పేద‌ల ప‌ట్ల మానవతా దృక్పథంతో  వ్యవహరించండి

ఇళ్ల కూల్చివేత‌కు నిర‌స‌న‌గా 25న బిజెపి ధర్నా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్ల‌డి

మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం న్యాయం కాదని, దీనిపై సీఎం రేవంత్ మానవతా దృక్పథంతో వ్యవహరించాల‌ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు కిష‌న్ రెడ్డి అన్నారు.  కర్వాన్ డివిజన్, కేసరి నగర్ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మూసి పరిధిలో పర్యటించిన కేంద్రమంత్రి ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్ర‌క్షాళ‌న‌పై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని, మూసీ పరీవాహక ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఒక్కో ఇటుక పేర్చి, కష్టపడి ఇండ్లు కట్టుకున్నార‌ని  తెలిపారు. 30 ఏండ్ల కిందటే క‌ట్టుకున్న‌ ఇండ్లకు కరెంట్ కనెక్షన్లతో పాటు నీటి సదుపాయం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, వోటర్ కార్డులు ఇచ్చారు. ప్రభుత్వం కూడా ట్యాక్సులు వసూలు చేస్తోంద‌న్నారు.

అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఒక్క ఇల్లు కట్టించలేదు. రెక్కాడితే గాని డొక్కాడని వేలాది మంది ప్రజల ఇళ్ల‌ను కూల్చుతోంద‌ని మండిప‌డ్డారు. నిజాం హయాంలో మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి మూసీ బ్యూటిఫికేషన్ చేయాల‌ని, అంతకంటే.. ముందు డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించే కార్యాచరణను రూపొందించాలని  ఆ తర్వాతే మూసీ సుందరీకరణ చేయాల‌న్నారు. పేదల గూడు కూలగొట్టి, సుందరీకరణ చేస్తామనడం ఎవరికోసం..? పేదల ఇండ్లు కూల్చే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రజల ఇండ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, రూ.25 వేలు ఇస్తామంటూ చెబుతున్నార‌ని,  దీనిని ప్రజలెవ్వరూ స్వాగతించట్లేదని, పేదల ఇండ్ల కూల్చాలనుకునే ముందు మమ్మల్ని జైలులో పెట్టి ఆ తర్వాత మీ కార్యాచరణ మొదలుపెట్టండి అని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలందరికీ బిజెపి అండగా ఉంటుంద‌ని కిష‌న్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.
మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చుతూ చేస్తున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతామ‌ని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page