ఆత్మ‌గౌర‌వ క‌థ‌…

అత్యంత ప‌రిణ‌తి, ఎంతో ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డిన త‌రువాత అక్ష‌రీక‌రించాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త‌నే ఆత్మ‌క‌థ‌. స్ప‌ష్ట‌మైన  అవ‌గాహ‌న‌, గురుత‌ర బాధ్య‌త‌తో స‌మాజానికి త‌న జీవితం నుంచి అందించ‌వ‌ల‌సిన విష‌యాల‌తో రాసే ఆత్మ‌క‌థ భ‌విష్య‌త్తు త‌రాల వారికి త‌ప్ప‌నిస‌రిగా స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాలి. ఆత్మ‌క‌థ‌లో అస‌మగ్ర‌త‌కు చోటుండ‌దు. జీవితంలోని ప్ర‌తి అంశాన్ని నిజాయితీగా వ్య‌క్తీక‌రించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మ‌క‌థ స‌మాజానికి ఆద‌ర్శ‌ప్రాయ‌మైన మార్గాన్ని చూపాలి. ఎంతో మంది ఆత్మ‌క‌థ‌లు రాయ‌డానికి వెన‌క‌డుగు వేస్తుంటారు. అన్ని అంశాల‌ను ప‌రిణ‌తితో త‌మ ఆత్మ‌క‌థ‌గా రాసేవాళ్ళు స‌మాజానికి దిశానిర్దేశం త‌ప్ప‌క అందించ‌డ‌మే కాదు ఆద‌ర్శ‌ప్రాయంగా కూడా నిలుస్తారు. ప‌రిణ‌తి, ఆత్మ‌విశ్వాసాల మార్గంలో అనేక  అంశాల‌ను విస్ప‌ష్టంగా వెల్ల‌డిస్తూ నెమ‌లి క‌న్నులు పేరుతో ఆచార్య దార్ల వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న ఆత్మ‌క‌థ‌ను  రాశారు. చ‌దివే వారిని నిశితంగా ఆలోచింప‌జేసే  ఎన్నో సామాజిక సంద‌ర్భాలు, సంఘ‌ట‌న‌లు ఈ ఆత్మ‌క‌థ‌లో నిక్షిప్త‌మై ఉన్నాయి.

దాదాపు ఆరు త‌రాల చ‌రిత్ర‌ను, ప‌రిణామాల‌ను అక్ష‌రీక‌రించిన తీరు ఈ ఆత్మ‌క‌థ‌లో క‌న‌బ‌డుతుంది. జీవితంలో జ‌రిగిన అనేక మ‌లుపుల‌ను మాట‌ల్లో రాయాలంటే ఎంత మ‌ధ‌నం జ‌రుగుతుందోన‌ని ఊహించ‌డానికి ఇందులోని ప్ర‌తివాక్యం సాక్షీభూత‌మ‌వుతుంది. మా ముత్తాత చెప్పులు / కుట్టేవాడు/  మా తాత‌/  కూలికెళ్ళేవాడు/  మా అయ్యేమో/  అక్ష‌రం కోసం/  ఆశ‌గా ఎదురు చూసేవాడు/  నేనిప్పుడు క‌విత్వం రాస్తున్నాను/  రేపు/  నా కొడుకు/  ప్రొఫెస‌ర‌వుతాడు అన్న వాక్యాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే తరాల చ‌రిత్ర‌గా సాగిన జీవ‌న‌పు నడ‌క అవ‌గ‌త‌మ‌వుతుంది. మొత్తం 37 అంశాల‌తో సాగిన ఈ ఆత్మ‌క‌థ దార్ల వారి బాల్యంతో ఆరంభ‌మై, ప్ర‌దేశాలు, ప‌ల్లెలు, త‌నింటి వాళ్ల‌తో, త‌న చుట్టూరా జీవించే మ‌నుషుల‌తో అల్లుకున్న అవ్యాజానుబంధాల బ‌లిమిని ఆవిష్క‌రించింది. ప్ర‌తివాక్యం ఏదో ఒక అపురూప అనుబంధాన్ని మోసుకొచ్చే ప్ర‌తిబింబంగా క‌న్పిస్తుంది. శాశ్వ‌తానుబంధాల పందిళ్ల‌కు ఇందులోని ఎన్నో వాక్యాలు ప్ర‌తీక‌లుగా మెరిశాయి. ద‌ళితులలోని అపార‌మైన మ‌నో విజ్ఞానాన్ని, అప్ప‌టి స‌మాజ‌పు స్థితిగ‌తుల దొంత‌రల‌ను, వెలివాడ‌ల జీవితాల‌లోకి వ్య‌ధాభ‌రిత దృక్కోణాల‌ను, దీన‌త్వంతో సాగిన జీవ‌న యానాల్ని ఈ ఆత్మ‌క‌థ ఎంతో సుస్ప‌ష్టంగా ఆవిష్క‌రించింది. ఆత్మ‌క‌థ రాస్తున్నానంటే న‌వ్విన వాళ్ళు ఉన్నారు అన్న ఇందులోని దార్ల వారి ఇంట‌ర్వ్యూ 37 అంశాలుగా రాసిన లోతైన‌ జీవితానుభ‌వాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచింది.

