ప్రజాతంత్ర బ్యూరో, అక్టోబర్ 26 : ‘మిలే కదం..జుడేవతన్(అడుగులో అడుగు వేద్దాం..దేశాన్ని ఏకం చేద్దాం) అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకొచ్చిన ‘భారత్ జోడో యాత్ర’ నిర్విరామంగా కొనసాగుతుంది. నేటి నుంచి రాష్ట్రంలో మలి విడత మక్తల్ నుంచి ఉదయం 6 గం.లకు ప్రారంభం కానుంది. భారతీయ జనతాపార్టీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత ప్రజలను ఏకం చేసేందుకు సుదీర్ఘ పోరాటానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. 12 రాష్ట్రాలు..3500 కి.మీ..148 రోజులు లక్ష్యంగా ‘భారత్ జోడో యాత్ర’ సెప్టెంబర్ 7న ఎంతో ఉత్సాహంగా మొదలయింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలలపాటు సాగే ఈ యాత్రలో ప్రతీ ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా భావిస్తూ అడుగులో అడుగు వేస్తున్నారు. ఉరకలెత్తే ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ యాత్రకు సంబంధించిన లోగో, ట్యాగ్ లైన్ పోస్టర్‌ను పార్టీ సీనియర్ నేతలు జై రామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్‌లు ఆగస్టు 24న దిల్లీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రత్యేక వెబ్-సైట్‌ను సైతం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 12కు పైగా రాష్ట్రాల్లో 3500 కి.మీ మేర సాగే ఈ యాత్ర మొత్తం నడకలోనే సాగుతుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ ‘భారత జోడో యాత్ర’ 148 రోజులపాటు కొనసాగి కశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రతి రోజు 25 కి.మీ పాటు యాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా ర్యాలీలు, బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు, మరో కొంత మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. మార్గమధ్యంలో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు చేరుతున్నారు. ఏదో ఒక పార్టీకి పరిమితం చెందిన యాత్రగా కాకుండా, అన్ని వర్గాలను ఏకం చేసేందుకు ఈ యాత్రను చేపట్టినట్టు..అందుకే కాంగ్రెస్ గుర్తు పెట్టలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ యాత్ర తనకు తపస్సులాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశాన్ని ఏకం చేయడం అనేది ఒక సుదీర్ఘ పోరాటమని తెలిసినప్పటికీ అందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఉద్ఘాటించారు.
ఈ ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణాలో అడుగు పెట్టింది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీతో కలిసి ఈ యాత్రలో అడుగులో అడుగు వేసిన కొంతమంది సివిల్ సొసైటీ సభ్యులను బుధవారం నాగోల్ లోని బండ్లగూడలో కలిస్తే..పాదయాత్రలో తమ అనుభావాలను నెమరేసుకున్నారు. అరుణోదయ సింగ్ పరివార్(కర్నాటక), షాహిద్ కమాల్(బిహార్), సురేంద్ర పాల్ సింగ్(హర్యానా), మోహనన్(కేరళ), ప్రత్యూష్(మహారాష్ట్ర), వీరేంద్ర సింగ్ భాహురియా (హర్యానా), వకీల్ హస్మి(ఉత్తర్ ప్రదేశ్), విక్రాంత్ పాండే(ఉత్తర్ ప్రదేశ్), సర్ఫరాజ్ ఖాజీ(మహారాష్ట్ర), వరుణ్(ఆలపాటి-కొల్లం-కేరళ), ఫరూక్ మహమ్మద్ (కోయికూడ్-కేరళ), మహమ్మద్ అబ్దుల్ రహమాన్(మలంపూర్-కేరళ), ఓంకార్ యాదవ్(జాన్పూర్-ఉత్తర్ ప్రదేశ్), సోహెల్ (దిల్లీ)లు ఈ ‘జోడోయాత్ర’ తమకు జీవితంలో మరచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభించిన తాము కశ్మీర్ వరకు అడుగులు వేస్తామని తెలిపారు. అరుణోదయ సింగ్ పరివార్(కర్నాటక) మాట్లాడుతూ.. ‘‘సివిల్ సొసైటీకి చెందిన నేను ఈ యాత్రలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు రాహుల్ వెంటనే ఉంటాను. సామాన్యులకు మోదీ పాలన గుది బండలా తయారైంది. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా యువతను పెడదారి పట్టిస్తున్నారు. మతపరమైన రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ దశలో రాహుల్ యాత్ర ప్రతి ఒక్కరిలోనూ సంఘర్షణని తట్టిలేపుతుంది. చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా కుటుంబమంతా కలిసి ఈ యాత్రలో పాలు పంచుకుంటున్నారు. అడుగులో అడుగు వేస్తూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటున్నారు. మేము ఎవరో తెలియక పోయినా మమ్మల్ని పలకరిస్తూ అనుభావాలను పంచుకుంటున్నారు. హమ్ హై సాథ్ సాథ్ అంటూ దేశం కోసం మనం..మనందరి కోసం దేశం అంటూ కలిసినడుస్తున్నారు. రాహుల్ గాంధీని విరామమెరుగక శక్తి నడిపిస్తుంది. ఆయనకు విశ్రాంతి లేదు. అదే ఉత్సాహం.. అదే నడక ఆద్యంతం అలా సాగిపోతూనే ఉంది. ప్రజల అడుగులే ఆయన బలం. దేశం కోసం రాహూల్ పోరాటం ఆగదు’’ అన్నారు.
