిన పార్టీలకు  ప్రజలే  తగిన గుణపాఠం చెబుతారు

కాశ్మీర్‌ను రావణకాష్టంగా రగల్చడమే అక్కడి రాజకీయ  పార్టీల లక్ష్యంగా ఉంది. దానిని రగల్చడం ద్వారా చలి మంటలు కాచుకున్న అబ్దుల్లాలు, ముఫ్తీలు ఇప్పుడు 370 రద్దుతో దిక్కుతోచకుండా ఉన్నాయి. పాక్‌ తీవ్రవాదులకు వత్తాసు పలికేలా రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ కూడా మినహాయింపు కాదు. అడపాదడపా అది చిచ్చు పెడుతూనే ఉంటుంది. ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకో వాలని ఫరూక్‌  అబ్దుల్లా అంటారు. అలాగే పాక్‌తో చర్చలు జరపాలని కూడా ఆయన కోరుకుంటాడు. 370 ఆర్టికల్‌ ఎత్తేయాయలని సిఎం పీఠం అధిష్టించిన చిన్న అబ్దుల్లా పట్టుబడుతున్నారు. కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలకు కాశ్మీర్‌ భూతల స్వర్గంగా ఉండాలి. అక్కడి  హిందువులు ఊచకోతలకు గురవ్వాలి. మతమార్పిళ్లకు ఆజ్యం పోయాలి. ఇలా దాదాపుగా 70 ఏళ్ల అరాచకం సాగింది. మరోమారు దానినే కొనసాగించాలని ఈ పార్టీలు పట్టుబడుతున్నాయి. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో 370 ఆర్టికల్‌ పునరుద్దరణ కోరుతూ యుద్ధవాతా వరణం సృష్టించారు.  ఆర్టికల్‌ 370 పునరుద్ధరించాలంటూ ఇంజనీర్‌ రషీద్‌ సోదరుడు, అవావిరీ ఇత్తెహాద్‌ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఖుర్షీద్‌ షేక్‌ ప్లకార్డు ప్రదర్శించి తమ కుత్సిత బుద్ధిని ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు పరస్పరం దాడి చేసుకోవడం దారుణం కాక మరోటి కాదు. ఐదేళ్ళక్రితం కేంద్రం తొలగించిన 370, 32 (ఏ)లను తిరిగి పునరుద్దరించాలంటూ పీడీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది.

బీజేపీ అడ్డుపడటంతో రచ్చ సాగింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ జాతి వ్యతిరేకశక్తులతో, ఉగ్రవాదులతో చేయికలిపారంటూ  బిజెపి పార్టీ విమర్శలు చేయడం  జరిగింది. నిజానికి ఇక్కడ జరుగుతున్నది ఇదే. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ప్రత్యేక ప్రతిపత్తి అంశం ఘర్షణకూ, గందరగోళానికీ కారణాకి కాంగ్రెస్‌, నేషనల్‌ కానఫరెన్స్‌లు బాధ్యత వహించాలి. 370 ఆర్టికల్‌ ఉంటే ఇష్టారాజ్యంగా ఏలవచ్చన్నది ఈ రెండు పార్టీల వ్యూహం. గత 70 ఏళ్లలో ఇది రుజువయ్యింది. ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనకు పాటుపడకుండా ఇప్పుడు తేనెతుట్టెను కదపడం మంచిది కాదు. ఇప్పటికైనా కాశ్మీర్‌లో రాజకీయ అధికారం అనుభవించిన పార్టీలు బుద్ది తెచ్చుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని గుర్తించాలి. కేంద్రం కూడా పరిణామాలను చూసి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కంఠంలో ప్రాణం ఉండగా ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన 370 ఆర్టికల్‌ పునరుద్దరణ జరగదని ప్రధాని మోదీ  హెచ్చరించారు.  ఆర్టికల్‌ 370 ముగిసిన చరిత్ర. ఇది పెట్టడం ద్వారా నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ  పెద్ద తప్పిదమే చేశారు. దానిని సరిదిద్దడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు  దేశానికి మేలు చేశారు. అందుకే దాని ఊసెత్తడమే దేశద్రోహమని ఖచ్చితంగా బీజేపీ నేతలు, దేశ ప్రజలు ఆగ్రహిస్తున్నారు.  మరోపక్క ప్రత్యేకప్రతిపత్తిని అభ్యర్థించడం ద్వారా ఎన్నికల ప్రచారంలో తాను ప్రజలకు ఇచ్చిన హావిరీకి అనుగుణంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అడుగులు వేసినట్టూ అయింది.