త‌న బాల్యాన్ని చ‌ల్ల‌ని ఓ చ‌ల‌మ‌, స‌ముద్రం విశాల‌మైన ఆకాశంతో పోల్చారు. అమ్మా, నాన్న‌, అన్న‌య్య‌ల మ‌ధ్య పెరిగి ఇంటి నుండి నేర్చుకున్న క్ర‌మ‌శిక్ష‌ణ‌, అప్పుడ‌ప్పుడు పెద్ద‌లు చేసే మంద‌లింపులే జీవితానికి గొప్ప మార్గ‌ద‌ర్శ‌న‌మైన ప‌రిస్థితుల‌ను విశ్లేషించి చ‌దివే వారిలో ఎంతో ఆస‌క్తిని ర‌గిలించేలా విశ‌దీక‌రించారు. త‌న బాల్యం నాటి ద‌ళిత జీవితాన్ని ఈ ఆత్మ‌క‌థ‌లో ఎంతో స్ప‌ష్టంగా, తేట‌తెల్లంగా వివ‌రించారు. ద‌ళిత ఉప‌కులంలో వాళ్ళు పొందే అవ‌మానాల్ని దాటుకుని ఎంతో కృషితో  కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలో ప్రొఫెస‌ర్ వంటి ఒక ఉన్న‌త స్థాయికి తాను ఎదిగిన క్ర‌మాన్ని తెలిపారు. ద‌ళితుల జీవితాల‌ను లోతుగా అధ్య‌య‌నం చేస్తున్న అనుభూతిని ఈ ఆత్మ‌క‌థ క‌లిగిస్తుంది. బాల్యం నాటి విష‌యాల‌ను రాస్తూ ద‌ళితుల‌కు ఆనాడు గ్రామాల‌లో క్ష‌వ‌రం చేయ‌ని, బ‌ట్ట‌లు ఉత‌క‌ని సామాజిక అస‌మాన‌త‌లు పేరుకున్నఅవ‌స్థ‌ల‌ వ్య‌వ‌స్థ‌ను గురించి ఎంతో వేద‌న‌తో చెప్పారు.

ప‌రిస్థితులెలా ఉన్నా ఆత్మ‌ధైర్యంతో అడుగేస్తూ స్వీయ అస్తిత్వ గౌర‌వాన్ని స‌గ‌ర్వంగా నిలుపుకున్న ప‌రిస్థితికి ఈ ర‌చ‌యిత ఆత్మ‌క‌థ అద్దం ప‌ట్టింది. పాలేరుల వెట్టి వెత‌ల్ని భిన్న సంఘ‌ట‌న‌ల‌ను క్రోడీక‌రిస్తూ దృశ్యాలుగా క‌ళ్ళ‌ముందుంచారు. ఊరిలో త‌ల‌లో నాలుక‌లా ఉండే తండ్రి త‌మ‌కు  జ‌రిగిన అవ‌మానానికి త‌గిన బుద్ధి చెప్పించి పాలేరు త‌నానికి శాశ్వ‌తంగా ముగింపు ప‌లికిన విధాన్ని గొప్ప సంఘ‌ట‌న‌గా చెప్పొచ్చు. స‌మ‌స్య‌ల‌పై స్పందించే స్పంద‌నాశీల‌త్వం ర‌చ‌యిత‌కు బాల్యం నుండే అల‌వ‌డి ఉంద‌న్న విష‌యాన్ని ఈ ఆత్మ‌క‌థ చెప్పింది. గ్రామంలోని రోడ్లు, విద్యుత్, త‌పాలా, పెన్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం, పత్రిక‌ల‌ను చ‌ద‌వ‌డం వంటి అంశాలు ఎదిగే క్ర‌మంలో ర‌చ‌యిత‌లోని స‌మాజ అవ‌గాహ‌నా దృక్ప‌థాన్ని తెలిపాయి. ప‌ద‌వ త‌ర‌గ‌తిలో లెక్క‌ల్లో రెండు మార్కుల‌తో త‌ప్పాన‌ని చెప్పుకున్న ర‌చ‌యిత నిజాయితీకి నిగ్గుట‌ద్ద‌మే కాకుండా ఆత్మ‌క‌థా సూత్రాల‌కు  నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఆత్మ‌క‌థ‌లో భాగంగా తీవ్ర‌త‌ను క‌లిగించే విష‌యాల‌ను, సంఘ‌ర్ష‌ణ‌ను చెప్పే క్ర‌మంలో రాసిన వాక్యాలు క‌వితాత్మ‌కంగా ఉండి ఆ  స్థితి ప్ర‌బ‌ల‌త‌ను చాటాయి. ఆత్మ‌క‌థ ఒక వ్య‌క్తికి సంబంధించిందే అనిపించినా ఆనాటి సామాజిక‌, కాల‌మాన స్థితిగతుల‌కు ప్ర‌తిరూప‌మ‌న్న‌ది ఈ ర‌చ‌యిత ఆత్మ‌క‌థ చెప్పింది.

