రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

  • రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?
  •  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?
  •  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి

రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటారు. అందులో విశేషమేమంటుంది. వోట్లు తెచ్చుకుని ఎన్నికల్లో నెగ్గితేనే అధికారం వొస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, వోట్లు, మెజార్టీ సీట్లు, అధికారంలోకి వొచ్చేందుకు తగినన్ని సీట్లు రాకపోతే ప్రతిపక్ష స్థానం ఇవీ కదా కేంద్ర బిందువులు. వీటి చుట్టే కదా రాజకీయాలు పరిభ్రమిస్తుంటాయి. దీనికి రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ ఏమీ అతీతులు కారు. రాహుల్‌ గాంధీ ఏమి మాట్లాడినా, తక్కువ చేసి చూపించడం, మాట్లాడడం, చపలచిత్తుడని, పిల్లవాడి చేష్టలంటూ ప్రధాని మోదీ నుంచి అధికారంలో ఉన్న పార్టీ నేతలకు అలవాటైంది. రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. వాటిపై అధికార బీజేపీ రాద్దాంతం చేసింది. ప్రతిపక్ష పార్టీ నేతగా అయిన తర్వాత తొలిసారిగా రాహుల్‌గాంధీ అమెరికాకు వెళ్లారు. సిక్కుల స్థితి, రిజర్వేషన్లపై రాహుల్‌ గాంధీ మాట్లాడారు. దీనిపై బీజేపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విదేశీ గడ్డపై భారత్‌ను అవమానిస్తావా? అంటూ బీజేపీ విరుచుకుపడింది.

కాంగ్రెస్‌  పార్టీ నేత, రాహుల్‌ గాంధీపై విమర్శలు చేయడం ఇది మొదటి సారి కాదు. రాహుల్‌గాంధీని టార్గెట్‌ చేసుకుని అనుచిత విమర్శలు చేయడం బీజేపీకి మొదటి నుంచి అలవాటే. రాహుల్‌గాంధీ భారత్‌లో మత స్వేచ్చపై ప్రకటన చేశారు. అదీ భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాట్లాడారు. ఆరెస్సెస్‌, బీజేపీ మతతత్వ రాజకీయాలను రాహుల్‌గాంధీ వివరించారు . బీజేపీలో స్వేచ్చకు భిన్నత్వానికి తావులేదని, కాంగ్రెస్‌ పార్టీలో బహుముఖ ఆలోచనలు, వాదనలను ఆహ్వానించే సంస్కృతి ఉన్నట్లు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. బీజేపీలో భారతీయతత్వం లేదు. భిన్న సంస్కృతులను ఆదరించే స్వభావం ఆ పార్టీలో లేదు. వీటిని అర్థం చేసుకోకుండా, ఎంత సేపు రాహుల్‌ గాంధీ తత్వాన్ని నిలదీయడం, విమర్శించడం బీజేపీకి అలవాటైంది. విదేశీ నేలపై భారత్‌ను కించపరుస్తావా అనే బాణాలను రాహుల్‌ను సంధించడం  బీజేపీకి అలవాటుగా మారింది. 2014 ఆ తర్వాత జరిగిన ఎన్నికలు, సభల్లో ప్రధాని నరేంద్రమోదీ, ఆ పార్టీ నేతలు పలుసార్లు మాట మార్చిన సంగతి, నాలుక కరుచుకుని వెనక్కు తీసుకున్నారో  తెలిసిందే. ప్రజల్లో ఉన్న భావాలను వాస్తవాలను రాహుల్‌గాంధీ బహిర్గతం చేస్తే, బీజేపీ నేతలకు భుజాలు తడుముకోవడం అలవాటైంది.

అమెరికాలో మాడినన్‌  స్క్వైర్‌లో ప్రధాని  నరేంద్రమోదీ ఉపన్యాసం ఇవ్వడం తెలిసిందే. అక్కడ హిందుత్వ శ్రేణులకు జోష్‌ కలిగించే విధంగా మోదీ మాట్లాడారు. జర్మనీకి వెళ్లినప్పుడు మోదీజీ, మన దేశం ఇంకా నిధుల కోసం వెంపర్లాటపడుతుందంటూ విమర్శలు గుప్పించారు. తాను ప్రధానిగా అయ్యే ముందు భారత్‌లో స్కాంలు ఎక్కువగా ఉండేవని, అలాగే చైనాతో ఘర్షణ గురించి కూడా విమర్శలు చేసిన విషయం విదితమే. యూపీఏ హయాంలో అప్పటి ప్రభుత్వం నిధుల కోసం  ప్రపంచ దేశాల ముందు మోకరిల్లి ఉందన్నారు. కెనడా పర్యటనకు మోదీ వెళ్లినప్పుడు, తన కంటే ముందు భారత్‌ అంటే స్కాం ఇండియా అనే ముద్రపడిరదన్నారు. చైనా పర్యటనలో మాట్లాడినవుడు, భారత్‌ లో జన్మించడమే ఒక దురదృష్టమని అర్ధం వొచ్చే రీతిలో మోదీ ప్రసంగించారు. విదేశీ పర్యటనల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మన దేశ రాజకీయాల గురించి మాట్లాడడానికి శ్రీకారం చుట్టారు. పనిలోపనిగా దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్‌  పార్టీపై బురదజల్లడం ఆనవాయితీగా మారింది. పనిలోపనిగా నెహ్రూ  విధానాలపై దండెత్తడం అలవాటుగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలే భారత్‌ కష్టాలకు కారణమంటూ ఉపన్యాసాలు ఇవ్వడం మోదీ ప్రారంభించారు.