ప్రత్యేక ప్రతిపత్తి, ఇతర రాజ్యాంగబద్ధమైన హావిరీలు కల్పించే విషయంలో కొత్తగా ఎన్నికైన జమ్మూకశ్మీర్‌ ప్రజాప్రతినిధులతో కేంద్రం చర్చలు ఆరంభించాలని ఆ తీర్మానం కోరింది. అలనాటి 370 రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టకుండా, ఇప్పుడు ఆ సంఖ్యను ప్రస్తావించ కుండా తీర్మానం చేయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదని పీడీపీ వాదిస్తోంది. 370 ఆర్టికల్‌ రద్దు తరవాత ఐదేళ్ళుగా అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నాయి. అయితే దీనిని వమ్ము చేయాలని పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు యత్నిస్తూనే ఉన్నారు. ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టి అక్కడ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ఉగ్రవాదులను ఏరివేసే చర్యలకు దిగడం మంచిది. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో 370 ఆర్టికల్‌ పొందుపర్చడం ద్వారా నెహ్రూ అక్కడ అగ్గి రాశారు. ఆక్రమిత కాశ్మీర్‌ గురించి మాట్లాడకుండా 370 గురించి మాట్లాడడం దారుణం కాక మరోటి కాదు.

కేంద్రంలో రెండవ తడవ 2019లో బిజెపి అధికారంలోకి రాగానే ఏకపక్షంగా 370 ఆర్టికల్‌ను, అందుకనుగుణమైన 35-ఎను తొలగించింది. ఒక రాష్ట్రంగా ఉన్న జమ్ము కాశ్మీర్‌ను జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఇది ప్రజల ఆకాంక్ష అన్నది విపక్ష పార్టీలు గుర్తించాలి. 370 ఆర్టికల్‌ ద్వారా జమ్ము కాశ్మీర్‌కు లభించిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని కోరుకోవడంలో అర్థం లేదు. అసలు ప్రత్యేక హోదాలన్న డిమాండ్లు  లేకుండా చేయాలి.   370 ఆర్టికల్‌ రద్దు చేశాక నెలల పర్యంతం భద్రతా బలగాల పహారాలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అయినా పక్కలో బల్లెంలా పాక్‌ తన కుయుక్తులను ఆపడం లేదు. దీనిని నిలదీయాల్సిన కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు అది పక్కన పెట్టి పాత 370 కోసం డిమాండ్‌ చేయడం కేవలం రాజకీయ లబ్ది కోసమే అన్నది వేరుగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్లుగా తిరుగులేని అధికారం అనుభవించిన కాశ్మీర్‌ పార్టీలు,కాంగ్రెస్‌లు తమ విద్వేష రాజకీయాలను  కొనసాగిస్తోంది. జమ్ము కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ద్వారా అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి.

అలాగే ప్రత్యేక హోదాను కాశ్మీర్‌కే కాకుండా దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు  ఆమోదించరాదు. ఇది దేశ ఐక్యతను దెబ్బతీస్తుంది. రాజ్యాంగంపై వారికి నమ్మకం కలిగించడం, ఈ దేశ పౌరులమన్న విశ్వాసం పెంపొందించడం ద్వారా కాశ్మీరీలు రాజకీయ పార్టీల కుయుక్తులకు దూరంగా ఉండాలి. కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. దీనిని ఎవరూ కాదనలేరు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా రాబట్టాలి. ఇప్పుడు అందుకోసం పోరాడాలి.

 -ఎస్‌.కె. వహీద్‌ పాషా
(ఎంఎస్సీ బి.ఎడ్‌),
ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page