పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు!

  • రూపాయి క్షీణతతో భారమవుతున్న దిగుమతులు..
  • ఆర్థిక మందగమనానికి చికిత్స అవసరం

మన దేశంలో ఉద్యోగాలు దక్కక ఎంతోమంది విదేశాలకు వెళ్లినా వారికి అక్కడ భరోసా దక్కడం లేదు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన భారతీయలు ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అటు ఉద్యోగాలు దొరక్క..ఇటు బ్యాంకు రుణాలు కట్టలేక తలపట్టుకుంటున్నారు. పోనీ దేశానికి వొచ్చి ఇక్కడేమైనా చేద్దామా అంటే ఇక్కడా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. ఉన్న ఉద్యోగులను మెల్లగా తీసేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాల ఫలితంగా నిరుద్యోగం పెరుగుతున్నది. అలాగే ప్రైవేట్‌ పెట్టుబడులు తగ్గుతున్నవి. ప్రభుత్వ ఉద్యోగాలకోసం యువత ఎదురుచూడటం ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నది. ఇలాంటి తక్షణ, అత్యవసర సమస్యల పరిష్కారంపట్ల దృష్టిసారించాల్సిందిపోయి నిర్లిప్తంగా ఉంటున్నాయి.

రాజకీయాలు నెరిపే పార్టీలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో ముందు ఆర్థిక వ్యవస్థ బలపడాలి. తరవాత స్వయం ఉపాధి పథకాలు భారీగా చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ దిశంగా చర్యలు తీసుకోవడం లేదు. ఆర్థిక మందగమనంపై దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కొనసాగుతున్నా ముందే చర్యలు తీసుకుని ఉంటే కొంతయినా పరిస్థితి మెరుగు పడేది. నిజానికి మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. గ్రావిరీణ ఆర్థికరంగం బలోపేతం కావాలి. కానీ అలా జరగడం లేదు. కులవృత్తులకు ప్రోత్సాహం లేదు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేసే చర్యలు తీసుకోవడం లేదు. నిరుద్యోగులను గట్టెక్కించే చర్యలకు బదులు, పన్నుల వసూళ్లపైనే దృష్టి సారిస్తున్నారు. అలాగే జిఎస్టీ సవరణలకు పూనుకోవడం లేదు. దీంతో ఉద్యోగ,ఉపాధి రంగాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. గతంలోనే ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌ రాజన్‌ అనేక హెచ్చరికలు చేసినా పట్టించుకోక పోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిరదనే చెప్పాలి. కారణాలను ఎవరో ఒకరివిరీద నెట్టి తప్పించుకోవడం కన్నా దూరదృష్టితో సాగివుంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు.

డాలర్‌తో మారక విలువను ఆధీనంలోకి తెచ్చుకోక పోతే మరిన్ని కష్టాలు తప్పవు. అలాగే ఎగుమతులకు ప్రాధాన్యం పెరగాలి. అనవసర దిగుమతులకు కళ్లెం వేయాలి. లేకుంటే విదేశీ మారక నిల్వలపై తీవ్రప్రభావం చూపనుంది. దీంతో రూపాయి మరింత బలహీన పడనుంది. ఈ దశలో ఆర్థిక మందగమనానికి చికిత్స వేసేందుకు ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఆర్థికవృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు చర్యలను ప్రకటించినట్లు చెబుతున్నా.. అవేవీ ఫలితం ఇవ్వడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే పారిశ్రామిక రంగానికి రుణాలు ఏ మాత్రం అందు బాటులోకి రాకపోవడంతో మార్కెట్‌లో మాంద్యం ఏర్పడిరదని అప్పట్లో విమర్శలు వొచ్చాయి. అది జిడిపి వృద్ధిరేటు దిగజారడానికి దారి తీసిందని విశ్లేషించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకైతే రుణవితరణలో ప్రతికూల వృద్ధి నమోదయింది. దేశ చరిత్రలో పారిశ్రామిక రంగానికి వాణిజ్య రుణాలు భారీగా తగ్గడం కూడా ఇదే ప్రథమమని భావించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలను గణనీయం గా పెంచడం ద్వారా ఆ లోటును పూడ్చింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగు తుండటం, అమెరికా-చ్కెనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, యుద్దాలు కూడా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కరెన్సీలు దారుణంగా పతనమవడం వంటి అంశాలు మన విదేశీ మారకపు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు రూపాయి పతనం పరోక్షంగా దోహదపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి క్షీణతతో దిగుమతులు భారమవుతాయి. చమురు, పసిడి దిగుమతుల వ్యయాలు పెరిగితే, దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. దిగుమతుల కోసం విదేశీ మారకపు నిల్వలను అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో, కరెంటు ఖాతా లోటు కూడా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, చదువుల ఖర్చులు భారమవుతాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో రవాణా వ్యయాలు పెరిగి సరకులు ప్రియమవుతాయి. అప్పుడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది.

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకుంటాయి. పరోక్షంగా ఇది దేశ అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీంతోపాటు డాలర్‌ బలపడుతున్నందున, విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తే, ఈక్విటీ మార్కెట్లు నష్టపోతాయి. ఈ మధ్య బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ హయాంలో వృద్ధిరేటు ఎక్కువ ఉందంటే తమ హయాంలోనే అని వాదులా డుకున్నాయి. కానీ జరుగుతున్న అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఫలాల పంపకం ఏ రీతిన ఉన్నదో చూడడం లేదు. అభివృద్ధి అన్నది ఉద్యోగ కల్పనకు గీటురాయిగా ఉండాలి. మొత్తానికి ఇప్పట్లో ఆర్థికరంగం కోలుకునేలా కనిపించడం లేదు. శాశ్వతంగా కుదురుకోవడానికి ఆర్థిక క్రమశిణను అవలంబిం చడమే సరైన మందు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలి. ప్రజలను బతకడానికి అవసరమైన విధానాలను అవలంబించాలి.

-వడ్డె మారెన్న
9000345368

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page