మానవ తాత్వికతకు దర్పణం బాలగోపాల్

ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవని సామాజిక రీతులలో, ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిపత్యాలు ఉండగలవని వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్.

( నేడు బాలగోపాల్ 15  వర్ధంతి )
8 అక్టోబర్ 2009 న మరణించి ఇప్పటికీ 15 సంవత్సరాలు గడుస్తున్నా అతని ఆవశ్యకత అతని ప్రాసంగికత కాల గమనాన్ని తట్టుకొని ఇప్పటికీ స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం అతను వివరించినంత లోతుగా, విస్తృతంగా విశదీకరించిన వారు తెలుగు నాట మరొకరు లేరన్నది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యం తో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదని , సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్ప పూర్వకంగా అలవర్చుకోవలసినదిగా, దానికి వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అని నొక్కి వక్కాణించిన వాడు బాలగోపాల్. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని , మానవ ఆచరణను, సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా బాలగోపాల్ వివరించారు.

ఒక్క మానవతాత్వికతను మాత్రమే కాదు దాని సామాజిక చలన సూత్రాలను సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అతి అరుదైన వ్యక్తి ఆయన. సంక్లిష్టమైన భారత సామాజిక జీవితం లో అసమానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెనవేసుకుపోయిన విషయం మనకు అందరకి తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపుమాపటానికి చైతన్యపూరితంగా మనము చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. ఆగస్ట్ 1వ తేదీ 2024న సుప్రీం కోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం అతని వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి అతను. వివక్ష ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసిగట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశదపరిచిన వ్యక్తి బాలగోపాల్.

వివక్ష అసలు అర్థం అసమానతేనని అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదని అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందని ఎలుగెత్తిన వాడు ఆయన. పాలస్తీనా పై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండ కు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. అంతకంతకు పెచ్చరిల్లి ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదమని అందరూ అనుకుంటూ ఉన్న ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం, అలాగే ఉక్రెయిన్ పై రష్యన్ దురాక్రమణ వంటి అంతర్జాతీయ స్థాయి విషయాలు మొదలుకొని మన ప్రభుత్వాలు కొనసాగిస్తున్న నియంతృత్వ పోకడల వరకు అంతేకాదు రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఆధిపత్య పోరును తద్వారా కొనసాగ గలిగే అసమానతను దోపిడీని సైతం తన సునిశిత పరిశీలనా శక్తితో విడమరిచి చెప్పగలిగే అరుదైన మేధావి . అధికారాన్ని సందేహించని వారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట అతనిలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది.

తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచన ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్టంలో ఇమిడేది కాదని మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమని తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మానవతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవని సామాజిక రీతులలో, ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిపత్యాలు ఉండగలవని వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్.

ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ అతను అందించిన తాత్విక దృక్పథం మనకు అతని రచనల ద్వారా ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో నిస్సందేహంగా పరిష్కారాలు లభించగలవు. ఉద్యమాలను ప్రజాస్వామికంగా నడపడంలో అతనికి పోలిక చూపలేమేమో. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి. ప్రజాస్వామిక సమస్యలను గుర్తించటం లోను, వాటికి పరిష్కారాలు వెతకడంలోనూ, మౌలికంగా ప్రజాస్వామ్య సూత్రాలను దండలో దారంలాగా ఇమడ్చగలిగే అసాధారణ నిపుణుడు ఆయన. ఎవరికి వీలైనంత వారు మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే మనకు మిగిలిన, ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.

టి హరికృష్ణ – మానవ హక్కుల వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page