మోదీ మాట్లాడే తీరు ఎలా ఉందంటే, తాను విమర్శిస్తే మాత్రం అది దేశభక్తి అవుతుందా? అదే రాహుల్‌గాంధీ మాట్లాడితే మాత్రం దేశ వ్యతిరేకమవుతుందా?   బీజేపీ రాజకీయ దిగజారిందనడానికి ఇంతకంటే నిదర్శనమేమి కావాలి. రాహుల్‌ను బాలక్‌ బుద్ది లేదా పిల్ల చేష్టలు అని నిందించడం మోదీ ముమ్మాటికీ   తప్పే. రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా, మాట్లాడిన తీరును దుమ్మెత్తిపోయం బీజేపీకి  అలవాటుగా మారింది. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి పాతరేస్తోంది. తాజాగా రాహుల్‌ గాంధీ విదేశీ గడ్డపై జాతీయ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారనే నిందలు వేస్తున్నారు. ఈ రోజు సిద్దాంతపరంగా విమర్శిస్తే చాలు,

దేశ వ్యతిరేకులు, జాతి విద్రోహానికి పాల్పడుతున్నారనే ముద్రవేయడం ఫ్యాషెన్‌గా మారింది. ఏమి మాట్లాడినా రంద్రాన్వేషణ చేయడం , కౌంటర్లు ఇవ్వడం, గోరంతలు కొండంతలుగా చిత్రీకరించడం బీజేపీకి వెన్నతో పుట్టిన విద్యగా మారింది. ఇంకా మరో ముందుడుగు వేసి దేశ ప్రతిపక్ష నాయకుడు ఏమి మాట్లాడినా శత్రు దేశం పాకిస్తాన్‌ మాదిరిగా మాట్లాడుతున్నారనే అపవాదును మోపడం లాంటి తప్పుడు విధానాలకు బీజేపీ పాల్పడుతోంది. ప్రతిపక్ష నేతగా దేశం ఉన్నతికి, లోపాలు సరిదిద్దేందుకు ఏమి మాట్లాడాలో అవే మాట్లాడుతున్నారు. రాహుల్‌గాంధీ  అంతకంటే ఏమి మాట్లాడడం లేదు. దేశ సమగ్రతకు తూట్లుపొడుస్తున్న బీజేపీ ద్వంద్వ విధానాలను రాహుల్‌గాంధీ ఎత్తి చూపిస్తున్నారు. తన విధానపరమైన లోపాలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉంది. హుందా కలిగిన ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నారు.

రాహుల్‌గాంధీ మాటల్లో స్పష్టత, డొంకతిరుగుడు ఉండకపోవడం విశేషం. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముంపు పొంచి ఉందంటూ రాహుల్‌గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నానా యాగీ చేస్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఒక రాజకీయ నేత లేదా ప్రతిపక్ష నేత ఏమి మాట్లాడాలో అవే మాట్లాడుతున్నారు. అందులో రాహుల్‌ గాంధీ తప్పేమీ కనపడడం లేదు. తన కోసం వొచ్చే అభిమానులు, దేశాభిమానులకు దేశంలో నెలకొన్న పరిస్థితి గురించి వాస్తవాలను రాహుల్‌గాంధీ చెబుతున్నారు. ఇందులో తప్పేముంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌గాంధీకి ఉండదా? దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా? ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా ? రాహుల్‌గాంధీ పరిణితి చెందిన నాయకుడు. రాహుల్‌ మాట్లాడుతున్న యదార్ధాలను జీర్ణించుకోలేక బాలక్‌ బుద్ది అంటూ నిందించడం, దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి. రాహుల్‌ను చూసి  ఓర్వలేని తనాన్ని బీజేపీ మానుకోవాలి.

 -శామ్‌ సుందర్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page