ఒక్కో వాక్యం వెనుక ఒక్కో అనుభవం

ఇప్పుడు
చమురంటిన దీపంలా
ఆ ఇల్లు ఒక్కటే  పెద్ద పెద్ద డాబాల మధ్య
మిణుకు మిణుకు మంటుంది..

పడక కుర్చీలో చొక్కా లేకుండా ఆయన
వృద్ధాప్యంలోనూ  హుందాగా ఉంటే
చాప పై ఒత్తులు చేసుకుంటా దేవుడిని
స్మరించుకుంటూ ఆమె కనిపిస్తుంది.

ఇంకెవ్వరితో సంబంధం లేని వాళ్ళలా
ఇంటి ఒడిలో గువ్వలై ముడుచుకుని
ఏదో చెప్పుకుంటారు…
కాదని, ఔనని వాదిస్తూ వాళ్ళకి వాళ్ళే సందడి

ఎవరైనా కనిపిస్తే పాత విషయాలని
పోటీ పడుతూ తవ్వి పోస్తారు.
పొద్దు మరచేలా పాత కాలాన్ని
ఏకరువు పెడతారు…

చీకటి పిలిచేదాక  కబుర్లు మూతపడక
బాగా రాత్రయ్యక ఏదో దిగులు మేఘం
ఇద్దరిలో ఓ జల్లు కురిసి

చెమర్చిన కళ్ళు
ఇంకా ఏవో కోరికలతో తడిగా ఉంటాయి
దూరంగా ఉన్న పిల్లలపై రెట్టింపు ప్రేమతో

ఉన్న ఫలంగా మనసుపై ఏది వాలినా
నచ్చితే పలుసార్లు చెప్పుకునే ముచ్చటే
కోపం వచ్చినప్పుడు
అచ్చమైన ప్రేమ బయటపడటం గొప్ప విశేషం.

ఎంత పాత చుట్టరికాన్నైనా
కొత్త  బంధాలనైనా
బాధ్యత బరువుని తేలిగ్గా మోస్తూ
వీసమెత్తు మార్పు లేని పధ్ధతికి ప్రాణం పోసి

ఎముకలు అరిగి,  నడుములు వంగినా
కంటిలో ఆ వెలుగు మారలేదు
గొంతులో ఆ పలుకు తీపి తగ్గలేదు.
ఆ చేతుల్లో చురుకు తరగలేదు.

డెబ్బై ఏళ్ల కాపురంలో
ఏన్నో కన్నీటి తుఫాన్లు
పచ్చి పేదరికంలో బిడ్డల పెంపకం
కఠిన అంక్షల మధ్య చెక్కుచెదరని నిజాయితీ

ఇంకా చిరిగిన పుస్తకాల్లా ఆ జీవితాల్లో
ఒక్కో వాక్యం వెనుక ఒక్కో అనుభవం
నేటి కాలం వాళ్ళు  పలికేందుకు
నోరు తిరగని గొప్ప విలువులు అవి.

కాలం ప్రేమించిన పుణ్యానికి
దేవుడు వరమిచ్చి
దీవించిన వారి బ్రతుకులో
ప్రతి అడుగు గొప్ప మార్గమే
ప్రతి పలుకు ఓ పాఠమే.

ఈ క్షణంలో కూడా
ఆ మనసు వెనక్కి తగ్గని
వయసులో కూడా పిన్నలని
దీవించే  చేతులతో

ఆయన రుచికి తగినట్లుగా
మర్యాదతో ఇల్లు పలుకరిస్తూనే ఉంది
ఆమె ఇష్టానికి తగినట్లుగా
కాపురం  ప్రేమను కురిపిస్తూనే ఉంది.

చందలూరి నారాయణరావు
       9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page