కొన్ని వృత్తుల‌కే ద‌ళితులు ప‌రిమిత‌మ‌వుతార‌న్న ఒక భావ‌జాలాన్ని నిష్క‌ర్ష‌గా ఖండించి సామాజిక వాస్త‌విక‌త‌ను ర‌చ‌యిత‌ దృశ్య‌మానం చేశారు. కోన‌సీమ సౌంద‌ర్యం మాటున దాగిన ద‌ళిత ఉప‌కులాల వారు భ‌రించిన అవ‌మానాలు, తెగించి జ‌రిపిన ఆత్మ‌గౌర‌వ పోరాటాల‌ను ఈ ఆత్మ‌క‌థ  ప్ర‌తిబింబించింది. నిజాయితీ అన్నదే అంత‌సూత్రంగా ఈ  ర‌చ‌యిత ఆత్మ‌క‌థ స్ప‌ష్ట‌త‌తో అనేక సంఘ‌ట‌న‌ల‌ను పూస‌గుచ్చిన‌ట్టు విడ‌మ‌ర్చి చెప్పింది.  స్వచ్ఛమైన అమాయ‌క‌త్వం ఒక వైపు, పోరాట శీల‌త క‌లిగిన ఆత్మ‌గౌర‌వం మ‌రోవైపు రెండు కోణాలై నడచిన ఆలోచ‌నాత్మ‌క‌మైన ఆత్మ‌క‌థ ఇది. అస‌మాన‌త‌ల వ‌ల్ల గుండెకు త‌గిలిన గాయాల్ని, అవ‌మాన‌పు కంట‌కాల్ని పేద‌రికంతో కుటుంబం గ‌డ‌వ‌క ప‌స్తులుండే ప‌రిస్థితుల నుండి నిరంత‌ర శ్ర‌మ‌తో పూల దారులుగా మార్చుకుని బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అందించిన ధైర్యంతో తానాశించిన గ‌మ్యాన్ని చేరుకున్న ల‌క్ష్య సాధ‌కునిగా, ద‌ళితుల ధైర్య‌సాహ‌సాల‌కు ప్ర‌తినిధిగా, విజేత‌గా  ఈ ఆత్మ‌క‌థను  చ‌దివే పాఠ‌కుల‌కు  ర‌చ‌యిత ఆవిష్కృత‌మ‌వుతారు. పేరాశ‌ల‌కు పోకుండా ఉన్న‌దాంట్లోనే తృప్తి చెందాల‌న్న‌ది కుటుంబం నుండి అల‌వ‌ర్చుకున్న త‌త్వం కాగా, ఆరుగాలం క‌ష్ట‌ప‌డే రైత‌న్న నోటికి అన్నం ముద్ద అంది ఆక‌లి లేని రైతు శ్రేయోరాజ్యం విక‌సించాల‌న్న త‌ప‌న‌తో శ్ర‌మ జీవుల ప‌ట్ల ఉన్న‌ గౌర‌వ భావ‌న ర‌చ‌యిత ప్ర‌త్యేక‌త‌ను నిలిపింది. అంట‌రానితం, అనాలోచితం, అమానవీయత ప‌ట్ల ఆంత‌రిక ఆగ్ర‌హ జ్వ‌ల‌నం, సామాజిక మార్పు కోసం ఆలోచ‌నాశీల‌త‌తో, సంయ‌మ‌నంతో, ప‌రిణతతో సాగే ర‌చ‌యిత దృక్ప‌థాన్ని ఈ ఆత్మ‌క‌థ సూటిగా వెల్ల‌డించింది.