షాహిద్ కమాల్ (బీహార్) తన అనుభవాలను వివరిస్తూ.. ‘‘అన్ని వర్గాలను కలుపుకుని సాగుతున్న ఈ యాత్ర ద్వారా ఎంతో తెలుసుకుంటున్నాను. ప్రజల్లో ఐక్యత కనిపిస్తుంది. భాయి భాయి అంటూ యాత్రలో పాల్గొంటున్నారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారు. విడదీసి పాలిస్తున్న మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఇక పుట్టగతులుండవ్. రాహుల్ యాత్ర ఈ మార్పు తేవడం ఖాయం. బిహార్ ప్రజలంతా రాహుల్ వెంటే’’ అంటూ పేర్కొన్నారు. సురేంద్ర పాల్ సింగ్(హర్యానా) మాట్లాడుతూ.. ‘‘ఈ జోడో యాత్రలో మీడియాను కూడా మోదీ ప్రభుత్వం కట్టడి చేస్తుంది. తమకు అనుకూలంగా నడుచుకునేట్టు ప్రయత్నిస్తుంది. ఇది ఎంతో విచారకరం. ఈ దశలో ప్రజల నీరాజనం మాత్రం రాహుల్ వెంటే ఉంటుంది. అడుగడుగునా ప్రోత్సాహం లభిస్తుంది. వారి ఆదరణ చూసి రాహుల్ అడుగులు యమ స్పీడుగా కదం తొక్కుతున్నాయి. ఈ యాత్ర ప్రభావం హర్యానాలో జోరుగా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఫేక్ న్యూస్‌లను పక్కన పెట్టి రాహుల్‌కు ప్రజలు జై కొడుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు. వీరేంద్ర సింగ్ బహురియా(హర్యానా) తమ అనుభూతులను వివరిస్తూ..‘‘కన్యాకుమారి నుంచి అడుగు వేస్తున్నా. ఈ అడుగు కాశ్మీర్ వరకు కొనసాగుగుతుంది. మోదీ మనుషులను విభజిస్తూ పాలిస్తున్నాడు. ఫలితంగా సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు. అమిత్ షా-మోదీల నియంతృత్వ పోకడల ఫలితంగా దేశం చిన్నా భిన్నమవుతుంది. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఆ రోజు ఎంతో దూరం లేదు’’ అన్నారు. దేశ సమగ్రత, సమైక్యతల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాహుల్ కు అండగా మేముంటాం అంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఏకమవుతున్నారు. ఇది ఎంతో మంచి ప్రణామం’’ అన్నారు.
సర్ఫరాజ్ ఖాజీ(మహారాష్ట్ర) మాట్లాడుతూ.. ‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నా నడక ఆగదు. రాహుల్ వెంటే నేను. దేశం కోసం.. ప్రజల కోసం రాహుల్ చేస్తున్న ఈ యాత్రకు మంచి స్పందన కనిపిస్తుంది. అందరూ ఏకమవుతున్నారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెళ్లిన ప్రతి చోటా సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. మోదీ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ప్రజల్లో లభిస్తున్న ఆదరణ అంతా ఇంతాకాదు. వారిని చూసి మేము మరింత ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తున్నాం’’ అన్నారు. విక్రాంత్ పాండే(ఉత్తర్ ప్రదేశ్) మాట్లాడుతూ…‘‘గాంధీ, చంద్రశేఖర్ యాత్రల తర్వాత ఈ యాత్ర ప్రజల్లోకి వొచ్చింది. దీని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇది అన్నివర్గాల వారిని ఐక్యం చేస్తున్న యాత్ర. భారత దేశానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సర్వమతాల సమ్మేళనంతో కూడుకున్న ఈ దేశాన్ని మోదీ ప్రభుత్వం మూడు ముక్కలు చేసి విడదీయాలనుకుంటుంది. యువతను పక్కదారి పట్టిస్తుంది. ఈ పరిస్థితిలో రాహుల్ ‘జోడో యాత్ర’ పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. యువతలో స్ఫూర్తిని నింపుతుంది’’ అని పేర్కొన్నారు.