ర‌చ‌యిత త‌మ ఊరు చెయ్యేరు అగ్ర‌హారంలో బాల్య‌పు రోజుల్లో రేడియో వంటి ప్ర‌సార సాధ‌నాలలో ప్ర‌సార‌మ‌య్యే నాట‌కాలు, ధారావాహిక‌లు విన‌డం, ఎంతో క‌ష్టంతో ప‌త్రిక‌ల‌ను స‌మ‌కూర్చుకుని చ‌ద‌వ‌డం వ‌ల్ల క్ర‌మంగా స‌మాజంపై అవ‌గాహ‌న పెరిగిన తీరును ప్ర‌స్తావించారు. బాల్యంలోని స్వ‌చ్ఛ‌మైన అమాయ‌క‌త్వాన్ని ఎంతో స‌హజంగా అభివ‌ర్ణించారు. కుల వివ‌క్ష, ఆధిప‌త్య‌పు అభిజాత్యాన్ని, వేధింపులు, అవ‌మానాల‌ను త‌ట్టుకోలేని వ‌ర్గాల ఆక్రోశాన్ని ర‌చ‌యిత త‌న మేధో మ‌ధ‌నంతో అక్ష‌ర‌బ‌ద్ధం చేసి ఘాటుగా చుర‌క‌లంటించారు. ఇంట్లో తిన్న అరిసెలు, పోకుండ‌లు, బూరెల గురించి, తాత, మామ్మ (నాయ‌న‌మ్మ‌), ర‌జ‌కులు, నాయీబ్రాహ్మ‌ణులు, నాట‌కాలు, బుర్ర క‌థ‌లు,  పెద్ద‌న్న‌య్య‌, స్నేహితులు, తోబుట్టువులు, కేస్ట్ స‌ర్టిఫికెట్ పొందేందుకు ప‌డ్డ బాధ‌ల గురించి వివ‌రిస్తూ జీవితంలోని ఎగుడు దిగుళ్ల‌ను, కుటుంబాలు, స‌మాజం చుట్టూ అల్లుకున్న విడ‌దీయ‌లేని అనుబంధాలను వివ‌రించారు.

నన్నునీటిలోకి తోసేసామ‌నుకున్నారు, నాకు ముత్యాలు దొరుకుతాయ‌ని వాళ్ళ‌కు తెలియ‌దు/ న‌న్ను పాతాళం  లోకితొక్కేద్దామ‌నుకున్నారు/  నేనొక మ‌హావృక్షాన్నై మొలుచుకొస్తాన‌ని వాళ్ళ‌కు తెలియ‌దు/  నన్ను ఆకాశంలోకి విసిరేద్దామ‌నుకున్నారు, ఆ శూన్యం నుండే నేనంద‌రి దాహాన్ని తీర్చే ఓ నీటి చుక్క‌నై కురుస్తాన‌ని వాళ్ళ‌కు తెలియ‌దు అని ర‌చ‌యిత రాసిన ఈ వాక్యాలు అత‌నిలోని అప్ర‌తిహ‌త‌మైన ఆత్మ‌విశ్వాసం, ధృడ‌మైన ప‌ట్టుద‌ల‌, అంత‌కుమించిన కృషి, న‌మ్మ‌కాన్ని బ‌ల‌ప‌రిచాయి. ఉన్న‌తీక‌రించిన మ‌హామ‌నిషిగా రూపొంద‌డానికి, గొప్ప సంఘ‌ట‌న‌లు పురుడు పోసుకోవ‌డానికి  ప్ర‌కృతి ఎంత‌గా స‌హ‌క‌రిస్తుందో తెలుసుకోవ‌డానికి ఈ ర‌చ‌యిత జీవిత‌మే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. వ‌సంతాలు, శ‌ర‌త్తులు    స‌మంగా వెలిగేదే మ‌నిషి జీవిత‌మ‌ని ఈ ఆత్మ‌క‌థ సందేశించింది. అక్ష‌రం ప‌ట్ల ర‌చ‌యిత‌కు ఉన్న అవ్యాజ‌మైన అనుర‌క్తి ఆత్మక‌థా ర‌చ‌న‌ను ప‌రిపుష్టంగా న‌డిపించి ప‌రిపూర్ణ‌త‌ను చేకూర్చింది. సౌహార్ద్రం, సౌభ్యాతృత్వం, ప్ర‌కృతి ప్రేమ‌తో పాటు త‌దేక దీక్ష‌తో అఖండ‌ విజ‌యాన్ని సాధించి తిరుగులేని శ‌క్తిగా స‌మాజంలో నిలిచిన వ్య‌క్తి శ్ర‌మ‌ విరాట్ స్వ‌రూపాన్ని ఆవిష్కరించిన విశిష్ట ర‌చ‌న‌ ఇది.

– డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్
                           9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page